Miss World 2024 Pageant: నాపై ఒత్తిడేమీ లేదు.. మిస్‌ వరల్డ్‌ -2024 పోటీదారు సినిశెట్టి.. ఆసక్తికర కబుర్లు

Miss World 2024: ఫిబ్రవరి 18 నుంచి భారత్‌ వేదికగా మిస్‌ వరల్డ్‌ 2024 పోటీలు జరగనున్న నేపథ్యంలో భారత్‌ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సినిశెట్టి పంచుకున్న విషయాలు..

Updated : 16 Feb 2024 17:40 IST

మిస్‌ వరల్డ్‌ - 2024 పోటీల్లో పాల్గొనడం పట్ల తనకేమీ ఒత్తిడి లేదని సిని శెట్టి (Sini Shetty) చెప్పుకొచ్చింది. మిస్‌ ఇండియా వరల్డ్‌ టైటిల్‌-2022 విజేత అయిన ఆమె ప్రస్తుతం మిస్‌ వరల్డ్‌ -2024లో పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. 28 ఏళ్ల తర్వాత భారత్ వేదికగా జరుగుతున్న పోటీలు కావడంతో అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఫిబ్రవరి 18 నుంచి మార్చి 9 వరకు దిల్లీలోని భారత్‌ మండపం, ముంబయిలోని జియో వరల్డ్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో మిస్‌ వరల్డ్‌ పోటీలు నిర్వహించనున్నారు. ఫైనల్స్‌ ముంబయిలో జరగనున్నాయి. ఈ క్రమంలో సినిశెట్టి (Sini Shetty interview) పంచుకున్న విషయాలు..

  • మిస్‌ ఇండియా టైటిల్‌ గెలవడం నా జీవితంలో మర్చిపోలేని సంఘటన. కార్పొరేట్ ప్రపంచంలో నేను సాధించిన విజయాలు, భరతనాట్యం నాకెంతో సంతృప్తినిచ్చినా, మిస్‌ ఇండియా కావటం నా దృక్పథాన్ని మార్చింది.
  • కర్ణాటకకు చెందిన ఐశ్వర్యరాయ్‌ బచ్చన్‌ మిస్‌ వరల్డ్‌ అయ్యారు. అదే రాష్ట్రానికి చెందిన నేను ఈసారి పోటీలో ఉన్నా, ఒత్తిడిగా ఏమీ భావించటం లేదు.

  • నా తల్లిదండ్రులకు మాత్రం ఎంతో కొంత ఆందోళన ఉంటుంది. చాలా విషయాల గురించి నన్ను పదే పదే ప్రశ్నిస్తూ ఉంటారు. నేను చెప్పే సమాధానాల్లో లాజిక్‌ వెతుకుతారు.
  • నాకు ఇప్పటికీ గుర్తే మేమంతా కలిసి కూర్చొని మాట్లాడుకుంటున్న సందర్భంలో ‘నేను ఇలా (మిస్‌ ఇండియా పోటీలకు సంబంధించి) చేయాలనుకుంటున్నా’ అని చెప్పాను.  నా జీవితానికి సంబంధించిన సరైన నిర్ణయమని నా భావన. (Sini Shetty interview) అంతేకాదు, పోటీల్లో విజయం సాధిస్తానన్న ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేశా. ఎందుకంటే నేను మధ్యలో వదిలిపెట్టే రకం కాదు.

  • భావోద్వేగాల విషయంలో నేనొక రోలర్‌ కోస్టర్‌ని. ఒక పోటీదారుగా నేను చాలా ఉత్సుకతతో ఎదురుచూస్తున్నా. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందాల భామలందరూ ఇక్కడికి వస్తున్నారు. నేను చేయాల్సింది.. చూపించాల్సింది చాలా ఉంది. అదొక భావోద్వేగాల వేదిక. కానీ, ఏదోక మూల కాస్త భయంగానే ఉంటుంది.
  • ఇలాంటి పోటీల్లో తీవ్రమైన ఒత్తిడి సహజం. మనం చేసే పనిపై ప్యాషన్‌, మనల్ని మనం ఆవిష్కరించుకోవడం ముఖ్యం. మిస్‌ వరల్డ్‌  కోసం రెండేళ్ల నుంచి సిద్ధమవుతున్నా.

  • ఒత్తిడి పెరిగినప్పుడు అది శారీరక, మానసిక ఆరోగ్యంపైనా  ప్రభావం చూపుతుంది. పనిపై మనకున్న ఇష్టం, ఎలా చేస్తామన్న దాన్ని నేను బలంగా నమ్ముతా. నా ప్యాషన్‌ ఏంటంటే, డ్యాన్స్‌. నీలా నువ్వు ఉన్నప్పుడు కాస్త గట్టిగా శ్వాస తీసుకుని అన్నింటినీ అర్థం చేసుకోవడమే. నీపై నీకు దృఢ సంకల్పం ఉన్న రోజున ప్రతిదీ మనకోసం పని చేస్తుంది.
  • భారతీయ సంప్రదాయాలతో మనం వేళ్లూనుకుని ఉన్నాం. ఆ సమయంలో ప్రపంచ యవనికపై సరికొత్త భారతాన్ని చూస్తున్నాం. ప్రపంచ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో మనదేశం కూడా ఒకటి. సాంకేతికంగా ముందున్నాం. ప్రగతిశీల భారత్‌వైపు మన పయనం సాగుతోంది.

  • భారతదేశం మనల్ని అత్యున్నత స్థాయికి తీసుకెళ్తుంది. ఈసారి 120 దేశాల అతిథులకు మన ఆతిథ్యం చూపించడానికి సిద్ధంగా ఉన్నాం. అందులో నేనూ భాగస్వామిని అవుతున్నందుకు మరింత సంతోషంగా ఉంది.
  • సినిశెట్టి తల్లిదండ్రులది కర్ణాటక అయినా, ఆమె పుట్టి పెరిగింది అంతా ముంబయిలోనే. (Sini Shetty interview) నాలుగేళ్ల వయసులోనే డ్యాన్స్‌పై ఆసక్తితో భరతనాట్యం నేర్చుకుంది. 14ఏళ్ల వయసులో అరంగేట్రం చేసింది.  పలు వేదికలపైనా ప్రదర్శనలు ఇచ్చింది. అకౌంటింగ్‌ అండ్‌ ఫైనాన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ చేసింది. ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్‌గా కార్పొరేట్‌ సంస్థల్లోనూ పనిచేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని