SALAAR: ‘సలార్‌’కు ‘ఎ’ సర్టిఫికేట్‌.. నిరాశకు గురయ్యా: ప్రశాంత్‌ నీల్‌

ప్రభాస్‌, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘సలార్‌’ (SALAAR). ప్రశాంత్‌ నీల్‌ దర్శకుడు. డిసెంబర్‌ 22న ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది.

Updated : 20 Dec 2023 15:32 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘సలార్‌’ (Salaar) ప్రమోషన్స్‌లో భాగంగా ప్రముఖ దర్శకుడు రాజమౌళి (Rajamouli)తో చిత్రబృందం ప్రత్యేక ఇంటర్వ్యూ ప్లాన్‌ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆ ఇంటర్వ్యూ విడుదలైంది. సినిమాకు సంబంధించిన చాలా విషయాలను రాజమౌళి అడిగి తెలుసుకున్నారు. అలాగే అభిమానులకు ఉన్న పలు సందేహాలను సైతం ఆయన ఈ ఇంటర్వ్యూతో నివృత్తి చేశారు. ‘సలార్‌’ అనుకున్నప్పుడు రెండు పార్ట్స్‌ చేయాలనే ఆలోచన తనకు లేదని ప్రశాంత్‌ నీల్‌ (Prasanth Neel) తెలిపారు. కథ డిమాండ్‌ చేయబట్టే తాను రెండు భాగాలుగా విడుదల చేస్తున్నట్లు చెప్పారు.

‘సలార్‌’ అలా మొదలైంది..!

‘‘సలార్‌’ జర్నీ ఎప్పుడో మొదలైంది. ఈ కథ చేయాలనే ఆలోచన 15 ఏళ్ల క్రితమే వచ్చింది. కాకపోతే, బడ్జెట్‌ దృష్ట్యా సమయం తీసుకున్నా. ‘ఉగ్రం’తో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చా. ‘కేజీయఫ్‌’ కోసం దాదాపు ఎనిమిదేళ్లు వర్క్‌ చేశా. కొవిడ్‌ సమయంలో ప్రభాస్‌కు ‘సలార్‌’ కథ చెప్పా. ఆయన ఓకే అన్నారు. ఈ కథ ద్వారా స్క్రీన్‌పై దేవ అనే పాత్రను చూపించాలనుకున్నా. అందుకోసం ఎంతో శ్రమించా. ప్రభాస్‌లోని అమాయకత్వం నాకెంతో నచ్చుతుంది. దేవ పాత్రకు ఆయన సరిగ్గా నప్పుతాడనిపించింది. ఈ కథ అనుకున్నప్పుడు రెండు భాగాలు చేయాలనే ఉద్దేశం నాకు లేదు. కాకపోతే పాత్రలను చిత్రీకరిస్తున్నప్పుడు రెండున్నర గంటల్లో దీనిని చెప్పడం కష్టం అనిపించింది. అందుకే రెండు భాగాలుగా తీర్చిదిద్దాలని ఫిక్స్‌ అయ్యా’’

కంగారుగా ఉంది..!

‘‘ఇది నా నాలుగో సినిమా. ‘సలార్‌’ విడుదల దగ్గరవుతున్న కొద్దీ కంగారుగా అనిపిస్తుంది. నాకు ఎప్పుడూ ఇలా అనిపించలేదు. ఈ చిత్రాన్ని ఎంతగానో ఇష్టపడ్డా. అందుకే సినిమా విడుదల దగ్గరవుతుంటే చాలా టెన్షన్‌గా అనిపిస్తుంది. ఇదొక పూర్తిస్థాయి డ్రామాతో సాగే చిత్రం. ప్రభాస్‌, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కాకుండా ఈ చిత్రంలో మరెన్నో పాత్రలు ఉన్నాయి. అనవసరమైన ఎలివేషన్స్‌ చూపించకుండా కథకు అనుగుణంగా దీనిని తీర్చిదిద్దా. కొన్ని కారణాల వల్ల ఇదొక పూర్తిస్థాయి డ్రామా అనే విషయాన్ని ట్రైలర్‌తో ప్రేక్షకులకు తెలియచేయలేకపోయా. ఆ విషయంలో నేను ఫెయిల్‌ అయ్యా. నటీనటులకు ఏదైతే కథ చెప్పానో దాన్నే స్క్రీన్‌పైకి తీసుకువచ్చా’’

నిరాశకు గురయ్యా..!

‘‘వయలెన్స్ తీవ్రస్థాయిలో చూపించాలనే ఉద్దేశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించలేదు. దాదాపు పాతికేళ్ల నుంచి నేను తెలుగు చిత్రాలను చూస్తున్నా. ఆనాటి చిత్రాలతో పోలిస్తే నా సినిమాల్లో ఆ స్థాయి యాక్షన్‌ ఉండదని ఫీలవుతుంటా. కొత్త గైడ్‌లైన్స్‌కు అనుగుణంగా మా చిత్రానికి ‘ఎ’ సర్టిఫికేట్‌ ఇచ్చారు. యూ/ఎ సర్టిఫికేట్‌ కావాలంటే సెన్సార్‌ కొన్ని కట్స్‌ సూచించింది. అన్నింటికీ నేను ఓకే అనుకున్నా. కానీ, కథలో కీలకంగా ఉండే కొన్ని సన్నివేశాలను తొలగించడానికి నేను అంగీకరించలేకపోయా. ‘ఎ’ సర్టిఫికేట్‌ వచ్చినందుకు మొదట కాస్త నిరాశకు గురయ్యా. దాదాపు 20 నిమిషాలు ఎవరితోనూ మాట్లాడలేదు. అసభ్యకరమైన, హింసాత్మక చిత్రాన్ని నేను తెరకెక్కించలేదు. కాకపోతే, కథకు అవసరమైన వరకూ వయలెన్స్‌ చూపించా. ‘ఎ’ సర్టిఫికేట్‌ ఇచ్చినప్పుడు ప్రభాస్‌ను పిలిచి ఏం చేద్దాం అని అడిగా.. తీసుకోమని చెప్పారు.

ఎలాంటి సంబంధం లేదు..!

‘సలార్‌’, ‘కేజీయఫ్‌’ చిత్రాల మధ్య ఎలాంటి సంబంధం లేదు. వేటికి అవే రెండు విభిన్నమైన ప్రపంచాలు. సినిమాటిక్‌ యూనివర్స్‌లో వచ్చే చిత్రాలను చూడటానికి ఒక ప్రేక్షకుడిగా ఇష్టపడతా. సినిమాటిక్‌ కనెక్షన్స్‌ క్రియేట్‌ చేసే అంత సామర్థ్యం నాకు లేదు. ప్రేక్షకుల కోసం నేను కొత్త ప్రపంచాన్ని క్రియేట్‌ చేశా. వాళ్లు ఎలా అయితే రాఖీని తమ మనిషిగా భావించారో అదే విధంగా దేవ, వరదరాజను కూడా స్వాగతిస్తారని అనుకుంటున్నా’’

Social Look: రెడ్‌ డ్రెస్సులో మాళవిక మోహనన్‌.. శివానితో శివాత్మిక!

మాస్‌ సాంగ్‌ అనుకున్నాం..!

‘‘శ్రుతిహాసన్‌ - ప్రభాస్‌ మధ్య ఒక మాస్‌ సాంగ్‌ క్రియేట్‌ చేయాలని మొదట్లో అనుకున్నాం. కాకపోతే పూర్తిగా ఒక డ్రామాను స్క్రీన్‌పై చూపిస్తున్నప్పుడు ఆ పాట వల్ల ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉందనిపించింది. అందుకే ఆ పాటను చిత్రీకరించలేదు. ఇక, శ్రుతిహాసన్‌ పాత్ర ఈ సినిమాలో గ్లామర్‌ కోసం క్రియేట్‌ చేయలేదు. ఈ కథలో ఆమెది ఎంతో కీలకమైన పాత్ర’’

సోషల్‌మీడియాకు దూరమయ్యా..!

‘‘నాకోసం నా భార్య సోషల్‌ మీడియాలో ఒక అకౌంట్‌ క్రియేట్‌ చేసింది. సామాజిక మాధ్యమాల్లో వచ్చే కామెంట్స్‌ కారణంగా ప్రభావితం కాకూడదు అనుకున్నా. అందుకే దాన్ని డిలీట్‌ చేసేశా. ‘కేజీయఫ్‌ 2’ సినిమా విడుదలయ్యాకే నేను ఈ నిర్ణయం తీసుకున్నా. 1000 మంది ఆ చిత్రాన్ని ప్రశంసించి.. ఒక్కరు తిట్టినా అది నన్నెంతో బాధిస్తుంది. సోషల్‌మీడియాలో వచ్చే కొన్ని కామెంట్స్‌ నన్ను బాధించాయి. అందుకే నేను సోషల్‌మీడియా నుంచి బయటకు వచ్చేశా’’ అని ప్రశాంత్‌ నీల్‌ తెలిపారు.

అది చూసి షాకయ్యా..: పృథ్వీరాజ్‌ సుకుమారన్‌

‘‘2014 తర్వాత నేను వేరే భాషా చిత్రాల్లో నటించలేదు. ‘సలార్‌’లో అవకాశం వచ్చినప్పుడు నా పాత్రకు ఎక్కువ స్పేస్‌ ఉండదేమో అనుకుని నో చెప్పాలనుకున్నా. కానీ కథ విన్న వెంటనే ఓకే చెప్పా. తర్వాత లుక్‌ టెస్ట్‌లో భాగంగా హైదరాబాద్‌లో తొలిసారి ప్రశాంత్‌నీల్‌ను కలిశా. ఆయన ఆఫీస్‌కు వెళ్లినప్పుడు.. అక్కడ ఓ బోర్డు నా దృష్టిని ఆకర్షించింది. ‘ఖాన్సార్‌’ చరిత్ర, అందులోని పాత్రలు, రాజకీయ కోణాలు అన్నింటినీ ప్రశాంత్‌ దానిపై రాసిపెట్టారు. అది చూసి.. ‘సలార్‌’ విషయంలో ఆయనకు ఉన్న ఫోకస్‌ అర్థం చేసుకున్నా. ఈ సినిమా చూశాక ప్రభాస్‌ ఫ్యాన్స్‌ అస్సలు నిరుత్సాహానికి గురి కారు. అది మాత్రం నేను తప్పకుండా చెప్పగలను’’

డైట్‌ చాలా కష్టం..!

‘‘ప్రభాస్‌తో వర్క్‌ చేస్తే డైట్‌ చేయడం చాలా కష్టం. ఆయన ఎంతో సరదాగా ఉంటారు. ‘సలార్‌’ షూట్‌లో ఉన్నప్పుడు ఓరోజు నా భార్య, కుమార్తె సెట్‌కు వచ్చారు. మా కోసం ఆయన పంపించిన ఫుడ్‌ స్టోర్‌ చేయడానికి ఆరోజు నేను ఎక్స్‌ట్రా రూమ్‌ తీసుకోవాల్సి వచ్చింది’’ అని పృథ్వీరాజ్‌  వెల్లడించారు.

‘కేజీయఫ్‌’.. ‘కేజీయఫ్‌’..:

‘‘బాహుబలి’ తర్వాత ప్రపంచవ్యాప్తంగా నేను ఎక్కడికి వెళ్లినా ప్రేక్షకులు నన్ను గుర్తుపట్టడం మొదలుపెట్టారు. ‘కేజీయఫ్‌’ విడుదలయ్యాక నా ఫ్యాన్స్‌, రాజకీయ నాయకులు కూడా.. ‘ఇది ప్రభాస్‌కు వచ్చి ఉంటే’ అని మాట్లాడటం మొదలుపెట్టారు. ఎక్కడికి వెళ్లినా ‘కేజీయఫ్‌’ గురించే వినిపించేది. అలాంటి సమయంలో ఓ నిర్మాత (హోంబలే వాళ్లు కాదు) ప్రశాంత్‌ నీల్‌తో నాకు మీటింగ్‌ ఏర్పాటు చేశాడు. ఆరోజు మేమిద్దరం సరదాగా మాట్లాడుకున్నాం. సినిమాలు, ఇష్టాయిష్టాలు, ఇలా పలు విషయాలపై చర్చించుకున్నాం. కానీ అప్పుడు మా మధ్య ప్రాజెక్ట్‌ గురించి చర్చ మాత్రం జరగలేదు. కొంతకాలం తర్వాత హోంబలే వాళ్లు మా కాంబోలో సినిమా చేయాలనే ఆలోచనతో వచ్చారు. నేను ఓకే అన్నా. ఈ కథ పూర్తిగా మా (ప్రభాస్‌ - పృథ్వీరాజ్‌ సుకుమారన్‌) పాత్రల చుట్టూ తిరుగుతుంటుంది. స్నేహం, తల్లి సెంటిమెంట్‌, శ్రుతిహాసన్‌ రోల్‌.. ప్రతీది ఎంతో కీలకంగా ఉంటుంది.’’ అని ప్రభాస్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని