Suhaas: రూ.3 కోట్ల రెమ్యూనరేషన్‌.. సుహాస్‌ ఏమన్నారంటే!

తాజాగా ‘ప్రసన్నవదనం’ టీజర్ లాంచ్‌ ఈవెంట్ జరిగింది. ఇందులో సుహాస్ తన రెమ్యూనరేషన్‌పై స్పందించారు.

Published : 07 Mar 2024 14:38 IST

చిన్న పాత్రలతో ప్రయాణం మొదలుపెట్టారు నటుడు సుహాస్ (Suhaas). ‘కలర్‌ఫోటో’, ‘రైటర్‌ పద్మభూషణ్‌’ చిత్రాలతో కథానాయకుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఇటీవల ‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’ సినిమాతో మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకొని.. ఇప్పుడు అర్జున్ వైకే ద‌ర్శ‌క‌త్వంలో మరో విభిన్న కథతో ‘ప్రసన్నవదనం’ (Prasanna Vadanam) అంటూ పలకరించేందుకు సిద్ధమయ్యారు. ఇందులో పాయల్ రాధాకృష్ణ, రాశీసింగ్ హీరోయిన్లు. లిటిల్ థాట్స్ సినిమాస్, అర్హ మీడియా బ్యాన‌ర్‌పై మణికంఠ, ప్రసాద్ రెడ్డి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం టీజర్ విడుదలైంది. ఇందులో సుహాస్ ఫేస్ బ్లైండ్‌నెస్ అనే వ్యాధితో బాధపడుతున్నట్లు చూపించారు. ఇక ఈ టీజర్‌ విడుదల సందర్భంగా చిత్రబృందం మీడియాతో మాట్లాడింది.

ఫేస్ బ్లైండ్‌నెస్ ఉంటే హీరోయిన్‌తో రొమాన్స్ ఎలా చేశారు?

సుహాస్: అది మీరు సినిమా చూసే తెలుసుకోవాలి. చాలా వినోదభరితంగా ఉంటుంది. అలాగే భావోద్వేగంతో కళ్లలో నీళ్లొస్తాయి.

గతంలో ఇదే పాయింట్‌తో కొరియన్‌ డ్రామాలు వచ్చాయి. ఇదీ ఆ తరహాలోనే ఉంటుందా?

అర్జున్ వైకే: నేను ఈ పాయింట్‌తో ఏ కొరియన్‌ డ్రామా చూడలేదు. ప్రసన్నవదనం చాలా కొత్తగా ఉంటుంది. దెయ్యాల సినిమాలు చాలా ఉంటాయి. కానీ, దేనికదే ప్రత్యేకం కదా.

‘‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’’ తర్వాత దీన్ని ఎంచుకోవడానికి కారణం?

సుహాస్: ఇది కూడా పెద్ద హిట్ అవుతుందని నమ్మకం కలిగింది. నేను ప్రతీ సినిమాకు కొత్తరకంగా ఉండే కథలను ఎంచుకుంటాను. అందుకే ప్రసన్నవదనంకు ఓకే చెప్పా. ఇందులో ఫన్‌తో పాటు థ్రిల్‌ కూడా ఉంటుంది. ఇలాంటి విభిన్నమైన కథలకు నన్ను ఎంచుకుంటున్నందుకు దర్శకులకు కూడా థ్యాంక్స్‌ చెప్పాలి.

మీరు రెమ్యూనరేషన్‌ మూడు వేల నుంచి మూడు కోట్ల రూపాయలకు పెంచారట నిజమేనా?

సుహాస్: నేను బతకాలి కదా (సరదాగా). జూనియర్ ఆర్టిస్టు దగ్గరి నుంచి ఈ స్థాయికి వచ్చాను. అప్పట్లో రోజుకు వంద రూపాయలు తీసుకున్నాను. అప్పటి మీద ఇప్పుడు మార్పు రావాలి కదా. మీరు అనుకుంటున్నంత మార్పు అయితే కాదులెండి. అంత పారితోషికం తీసుకోవట్లేదు(నవ్వుతూ).

ఎక్కువగా కొత్త దర్శకులకు అవకాశమివ్వడానికి కారణం?

సుహాస్: ఎవరైనా మొదటి సినిమాను ప్రేమించినట్లు తర్వాత వాటిని ప్రేమించరు. అందుకే ఎక్కువగా కొత్త వాళ్లతో చేయడానికి ఆసక్తి చూపుతాను. నేను ఏది చేయాలన్నా భయపడను.

‘ప్రసన్నవదనం’ పాత్ర గురించి చెబుతారా?

సుహాస్: ఇందులో ఇప్పటివరకు చూడని సుహాస్‌ను చూస్తారు. నేను స్టైలిష్‌గా కనిపిస్తాను. ప్రతీ అంశాన్ని బాగా చూపారు.
అర్జున్ వైకే: ఈ సినిమా ప్రారంభం నుంచి చివరివరకు హీరో ఫేస్ బ్లైండ్‌నెస్ అనే వ్యాధితో నిజంగానే బాధపడుతుంటాడు. టీజర్‌లో చూసింది నిజమే. సినిమా అంతా హీరో అలానే ఉంటాడు.

టీజర్‌లో ‘వన్ నేనొక్కడినే’ షేడ్స్‌ కనిపిస్తున్నాయి. దాని రిఫరెన్స్‌తో దీన్ని తీశారా?

అర్జున్ వైకే: నేను సుకుమార్‌ అసిస్టెంట్‌ను. ఆయన ప్రభావం నాపై ఎప్పుడూ ఉంటుంది. ఆయనకు ఈ కథ కూడా నచ్చింది. ప్రసన్నవదనం అంటే హ్యాపీ ఫేస్‌ అని అర్థం. కథకు సరిపోతుంది కాబట్టే ఆ టైటిల్‌ పెట్టాం.

ఆ పిల్లల చదువుకు సాయం చేస్తున్నా.. చెప్పకపోవడానికి కారణమదే: గోపీచంద్‌

యూట్యూబ్‌ నుంచి మొదలై మంచి హీరోగా ఎదిగారు. కొత్త హీరోలకు ఏమైనా సందేశమిస్తారా?

సుహాస్: ‘నా బతుకేంటో నాకే అర్థం కావట్లేదు. నీ భవిష్యత్తు ఎవరికి కావాలి’ అని ఓ డైలాగ్ ఉంటుంది. అలా ఉంది నా పరిస్థితి. నేనే హీరో అవుతానని అనుకోలేదు. కలలా ఉంది. షార్ట్‌ ఫిల్మ్స్‌లో మన టాలెంట్‌ నిరూపించుకుంటే అవకాశాలు వస్తాయి.

దర్శకుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టారా?

సుహాస్: పెట్టారండీ (నవ్వుతూ). ఫేస్ బ్లైండ్‌నెస్‌పై ఇప్పటివరకు సినిమాలు రాలేదు. ఇందులో నేను యాక్షన్ చేసినట్లు ఏ సినిమాలో చేయలేదు. దీన్ని అందరూ ఎంజాయ్‌ చేస్తారు. అందరికీ మంచి పేరు వస్తుంది. హీరోయిన్స్‌కు కూడా ప్రాధాన్యం ఉంటుంది.

ప్రస్తుతం స్టార్‌ హీరోల కంటే ఎక్కువ సినిమాలు చేస్తున్నారు. దీనిపై మీ అభిప్రాయం?

సుహాస్: ఈ సంవత్సరం అక్టోబర్ తర్వాత కొంచెం తగ్గిస్తాను. ఇయర్‌కు రెండు సినిమాలు చేస్తాను. నా సినిమాలు చూసి ప్రేక్షకులెవరూ నన్ను తిట్టుకోరని నా నమ్మకం. అలాంటివాటినే ఎంచుకుంటాను.

అన్ని సినిమాల్లో గ్లామర్‌ హీరోయిన్స్‌ను సెలక్ట్ చేసుకుంటున్నారు. కారణం?

సుహాస్: అలా ఏం లేదు. ‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’ హీరోయిన్‌ చాలా న్యాచురల్‌గా ఉంటుంది. 

ఈ సినిమా కోసం 3 ఏళ్ల నుంచి వర్క్‌ చేస్తున్నారు కదా? ఇబ్బంది పడ్డారా?

మణికంఠ:  ఇబ్బందులు ఏం పడలేదండి. రెండు రెండ్లు నాలుగు, సూర్యుడు తూర్పునే ఉదయిస్తాడు. సుహాస్‌ హిట్‌ కొడతాడు.. ఇది నా నమ్మకం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు