Gopichand: ఆ పిల్లల చదువుకు సాయం చేస్తున్నా.. చెప్పకపోవడానికి కారణమదే: గోపీచంద్‌

ప్రముఖ హాస్యనటుడు ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీ వేదికపై విశేష ఆదరణ సొంతం చేసుకున్న సెలబ్రిటీ టాక్‌ షో ‘ఆలీతో సరదాగా’ (Alitho Saradaga). ఈ షో సెకండ్‌ సీజన్‌ తాజాగా మొదలైంది. తొలి ఎపిసోడ్‌కు గోపీచంద్‌ (Gopichand) అతిథిగా విచ్చేశారు.

Published : 07 Mar 2024 09:54 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: సినిమాలపై ఉన్న ఆసక్తితో ఇంజినీరింగ్‌ చదువు పక్కనపెట్టి ‘తొలివలపు’తో హీరోగా ఎంట్రీ ఇచ్చారు నటుడు గోపీచంద్‌ (Gopichand). తొలి అడుగులో పరాజయాన్ని అందుకున్న ఆయన ‘జయం’, ‘నిజం’, ‘వర్షం’తో విలన్‌గా మారి వెండితెరపై సత్తా చూపించారు. ‘యజ్ఞం’తో హీరోగా సక్సెస్‌ రుచి చూసిన గోపీచంద్‌ ప్రస్తుతం వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఆయన నటించిన సరికొత్త చిత్రం ‘భీమా’ (Bhimaa). ఫాంటసీ యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కింది. మార్చి 8న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో ఆలీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమంలో ఆయన పాల్గొని పలు విశేషాలు పంచుకున్నారు.

నీ కటౌట్‌ చూసి ‘భీమా’ టైటిల్‌ పెట్టారా? లేదా హీరో పాత్రను ఆధారంగా చేసుకుని పెట్టారా?

గోపీచంద్‌: దర్శకుడు హర్ష కథ రాసుకునేటప్పుడే హీరో పాత్రకు ‘భీమా’ అనే పేరు పెట్టాడు. షూట్‌ సమయంలో ఆ విషయం నాతో చెప్పాడు. పేరు చాలా బాగుందనిపించింది. పవర్‌ఫుల్‌గా అనిపించి ఇదే టైటిల్‌ పెడదామని చెప్పా. ఇందులో శివతత్వంపై చిన్న పాయింట్‌ ఉంటుంది. శివుడి మీదే సినిమా మొదలవుతుంది. పూర్తయ్యేది కూడా శివుడిపైనే. శివుడికి మరో పేరు భీమా అని దర్శకుడు చెప్పాడు.

‘భీమా’ కథ ఎలా ఉండనుంది?

గోపీచంద్‌: పరశురామ క్షేత్రంలో జరిగే కథగా దీనిని సిద్ధం చేశాం. పవర్‌ఫుల్‌ పోలీస్‌ అధికారి పాత్రలో కనిపించనున్నా. హర్ష చెప్పిన స్క్రీన్‌ప్లే నాకెంతో నచ్చింది. రివర్స్‌ స్క్రీన్‌ప్లే బాగా రాశాడు. ఇది రెగ్యులర్‌ పోలీస్‌ కథ కాదు. ఇందులో సెమీ ఫాంటసీ ఎలిమెంట్‌ ఉంది. ఇప్పటివరకూ నేను ఇలాంటిది చేయలేదు. విన్నప్పుడు కొత్తగా అనిపించింది. బాగా కనెక్ట్‌ అయ్యా. ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుందని భావిస్తున్నా.

కుటుంబసభ్యులందరూ ఎలా ఉన్నారు? పిల్లలు ఏం చేస్తున్నారు?

గోపీచంద్‌: అందరూ బాగున్నారు. చెల్లి డెంటిస్ట్‌. బావ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌. వాళ్లకు ఇద్దరు కుమార్తెలు. హైదరాబాద్‌లోనే ఉంటున్నారు. అమ్మ నా దగ్గరే ఉంటుంది. నాకు ఇద్దరు పిల్లలు. పెద్దోడికి 10 ఏళ్లు. చిన్నోడికి ఐదేళ్లు. జూనియర్‌ గోపీ ఎవరనేది ఇప్పుడే చెప్పలేం. పెద్దోడు నా సినిమాలు బాగా చూస్తాడు. విశ్లేషణ చేస్తుంటాడు. ఇక్కడ ఇలా ఎందుకు చేశావు? అలా ఎందుకు చేశావు? అని అడుగుతుంటాడు. ఇలా చేయండి, ఉండండి అని నేను ఫోర్స్‌ చేయను. వాళ్లు ఏం చేస్తానన్నా సపోర్ట్‌ చేస్తా. ఒక్కరినైనా డైరెక్టర్‌ చేయాలని ఉంది.

Janhvi Kapoor: జాన్వీ కపూర్‌ పేరు వెనుక ఉన్న సీక్రెట్‌ తెలుసా..!

దర్శకుడు తేజ తెరకెక్కించిన ‘జయం’ వల్లే మీకు బ్రేక్‌ వచ్చింది కదా. మరి, ఆయన మిమ్మల్ని హీరోగా పెట్టి సినిమా చేయాలనుకున్నప్పుడు మీరు ఫోన్‌ కూడా లిఫ్ట్ చేయలేదంట?

గోపీచంద్‌: అలాంటిది ఏమీ లేదు. ఆయన నాతో ఒక సినిమా చేయాలనుకున్నారు. అదొక లేడీ ఓరియెంటెడ్ కథ. దానికి నేను సెట్‌ కాననిపించింది. కొత్త అమ్మాయిని నన్ను పెట్టి చేయడం కష్టమవుతుంది. ఎవరైనా పేరు పొందిన హీరోయిన్‌ని పెడితే బాగుంటుందనిపించింది. అదే విషయాన్ని తేజతో చెప్పా. నా అభిప్రాయంతో ఆయనా ఏకీభవించారు. మొహమాటానికి పోయి కొన్ని సినిమాలు చేసి గతంలో నేను నష్టపోయిన సందర్భాలు ఉన్నాయి. అందుకే, కథ నచ్చి నాకు సెట్‌ అవుతుందనిపిస్తేనే చేస్తున్నా. లేకపోతే చేయనని చెప్పేస్తున్నా.

మీ సినిమా టైటిల్స్‌ చివర్లో సున్నాలు (లక్ష్యం, లౌక్యం, రణం, పంతం) ఉంటాయి. అదేమైనా సెంటిమెంటా? తదుపరి చిత్రాలు ఎవరితో చేస్తున్నారు?

గోపీచంద్‌: అలాంటిది ఏమీ లేదు. అవన్నీ అలా కుదిరాయి. ‘భీమా’ తర్వాత శ్రీనువైట్లతో సినిమా చేస్తున్నా. 30 శాతం షూట్‌ పూర్తైంది. కొన్ని పాటలు షూట్‌ చేశాం. టైటిల్‌ ఇంకా ఫిక్స్‌ చేయలేదు. యాక్షన్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ కలగలిపి శ్రీనువైట్ల స్టైల్‌లో ఆ సినిమా ఉంటుంది.

‘భీమా’లో కష్టంగా అనిపించిన సీక్వెన్స్‌ ఏమైనా ఉందా?

గోపీచంద్‌: దాదాపు 16 రోజులపాటు అడవిలో యాక్షన్‌ ఎపిసోడ్‌ షూట్‌ చేశాం. ఆ సీక్వెన్స్‌ గురించి దర్శకుడు చెప్పినప్పుడు చాలా బాగుందనిపించింది. కానీ, సెట్‌లోకి అడుగుపెట్టినప్పుడు చాలా క్లిష్టంగా అనిపించింది. రంపచోడవరం అటవీ ప్రాంతంలో షూట్. అడవిలో రాత్రిపూట షూట్‌ చేసిన అనుభవం నాకు లేదు. మొదటిరోజు భారీ వర్షం. నల్ల తేళ్లు, పాములు.. బిక్కుబిక్కుమంటూ ఆ సీక్వెన్స్‌ పూర్తి చేశాం. ఆ ఎపిసోడ్‌ ఆడియన్స్‌కు తప్పక నచ్చుతుంది.

రష్యాలో చదువుకునే రోజుల్లో ఫ్రెండ్‌ బర్త్‌డే పార్టీకి వెళ్లి బాగా ఎంజాయ్‌ చేశారంట?

గోపీచంద్‌: రష్యాలో నేను మెకానికల్‌ ఇంజినీరింగ్‌ చేశా. నాకు మద్యం అలవాటు లేదు. ఫ్రెండ్‌ బర్త్‌డే పార్టీలో మా గ్యాంగ్‌ మొత్తం ప్లాన్‌ చేసి నాతో తాగించారు. కట్‌ చేస్తే రెండు రోజులు వాంతులు. కోలుకోవడానికి రెండు రోజులు పట్టింది. ఆ తర్వాత వేరే వాళ్లను అడిగితే జరిగింది చెప్పారు.

రేష్మ (హీరో శ్రీకాంత్‌ మేనకోడలు)తో వివాహం ఎలా నిశ్చయమైంది? ఆమె నీకు ఇచ్చిన తొలి బహుమతి ఏమిటి?

గోపీచంద్‌: సినిమాలపరంగా శ్రీకాంత్‌తో నాకు పరిచయం ఉంది. ఆయన మేనకోడలు రేష్మ ఫొటో నేనొకసారి చూశా. పెళ్లి గురించి ఆయనతో ఎలా మాట్లాడాలో అర్థం కాలేదు. చలపతిరావుగారితో చెప్పా. ‘కంగారు పడకు నేను మాట్లాడతా’ అని ముందుండి నడిపించారు. అలా మా పెళ్లి జరిగింది. పెళ్లి ఫిక్స్‌ అయ్యాక.. టీ షర్ట్‌, గ్రీటింగ్‌ కార్డు గిఫ్ట్‌గా ఇచ్చింది.

‘భీమా’లో చూపించిన గిత్తను ఒంగోలు నుంచి తీసుకువచ్చారా?

గోపీచంద్‌: గిత్త మీద కూర్చొని ఎంట్రీ ఇవ్వాలని హర్ష చెప్పినప్పుడు సీజీ చేద్దామన్నా. సహజంగా అనిపించదని నచ్చజెప్పి నన్ను ఒప్పించాడు. చెన్నై నుంచి గిత్తను తెప్పించాడు. ఒక రోజంతా దాని పక్కనే ఉండి.. గడ్డి పెట్టా. అలా దాన్ని మచ్చిక చేసుకుని షాట్‌ పూర్తి చేశా.

పూరీ జగన్నాథ్‌ (Puri Jagannadh) చేతిలో పడిన ఏ హీరోకైనా లుక్‌ లేదా బాడీ లాంగ్వేజ్‌ మారడం సహజం. ‘గోలీమార్‌’లో మాత్రం నువ్వు ఏం మారలేదు. ఎందుకలా?

గోపీచంద్‌: ఆయన చెప్పిన కథ నాకెంతో నచ్చింది. కథకు అనుగుణంగా మారమని సలహాలు, సూచనలు చేస్తారనుకున్నా. కానీ ఆయన ఏం చెప్పలేదు. షూట్‌లోకి అడుగుపెట్టిన తర్వాత ‘సర్‌.. ఇలా ఓకేనా? బాడీ లాంగ్వేజ్‌ ఏమైనా మార్చాలా’ అని అడిగా. ‘ఇది చాలా బాగుంది. ఇలా కంటిన్యూ చెయ్‌’ అని బదులిచ్చారు.

సినిమా చేస్తున్నప్పుడు సక్సెస్‌ అవుతుందని భావించి.. రిలీజ్‌ అయ్యాక నిరుత్సాహపడిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా?

గోపీచంద్‌: నాకు బాగా నచ్చిన సినిమా ‘ఒక్కడున్నాడు’. మంచి కాన్సెప్ట్. దానికి రావాల్సినంత పేరు రాలేదు. అదే చిత్రాన్ని ఇప్పుడు తీసి ఉంటే పెద్ద హిట్‌ అయ్యేది. చిన్న చిన్న తప్పులు ఉన్నప్పటికీ ‘గౌతమ్‌నంద’కు అనుకున్నంత సక్సెస్‌ దక్కలేదు. అందులో నేను హీరో - విలన్‌ రోల్స్‌ చేశా.

ప్రభాస్‌ నీకు క్లోజ్ ఫ్రెండ్‌ కదా. ఆయన పెళ్లి ఎప్పుడు?

గోపీచంద్‌: తెలియదు. ప్రభాస్‌ (Prabhas) సినిమాల్లోకి రావాలనుకుంటున్నప్పుడే మా మధ్య పరిచయమైంది. ‘వర్షం’తో స్నేహం మరింత బలపడింది. కలిసి సినిమా చేయాలని అనుకుంటున్నాం. తను ఇప్పుడు బిజీగా ఉన్నాడు. తప్పకుండా మేమిద్దరం కలిసి సినిమా చేస్తాం.

బయోపిక్‌లో నటించే అవకాశం వస్తే ఎవరి జీవిత కథలో నటిస్తావు?

గోపీచంద్‌: భగత్‌సింగ్‌ చేయాలని ఉంది. అదొక పవర్‌ఫుల్‌ పాత్ర.

నువ్వు నటించిన చిత్రాల్లో దేనిని రీ రిలీజ్ చేయాలనుకుంటున్నావు?

గోపీచంద్‌: 4కె, మ్యూజిక్‌ కాస్త మార్చి ‘సాహసం’ రీ రిలీజ్‌ చేస్తే అది మళ్లీ బ్లాక్‌ బస్టర్‌ అవుతుంది. ఆ సినిమా కోసం బాగా కష్టపడ్డాం. అది నాకెంతో ఇష్టమైన మూవీ. ‘ఒక్కడున్నాడు’ రీమేక్‌ చేయొచ్చు.

ప్రతినాయకుడి పాత్రల్లో చేయమని ఈ మధ్య కాలంలో ఎవరైనా అడిగారా? సల్మాన్‌, షారుక్‌ సినిమాల్లో విలన్‌ పాత్రల కోసం అడిగితే చేస్తావా?

గోపీచంద్‌: అలా ఏమీ రాలేదు. హీరో పాత్ర నెగెటివ్‌ షేడ్స్‌లో ఉండే రోల్స్‌ చేయాలని ఉంది. నేను నటించిన చిత్రాలు హిందీలోనూ డబ్‌ అయ్యాయి. హిందీ నిర్మాతలు అవకాశాలు ఇచ్చారు. కానీ, తెలుగులో సంతోషంగానే ఉన్నా.

నువ్వు ఎంతోమంది పిల్లలను చదివిస్తున్నావు కదా. దాన్ని ఎందుకు బయటకు చెప్పడం లేదు?
గోపీచంద్‌: మనం ఇష్టంతో చేసే పనిని బయటకు చెప్పాల్సిన అవసరం ఏముంది. ఇప్పటివరకూ నేను కొంతమందిని చదివించా. అందులో కొందరు ఉద్యోగాల్లోనూ జాయిన్‌ అయ్యారు. కొంతమందికి నా పేరు కూడా తెలియదు. చదివే వాళ్లకు సాయం చేస్తున్నా. చదువుకు ప్రాధాన్యం ఇవ్వడానికి కారణం.. ఒక వ్యక్తి తన కాళ్లపై తాను నిలబడటానికి  ఉపయోగపడుతుంది. మంచి స్కూల్‌ పెట్టాలని నాన్న అనుకున్నారు. మా చిన్నప్పుడు ఒంగోలులో స్కూల్‌ పెట్టారు. ఆయన మరణం తర్వాత మేము దాన్ని కొనసాగించలేకపోయాం.

గోపీచంద్‌: మీరు ఎన్నో ఏళ్ల నుంచి సినిమాలు చేస్తున్నారు. ఎంతోమంది స్టార్స్‌ను చూశారు. అప్పటికి, ఇప్పటికి ఉన్న తేడా ఏమిటి?
ఆలీ: ఆనాటి రోజులు నిజంగానే గోల్డెన్‌ డేస్‌. ఇటీవల మెగాస్టార్‌ చిరంజీవికి పద్మవిభూషణ్‌ రాగానే పుష్పగుచ్ఛం తీసుకువెళ్లి ఇచ్చాను. ఆయన వెంటనే దగ్గరకు తీసుకుని మనలో మనకు ఇవన్నీ ఎందుకు అన్నారు. ‘లేదు అన్నా. ఎక్కడ మొగల్తూరు. ఎక్కడ మీ విజయం. మీ ఇంటికి వస్తుంటే మీరు పడిన కష్టం కనిపిస్తుంది’ అనగానే.. ‘ఇదే కదా మన ప్రయాణం’ అని చెప్పారు. చెన్నైలో అడుగు పెట్టినప్పుడు కష్టాలు ఎదుర్కొన్నా. తిండి లేకపోయినా ఫర్వాలేదు కానీ, వేరే వాళ్ల వద్ద చేతులు చాచకూడదనుకున్నా. సైకిల్‌ వేసుకుని ఆఫీసుల చుట్టూ తిరిగా. ఇప్పుడు అక్కడికి వెళ్తే ఆనాటి జ్ఞాపకాలు కళ్ల ముందు మెదులుతాయి. నాకు ఎవరి సపోర్ట్‌ లేదు. స్వతహాగా ఈ స్థాయికి వచ్చా. ఇప్పుడు వచ్చే ఆర్టిస్టులు చాలామందికి.. ‘‘జీవితమంటే ఇది కాదు’ అని నేను చెప్తుంటా.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని