Sharwanand: హీరో- హీరోయిన్‌ తిట్టుకుంటే సినిమా హిట్టే: శర్వానంద్‌

శర్వానంద్‌ హీరోగా దర్శకుడు శ్రీరామ్‌ ఆదిత్య తెరకెక్కించిన చిత్రం ‘మనమే’. ఈ సినిమా ట్రైలర్‌ విడుదల వేడుకను శనివారం నిర్వహించారు.

Published : 01 Jun 2024 16:11 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘హీరో- హీరోయిన్‌ తిట్టుకుంటే సినిమా హిట్టే’ అని అన్నారు నటుడు శర్వానంద్‌ (Sharwanand). తాను హీరోగా నటించిన తాజా చిత్రం ‘మనమే’ (Manamey). కృతిశెట్టి (Krithi Shetty) హీరోయిన్‌. శ్రీరామ్‌ ఆదిత్య (Sriram Adittya) దర్శకత్వం వహించారు. ఈ సినిమా జూన్‌ 7న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈనేపథ్యంలో చిత్ర బృందం హైదరాబాద్‌లో ట్రైలర్‌ విడుదల వేడుకను శనివారం నిర్వహించింది. శర్వానంద్‌, కృతిశెట్టి, శ్రీరామ్‌ ఆదిత్య తదితరులు పాల్గొని, మీడియాతో ముచ్చటించారు. ఆ సంగతులివీ..

* మీరు తెరపై కనిపించి రెండేళ్లవుతోంది. గ్యాప్‌ ఎందుకొచ్చింది?

శర్వానంద్‌: నా సినిమాలు బాగున్నా, బాగోకపోయినా బాధ్యత నేనే తీసుకోవాలని నిర్ణయించుకున్నా. అలా ఆచితూచి వ్యవహరించడంతో గ్యాప్‌ వచ్చింది. కచ్చితంగా హిట్‌ కొట్టాలనే ఉద్దేశంతో టీమ్‌నీ ఇబ్బంది పెట్టా (నవ్వుతూ). షూటింగ్‌ సరదాగా సాగలేదు.. అందరం కష్టపడి పనిచేశాం. ఈ చిత్రంతో కొత్త శ్రీరామ్‌ ఆదిత్య పరిచయమవుతాడు.

* మీ ఏజ్‌ హీరోలు లవ్‌స్టోరీలే చేస్తున్నారు. మీరు ఫ్యామిలీ స్టోరీతో రాబోతున్నారు. సీనియర్‌ హీరో జోన్‌లోకి వెళ్లినట్టు భావించారా?

శర్వానంద్‌: సినిమా చూశాక మీకే తెలుస్తుంది. మనలో చాలామందికి కనెక్ట్‌ అయ్యే సబ్జెక్టు ఇది. కొత్తదనం ఉన్న స్టోరీ, ఫ్రెష్‌ స్క్రిప్టు అని చెప్పలేనుగానీ ఇదొక మ్యాజికల్‌ ఫిల్మ్‌ అని నమ్మకంగా చెబుతున్నా. ‘ఇలాంటి మంచి సినిమా చూసి ఎన్నేళ్లయిందో’ అనే ఫీలింగ్‌తో ప్రేక్షకుడు థియేటర్‌ నుంచి బయటకు వస్తాడు.

* కృతిశెట్టితో కలిసి నటించడం ఎలా అనిపించింది?

శర్వానంద్‌: మేమిద్దరం ఈ చిత్రంలో ఎక్కువగా తిట్టుకుంటూనే ఉంటాం. హీరో, హీరోయిన్లు ప్రతీ చిన్నదానికి పోట్లాడుకునే కాన్సెప్టులు విజయవంతమవుతాయి. అందుకు ‘మురారి’, ‘ఖుషి’లాంటివి ఉదాహరణ. మా సినిమా కూడా హిట్‌ అవుతుందనే నమ్మకం ఉంది.

* ఈ సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కు రామ్‌చరణ్‌ వస్తారా?

శర్వానంద్‌: ఇంకా ఖరారు కాలేదు. చరణ్‌ సినిమా షూటింగ్‌ షెడ్యూల్స్‌ బట్టి ప్లాన్‌ చేస్తాం. త్వరలోనే అప్‌డేట్‌ ఇస్తాం.

* నిర్మాత దిల్‌రాజు ‘శతమానం భవతి 2’ని ప్రకటించారు కదా. అందులోనూ హీరో మీరేనా?

శర్వానంద్‌: దానిగురించి నాకేం చెప్పలేదు. ఆయన్నే అడగండి.

* క్రికెటర్‌ రోహిత్‌శర్మ బయోపిక్‌లో నటించే అవకాశం వస్తే అంగీకరిస్తారా?

శర్వానంద్‌: ఆలోచిస్తా.

* మీ స్టోరీల్లో కొత్తదనం ఉన్నా కమర్షియల్‌గా కాస్త వెనకబడతాయి. ఆ లోటు ‘మనమే’ భర్తీ చేస్తుందా?

శ్రీరామ్‌ ఆదిత్య: తప్పకుండా చేస్తుంది. 

* మీ అబ్బాయినే ఈ సినిమాలో కీలక పాత్రకు తీసుకోవడానికి కారణం?

శ్రీరామ్‌ ఆదిత్య:  ఈ కథ ఎప్పుడో రాసుకున్నా. శర్వానంద్‌తో సినిమా ఖరారయ్యాక.. ఆయన మా బాబు ఫొటో చూశారు. ‘ఎవరో ఎందుకు? మన సినిమాలో మీ వాడినే పెట్టేద్దాం’ అని ఆయన అన్నారు.

* హేషమ్‌ మ్యూజిక్‌ సినిమాపై ప్రభావం చూపుతుందా?

శ్రీరామ్‌ ఆదిత్య: ఆయన కెరీర్‌లో ఈ సినిమా బెస్ట్‌ అని చెప్పగలను. ఇందులో 16 పాటలున్నాయి. సినిమా ఆద్యంతం సంగీత ప్రధానంగా సాగుతుంది. 

* ‘కస్టడీ’ తర్వాత మళ్లీ తెలుగు సినిమాల్లో కనిపించలేదు. అవకాశాలు రాలేదా?

కృతిశెట్టి: గ్యాప్‌ ఇవ్వలేదు వచ్చింది. వేరే చిత్ర పరిశ్రమల్లో బిజీగా ఉండడం వల్ల ఇక్కడ సినిమాల్లో కనిపించలేదు. ప్రస్తుతం ఐదు సినిమాల్లో నటిస్తున్నా.

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని