Janhvi Kapoor: నాన్న ఆ విషయం నాకూ చెప్పలేదు: జాన్వీ కపూర్‌

బాలీవుడ్‌ నటి జాన్వీకపూర్‌ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ‘దేవర’ సినిమా విశేషాలతో పాటు మరికొన్ని సంగతులు పంచుకున్నారు.

Updated : 22 Feb 2024 18:34 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘దేవర’ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న బాలీవుడ్‌ హీరోయిన్‌ జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor). ఇది విడుదలవకముందే దక్షిణాదిలో.. రామ్‌చరణ్‌ (Ram Charan) సరసన ఓ సినిమా (#RC 16)లో, సూర్య (Suriya)కు జోడీగా ఓ చిత్రంలో నటించేందుకు సిద్ధంగా ఉన్నారని ఆమె తండ్రి, నిర్మాత బోనీ కపూర్‌ చెప్పిన సంగతి తెలిసిందే. తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో దానిపై జాన్వీ స్పందించారు. ఆ స్టేట్‌మెంట్‌ గురించి బోనీ కపూర్‌ తనక్కూడా చెప్పలేదని, అధికారిక ప్రకటన లేకుండా వాటి గురించి మాట్లాడడం సబబు కాదని అన్నారు. ఆమె పంచుకున్న మరికొన్ని విశేషాలివీ..

‘దేవర’తో తెలుగు..

‘‘ఇప్పటివరకు నేను తెలుగు భాష నేర్చుకోలేదు. ‘దేవర’ (Devara) (ఎన్టీఆర్‌ హీరో) సినిమాతో తెలుగు నేర్చుకునే అవకాశం లభించింది. దర్శకుడు శివ కొరటాల, చిత్ర బృందానికి ఓపిక ఎక్కువ. తెలియని విషయాలు చెప్పడంలో సహాయపడుతుంది. సెట్స్‌కు వెళ్లే ముందురోజే డైలాగ్స్‌ ప్రిపేర్‌ అయి వెళ్లేదాన్ని. ఇది నా తొలి తెలుగు సినిమా అని చెప్పేందుకు ఆనందంగా ఉంది. పాటల చిత్రీకరణ మిగిలిఉంది’’

ఇలాంటి కథలనే ప్రేక్షకులు కోరుకుంటున్నారు..

‘‘కాంతార’ సినిమా ద్వారా కర్ణాటకలోని తుళునాడు సంస్కృతి, సంప్రదాయాల గురించి కొంత తెలుసుకోగలిగా. రూ.20 కోట్ల లోపు బడ్జెట్‌తో రూపొందిన ఆ సినిమా రూ.వందల కోట్లు వసూలు చేసింది. ఎంతమంది ఆ చిత్రాన్ని చూశారో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. మన మూలాలతో ముడిపడిన ఇలాంటి కథలను ప్రేక్షకులు ఎక్కువగా కోరుకుంటున్నారు. సాయి పల్లవి (Sai Pallavi), రోషన్‌ మ్యాథ్యూ, నివిన్‌ పాలీ దక్షిణాది నటులతో పాటు బెంగాలీ నటులు బాలీవుడ్‌లో నటిస్తుండటం సంతోషంగా ఉంది. తెలుగు, తమిళ సినిమాలు హిందీలో డబ్‌ అయి ఇక్కడ అత్యధిక వ్యూస్‌ సొంతం చేసుకుంటాయి. చిన్నప్పుడు ‘ఇంద్ర’ (తెలుగు) చిత్రాన్ని టీవీలో చూడడం నాకింకా గుర్తుంది’’

సంప్రదించకుండా స్టేట్‌మెంట్‌..

‘‘ఇటీవల మా నాన్న (బోనీ కపూర్‌) నా తదుపరి సినిమాల విషయమై నాతో సహా ఎవరినీ సంప్రదించకుండా స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. నేను ఏయే చిత్రాల్లో నటించబోతున్నానని ఆయన చెప్పారో వాటి గురించి మాట్లాడలేను. ప్రస్తుతం నేను ‘దేవర’, ‘మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మహి’ (Mr & Mrs Mahi), ‘ఉలఝ్‌’ (Ulajh) సినిమాలకు పని చేస్తున్నా’’ అని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని