Prasanth Varma: హను-మాన్‌.. ఇదంతా కలలా ఉంది: ప్రశాంత్‌ వర్మ

‘హను-మాన్‌’ (Hanuman) సినిమా విశేషాలను విలేకర్లతో పంచుకున్నారు చిత్ర దర్శకుడు ప్రశాంత్‌ వర్మ (Prasanth Varma).

Published : 11 Jan 2024 22:41 IST

హైదరాబాద్‌: విభిన్నమైన కథలతో ప్రేక్షకులకు చేరువైన దర్శకుడు ప్రశాంత్‌ వర్మ (Prasanth Varma). ఆయన సినిమాటిక్‌ యూనివర్స్‌ నుంచి వస్తోన్న చిత్రం ‘హను-మాన్‌’ (Hanuman). తేజ సజ్జా (Teja Sajja) హీరోగా తెరకెక్కిన ఈ సూపర్‌ హీరో ఫిల్మ్‌ సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రశాంత్ తాజాగా విలేకర్ల సమావేశంలో పాల్గొన్నారు. సినిమా విశేషాలు పంచుకున్నారు.

హను-మాన్‌లో ప్రధాన పాత్ర కోసం తేజని ఎంచుకోవడానికి కారణం ఏమిటి?

ప్రశాంత్‌ వర్మ: సినీ పరిశ్రమలో తేజ నాకంటే సీనియర్. తనకి యాక్టింగ్ నేర్పించాల్సిన అవసరం లేదు. ఇందులో పల్లెటూరి కుర్రాడిలా కనిపిస్తాడు. ‘హను-మాన్’ కోసం తేజని మేకోవర్ చేయించా. అది సెట్ అయ్యాక వెనక్కి తిరిగి చూడలేదు. ఈ ప్రాజెక్ట్‌ కోసం తేజ చాలా కష్టపడ్డాడు. ఇది పూర్తయ్యే వరకూ మరో చిత్రానికి సంతకం చేయలేదు. దీనిపై నాకంటే తనే ఎక్కువ ఆశలు పెట్టుకున్నాడు. అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్‌కుమార్, వినయ్ రాయ్ కీలక పాత్రలు పోషించారు. సముద్రఖని పాత్ర ప్రత్యేకంగా ఉంటుంది.

ముందు అనుకున్న విధంగా తొమ్మిది నెలల్లో దీనిని పూర్తి చేయలేకపోవడానికి కారణం ఏమిటి?

ప్రశాంత్‌ వర్మ: వీఎఫ్ఎక్స్‌పై నాకు పూర్తి అవగాహన ఉందనుకున్నా. సినిమా మొదలుపెట్టిన తర్వాతే అందులోని సాధకబాధకాలు బాగా అర్ధమయ్యాయి. ‘జాంబీరెడ్డి’లో 50 షాట్స్ ఉంటే.. ఇందులో 1600 వీఎఫ్‌ఎక్స్‌ షాట్స్ ఉన్నాయి. అదీకాక వీఎఫ్‌ఎక్స్‌ కంపెనీ వారు అనుకున్న సమయానికి వర్క్ పూర్తి చేయలేకపోయారు.

ఎన్టీఆర్ ‘సూపర్ మ్యాన్’తో దీనికి ఏమైనా పోలికలు ఉంటాయా?

ప్రశాంత్‌ వర్మ: ఇందులో ‘సూపర్ మ్యాన్’కి సంబంధించిన హోమయిస్ ప్లే చేశాం. సినిమా మొదలైనప్పుడు తెలుగులో ఇదే మొదటి సూపర్ హీరో మూవీ అనుకున్నాం. గతంలో ఎన్టీఆర్‌ చేశారని ఆ తర్వాతే తెలిసింది. దానికి తగ్గట్టుగా ఇందులో ‘సూపర్ మ్యాన్’ హోమయిస్ చూపించాం.

హను-మాన్‌ నుంచి ప్రేక్షకులు ఎలాంటి కొత్తదనాన్ని ఆశించవచ్చు?

ప్రశాంత్‌ వర్మ: సూపర్ హీరో ఫిల్మ్స్‌ ఎలా ఉంటాయో ఈ సినిమా కూడా అలాగే ఉంటుంది. కొత్తదనం ఏమిటంటే.. దీనిని తెలుగు సినిమా స్టైల్‌లో తీర్చిదిద్దాం. ‘బ్యాట్‌మ్యాన్‌’ లాంటి చిత్రాన్ని రాజమౌళి తెరకెక్కిస్తే ఎలా ఉంటుందో ఇది అలా ఉంటుంది. ‘కేజీయఫ్‌’లో యశ్‌ను ఎలా చూపించారో ఈ సినిమాలో హనుమంతుణ్ని (తేజ సజ్జా) అలా చూపించబోతున్నా.

ఉత్తరాదిలో ఎలాంటి రెస్పాన్స్‌ ఉంది?

ప్రశాంత్‌ వర్మ: అక్కడ మంచి రెస్పాన్స్‌ వస్తోంది. దక్షిణాది చిత్రాలను అక్కడివాళ్లు బాగా ఆదరిస్తున్నారు. ‘హను-మాన్’ తెరకెక్కిస్తున్నామని అనౌన్స్‌ చేసినప్పుడు.. దక్షిణాది వాళ్లు గొప్పగా తీస్తారంటూ అభినందించారు. ఆ మాటలు నాకెంతో ఆనందాన్ని ఇచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా దీనికి వస్తోన్న స్పందన చూస్తుంటే ఇదంతా ఒక కలలా ఉంది.

Venkatesh:‘సైంధవ్‌’ తర్వాత ఇలాంటి సినిమాలు మరిన్ని వస్తాయి: వెంకటేశ్‌

నిర్మాత నిరంజన్ రెడ్డితో వర్కింగ్‌ ఎలా ఉంది?

ప్రశాంత్‌ వర్మ: నిరంజన్ రెడ్డి పాజిటివ్ పర్సన్‌. సినిమా ఏదైనా సరే గ్రాండ్‌గా చేయాలనే తపన ఉన్న నిర్మాత. అవసరమైతే స్పానిష్‌లో పాటలు చేయిద్దామన్నారు.

హను-మాన్ కంటెంట్‌ గురించి కాకుండా థియేటర్ల గురించి చర్చ ఎక్కువగా జరుగుతుంది. దానిపై మీ స్పందన ఏమిటి?

ప్రశాంత్‌ వర్మ: ఒక ఫిల్మ్‌మేకర్‌గా నా దృష్టి కంటెంట్‌ మీదే ఉండాలి. ప్రేక్షకులకు మంచి ప్రొడక్ట్‌ అందిస్తున్నామా? లేదా? అనేది చూసుకోవాలి. కానీ అనుకోకుండా థియేటర్ల చర్చ తెరపైకి వచ్చింది. నిజానికి ఇది నిర్మాతలకు సంబంధించిన అంశం. కొన్నిసార్లు బాధ కలిగించే మాటలు విన్నప్పుడు మాట్లాడాల్సి వస్తుంది. సినిమా విడుదలైన తర్వాత కేవలం కంటెంట్ గురించే మాట్లాడతారు. హను-మాన్ చాలా స్పెషల్ మూవీ. ఈ సినిమా విజయం సాధిస్తే.. పదేళ్లపాటు మనం గర్వపడే సినిమాలు చేసే ప్రణాళిక ఉంది. దీని రిజల్ట్‌పైనే నా తదుపరి సినిమా ఆధారపడి ఉంటుంది.

బాలకృష్ణకు కథ చెప్పారని విన్నాం? అది మీ సినిమాటిక్ యునివర్స్‌లోనే ఉంటుందా?

ప్రశాంత్‌ వర్మ: కథ చెప్పాను. అది కావాలంటే యూనివర్స్‌లో పెట్టొచ్చు. లేదంటే స్టాండ్‌ ఎలోన్‌గా చేయొచ్చు. అది పూర్తిగా బాలకృష్ణ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని