kriti sanon: హీరో ఒక్కడే థియేటర్లలోకి రప్పించలేడు

‘సినిమాలో పెద్ద హీరో ప్రధాన పాత్రధారిగా ఉన్నంతమాత్రాన ప్రేక్షకుడిని థియేటర్లలోకి రప్పించలేం. కథే సిసలైన హీరో’ అంటోంది కృతి సనన్‌.

Updated : 12 Apr 2024 08:00 IST

‘సినిమాలో పెద్ద హీరో ప్రధాన పాత్రధారిగా ఉన్నంతమాత్రాన ప్రేక్షకుడిని థియేటర్లలోకి రప్పించలేం. కథే సిసలైన హీరో’ అంటోంది కృతి సనన్‌. టబు, కరీనాకపూర్‌లతో కలిసి ఆమె నటించిన ‘క్రూ’ రూ.వందకోట్లు వసూళ్లు దాటిన నేపథ్యంలో మీడియాతో మాట్లాడుతూ తన అభిప్రాయాలు వెలిబుచ్చింది.

  • పరిశ్రమలోని వ్యక్తులు మొహమాటానికి ఒకరినొకరు పొగడ్తలతో ముంచెత్తుకోవడం కన్నా.. ఆపదల్లో ఉన్నవారికి నిజాయతీగా అండగా నిలబడితే బాగుంటుంది. పరిశ్రమలో సహనటీనటుల మధ్య ఐక్యతను నేను అంతగా చూడలేదు. ఒక సినిమా హిట్‌ అయినప్పుడు ఎంతమంది సంతోషిస్తున్నారో.. ఎంతమంది ఏడుస్తున్నారో అర్థం కావట్లేదు. ఒక సినిమా విజయం, వైఫల్యం ఏ ఒక్కరిపైనో ఆధారపడి ఉండవు. పూర్తి బాధ్యత మొత్తం చిత్రబృందంపై ఉంటుంది.
  • దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ కేవలం మహిళా పాత్రనే ఎంచుకొని ‘గంగూబాయి కాఠియావాడీ’ తెరకెక్కించారు. ఇందులో హీరో లేడు. అయినా బడ్జెట్‌ విషయంలో రాజీ పడలేదు. ఆ చిత్రం విమర్శకుల ప్రశంసలతోపాటు, రికార్డు వసూళ్లు రాబట్టింది కదా! కళ్లముందే ఇలాంటి సాక్ష్యం కనిపించినప్పుడు హీరోయిన్ల చిత్రాలకు బడ్జెట్‌ పరిమితులు ఎందుకో తెలియడం లేదు.
  • ప్రస్తుతం కాజోల్‌తో కలిసి ‘దో పత్తీ’ చేస్తున్నా. దీని చిత్రీకరణ పూర్తై, నిర్మాణానంతర కార్యక్రమాల్లో ఉంది. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డా. ముస్సోరీ, నైనిటాల్‌, మనాలీ లాంటి హిల్‌స్టేషన్లతోపాటు దాదాపు దేశమంతా తిరిగా. నిర్మాతగా నాకీ చిత్రం సరికొత్త అనుభవాన్ని ఇచ్చింది. నా మనసుకి నచ్చింది చేయడానికి, మహిళలకు మరిన్ని అవకాశాలు ఇవ్వడానికి తప్పకుండా ఇంకా సినిమాలు నిర్మిస్తా.
  • సినిమాలో ఒక పెద్ద హీరో ఉన్నంత మాత్రాన ప్రేక్షకులు థియేటర్లలోకి పరుగెత్తుకొని రారు. కథ బాగుంటే.. అందులో ప్రధాన పాత్రధారులు ఆడా? మగా? అని ఎవరూ చూడరు. దురదృష్టవశాత్తు కొందరు దర్శకనిర్మాతల్లో సైతం.. ‘మహిళా ప్రాధాన్య సినిమాలకు ప్రేక్షకులు రారు.. తాము చెల్లించిన టికెట్టుకి సరైన న్యాయం జరగదని ప్రేక్షకులు భావిస్తారు’ అనే అభిప్రాయం ఉంది. ఇది అపోహే.
  • కథానాయకులెవరూ లేకపోయినా ‘క్రూ’ గొప్పగా ఆడుతోంది. ఇది చూశాకైనా.. పరిశ్రమలో కొంచెమైనా మార్పు వస్తుందని ఆశిస్తున్నాను. ప్రేక్షకులు సైతం మారాలి. బాక్సాఫీసు నెంబర్లు చూస్తుంటే.. కథానాయికలు ప్రధాన పాత్రధారులుగా ఉన్న సినిమాలు సైతం అద్భుతాలు చేస్తాయనే విషయం అర్థమవుతోంది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని