Prasanna vadhanam: ఇందులో అన్నీ ఉంటాయి

‘‘ప్రేక్షకులకు చాలా తృప్తినిచ్చే సినిమా ‘ప్రసన్న వదనం’. దీన్ని సీటు అంచున కూర్చొని ఆస్వాదిస్తారు. అదిరిపోయిందని చప్పట్లు కొడతారు’’ అన్నారు సుహాస్‌.

Updated : 02 May 2024 09:52 IST

‘‘ప్రేక్షకులకు చాలా తృప్తినిచ్చే సినిమా ‘ప్రసన్న వదనం’. దీన్ని సీటు అంచున కూర్చొని ఆస్వాదిస్తారు. అదిరిపోయిందని చప్పట్లు కొడతారు’’ అన్నారు సుహాస్‌. ఆయన కథానాయకుడిగా నటించిన ఈ చిత్రాన్ని అర్జున్‌ వై.కె తెరకెక్కించారు. జె.ఎస్‌ మణికంఠ, టీ¨ఆర్‌ ప్రసాద్‌ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. పాయల్‌ రాధాకృష్ణ, రాశీ సింగ్‌ కథానాయికలు. ఈ సినిమా ఈ నెల 3న విడుదల కానున్న నేపథ్యంలో హైదరాబాద్‌లో బుధవారం విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా హీరో సుహాస్‌ మాట్లాడుతూ.. ‘‘ఇప్పటికే ఈ చిత్ర ఫస్ట్‌ కాపీ చూసుకున్నాం. సినిమా పక్కా బ్లాక్‌బస్టర్‌. అందులో ఏ అనుమానం లేదు. నా చిత్రాలు ఎక్కువ మౌత్‌ టాక్‌ వల్ల ఆడుతుంటాయి. కాబట్టి తొందరగా ఎవరికి కుదిరితే వారు సినిమా చూసి మిగతా వారికి చెప్పాలి’’ అన్నారు. ‘‘ఇదొక వినూత్నమైన కథాంశంతో రూపొందిన కమర్షియల్‌ చిత్రం. ఫన్‌, థ్రిల్‌, రొమాన్స్‌, ఎమోషన్స్‌.. ఇలా అన్ని అంశాలతో నిండి ఉంటుంది. తప్పకుండా ఇది అందర్నీ అలరిస్తుంది’’ అన్నారు దర్శకుడు అర్జున్‌. ఈ కార్యక్రమంలో రాశీ సింగ్‌, పాయల్‌ రాధాకృష్ణ, ప్రసాద్‌ రెడ్డి, మణికంఠ తదితరులు పాల్గొన్నారు.


సైన్స్‌ ఫిక్షన్‌ ‘దర్శిని’

వికాస్‌, శాంతి, సత్య ప్రసాద్‌ ప్రధాన పాత్రల్లో ప్రదీప్‌ అల్లు తెరకెక్కించిన చిత్రం ‘దర్శిని’. ఎల్‌.వి.సూర్యం నిర్మించారు. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లో ఇటీవల ట్రైలర్‌ను విడుదల చేశారు. దర్శకుడు అల్లు ప్రదీప్‌ మాట్లాడుతూ.. ‘‘ఇదొక విభిన్నమైన సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌. చాలా కొత్తగా.. అందరికీ నచ్చేలా ఉంటుంది. దీన్ని ఈ నెలలోనే విడుదల చేస్తాం’’ అన్నారు. ‘‘ప్రేమ, వినోదం, భావోద్వేగాలు.. అన్నీ ఉన్న చిత్రమిది. జీవితం మీద అసంతృప్తిగా ఉన్న ముగ్గురికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయన్నది ఈ చిత్ర కథాంశం. త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అన్నారు నిర్మాత సూర్యం.


ఇద్దరు ఖైదీలు.. ఇద్దరు డిటెక్టివ్‌లు!

మోహన్‌ భగత్‌, సుప్రిత సత్యనారాయణ్‌, భూషణ్‌ కల్యాణ్‌, రవీంద్ర విజయ్‌ ప్రధాన పాత్రల్లో వి.అజయ్‌ నాగ్‌ తెరకెక్కించిన చిత్రం ‘ఆరంభం’. అభిషేక్‌ వీటీ నిర్మించారు. ఈ సినిమా ఈనెల 10న థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లో బుధవారం ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు అజయ్‌ నాగ్‌ మాట్లాడుతూ.. ‘‘నా మిత్రుడు రాసిన ఓ కన్నడ నవల ఆధారంగా నేనీ కథ రాసుకున్నా. ఈ సినిమాలో ఇద్దరు ఖైదీలు జైలు నుంచి తప్పించుకుంటారు. వాళ్ల కేసు ఇన్వెస్టిగేషన్‌ కోసం ఇద్దరు డిటెక్టివ్‌లు రంగంలోకి దిగుతారు. ఈక్రమంలో వారికి ఒక డైరీ దొరుకుతుంది. మరి అందులో ఖైదీల గురించి ఏం రాసుంది? వాళ్లు దొరికారా? లేదా? అన్నది ప్రధాన ఇతివృత్తం. ఇది వివిధ జానర్స్‌లో సాగే సినిమాలా ఉంటుంది. తప్పకుండా అందరికీ నచ్చుతుంది’’ అన్నారు. ‘‘డ్రామా, సైన్స్‌ ఫిక్షన్‌తో పాటు బలమైన భావోద్వేగాలతో ఆకట్టుకునేలా ఉంటుందీ చిత్రం. దీంట్లో తల్లి పాత్రకు చాలా ప్రాధాన్యముంటుంది’’ అన్నారు హీరో మోహన్‌ భగత్‌. నిర్మాత అభిషేక్‌ మాట్లాడుతూ.. ‘‘కథా బలమున్న చిత్రాలకు ఆదరణ దక్కుతున్న రోజులివి. అలాంటి మంచి కథతో వస్తున్న మా ‘ఆరంభం’ కూడా పెద్ద హిట్టవుతుందని నమ్ముతున్నాం’’ అన్నారు. ఈ కార్యక్రమంలో అభిషేక్‌, భూషణ్‌ కల్యాణ్‌, రవీంద్ర విజయ్‌, సురభి పవిత్ర, శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని