Krishnamma: కృష్ణమ్మ.. అందరూ మాట్లాడుకునే చిత్రమవుతుంది

‘‘సత్యదేవ్‌ అద్భుతమైన నటుడని అందరికీ తెలుసు. అలాంటి నటుడికి ఒక సరైన సినిమా పడితే చాలు ఊహించని స్టార్‌డమ్‌ వస్తుంది.

Updated : 02 May 2024 09:48 IST

‘‘సత్యదేవ్‌ అద్భుతమైన నటుడని అందరికీ తెలుసు. అలాంటి నటుడికి ఒక సరైన సినిమా పడితే చాలు ఊహించని స్టార్‌డమ్‌ వస్తుంది. అది ఈ ‘కృష్ణమ్మ’ చిత్రంతో సాధ్యమవుతుందని నమ్ముతున్నా’’ అన్నారు దర్శకుడు రాజమౌళి. దర్శకుడు కొరటాల శివ సమర్పణలో సత్యదేవ్‌ హీరోగా నటించిన చిత్రమే ‘కృష్ణమ్మ’. వి.వి.గోపాలకృష్ణ తెరకెక్కించిన ఈ సినిమాని కృష్ణ కొమ్మలపాటి నిర్మించారు. అతీరా రాజ్‌ కథానాయిక. ఈ సినిమా ఈనెల 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే బుధవారం రాత్రి హైదరాబాద్‌లో విడుదల ముందస్తు వేడుక నిర్వహించారు. దర్శకులు ఎస్‌.ఎస్‌.రాజమౌళి, కొరటాల శివ, అనిల్‌ రావిపూడి, గోపీచంద్‌ మలినేని ముఖ్య అతిథులుగా హాజరై ఈ చిత్ర ట్రైలర్‌ విడుదల చేశారు. అనంతరం దర్శకుడు రాజమౌళి మాట్లాడుతూ.. ‘‘కొరటాల శివ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారని తెలియగానే నా దృష్టి దీనిపై పడింది. దర్శకుడి మాటల్లోని నిజాయతీ ఈ సినిమాలోనూ ఉంటుందని నమ్ముతున్నా. ఇప్పటికే విడుదలైన టీజర్‌, ట్రైలర్లు సినిమా చూడాలనిపించేలా ఉన్నాయి. ఇది పెద్ద విజయాన్ని అందుకోవాలని కోరుకుంటున్నా’’ అన్నారు. ‘‘చిత్ర బృందం ఎంతో నిజాయతీగా ఈ సినిమాని రూపొందించింది. వీళ్ల కష్టానికి తగిన ఫలితం దక్కుతుందని నమ్మకంగా ఉన్నాం. ఈ చిత్రంతో సత్యదేవ్‌ హీరోగా మరోస్థాయికి వెళ్తాడని నమ్ముతున్నా’’ అన్నారు దర్శకుడు కొరటాల శివ. ‘‘మంచి కథతో.. ఎంతో రియలిస్టిక్‌గా రూపొందించిన చిత్రమిది. సత్యదేవ్‌ కెరీర్‌లో ఎంతో ప్రత్యేకంగా నిలిచిపోతుంది’’ అన్నారు దర్శకుడు గోపీచంద్‌ మలినేని. హీరో సత్యదేవ్‌ మాట్లాడుతూ.. ‘‘ఇది కచ్చితంగా అందరూ మాట్లాడుకునే చిత్రమవుతుంది. ఇందులో చాలా మలుపులున్నాయి. రా రస్టిక్‌ పాత్రలున్నాయి. దీనికి కాలభైరవ అద్భుతమైన పాటలిచ్చారు. సినిమా చూశాక అవన్నీ ప్రేక్షకులకు ఇంకా బాగా నచ్చేస్తాయి’’ అన్నారు. ‘‘వెండితెరపై చూసి ఆస్వాదించాల్సిన చిత్రమిది’’ అన్నారు దర్శకుడు గోపాలకృష్ణ. ఈ కార్యక్రమంలో వై.రవిశంకర్‌, కాలభైరవ, అతీరా, అర్చనా అయ్యర్‌, బీవీఎస్‌ రవి, కృష్ణ, లక్ష్మణ్‌ మీసాల తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని