Venu: అలా అనుకొనే వారికి సమాధానమే ‘బలగం’..: వేణు యెల్దండి

హాస్యనటుడు, దర్శకుడు వేణు యెల్దండి ‘చెప్పాలని ఉంది’ కార్యక్రమానికి హాజరయ్యారు. తన సినీ జీవితం, అనుభవాలను పంచుకున్నారు.

Published : 06 Feb 2024 01:34 IST

సినిమాలు, ‘జబర్దస్త్‌’ కామెడీ షోతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు హాస్యనటుడు వేణు యెల్దండి (Venu Yeldandi). ‘బలగం’ను తెరకెక్కించి దర్శకుడిగానూ సత్తా చాటారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల నేపథ్యంలో రూపుదిద్దుకున్న ‘బలగం’ (Balagam) అంతర్జాతీయ వేదికపై పలు అవార్డులు సొంతం చేసుకుంది. తాజాగా వేణు ‘చెప్పాలని ఉంది’ కార్యక్రమంలో పాల్గొని తన అనుభవాలు, జ్ఞాపకాలను పంచుకున్నారు. ఆయన చెప్పిన విశేషాలు మీకోసం..

మీరు ఆర్టిస్టు అవ్వాలని ఎందుకనుకున్నారు?

వేణు: చాలా పేద కుటుంబంలో పుట్టినవారు ఎవరైనా సినీ పరిశ్రమలోకి రావడానికి ఆసక్తి చూపరు. మా కుటుంబంలో నాతో పాటు పదో తరగతి చదివిన వారే లేరు. అలాంటి పరిస్థితుల నుంచి వచ్చిన నేను నటుడిని కావాలనుకున్నానంటే అది దేవుడిచ్చిన వరం. మొదటిసారి భగవద్గీత విన్నప్పుడు, దాని ప్రత్యేకత ఏంటో తెలీదు. దాంతో క్లాసికల్‌ పాటలపై ఆసక్తి ఏర్పడింది. నేను నటుడిని కావాలని దేవుడు ముందే రాసిపెట్టాడేమో అనిపిస్తుంది. 

మీకు ఆర్టిస్టు అవ్వాలని ఎందుకు అనిపించింది?

వేణు:  అమ్మానాన్న కూరగాయల వ్యాపారం చేసేవాళ్లు. పావలా కొత్తిమీర అమ్మాలంటే వందమాటలు చెప్పాలి. అలా మాటలు చెప్తూ , కూరలు అమ్ముకుంటూ చదువుకున్నా. అందుకే నన్ను అందరూ వాగుడుకాయ అనేవాళ్లు. అందరికంటే నేను ప్రత్యేకంగా ఉండాలనుకొనేవాడిని. అందుకే మార్షల్‌ ఆర్ట్స్‌ నేర్చుకున్నా. రెండుసార్లు స్టేట్‌ ఛాంపియన్‌గా నిలిచా. కానీ, అప్పటికే నాకు సినిమాలపై ఆసక్తి కలిగింది. ఏ సినిమా వచ్చినా చూసేవాడిని. అందరూ నన్ను బాబూమోహన్‌ బావమరిది అనేవాళ్లు.  దాంతో ‘నేను ఎందుకు తెరపై కనిపించకూడదు’ అనిపించింది. ఎలా అయినా సినిమాల్లోకి వెళ్లాలని ఇంట్లో నుంచి వచ్చేశా.

సినిమాల్లో అవకాశం ఎలా వచ్చింది?

వేణు: కెరీర్‌ ప్రారంభంలో నవకాంత్‌ అనే రచయిత దగ్గర మూడు నెలలు అసిస్టెంట్‌గా చేశా. సినిమాల్లో పనిచేసేవాళ్ల దగ్గర ఉంటే పరిచయాలు పెరుగుతాయనిపించింది. అక్కడ ఉన్నప్పుడే ‘చిత్రం’ శ్రీను అసిస్టెంట్‌ కోసం వెతుకుతున్నారని తెలిసింది. ఆయన స్నేహితుడు సురేష్‌ నన్ను రిఫర్‌ చేశారు. రెండు నెలల తర్వాత నేను ఆయన దగ్గర అసిస్టెంట్‌గా చేరా. రెండు సంవత్సరాలు పని చేశా. అక్కడే చాలా విషయాలు నేర్చుకున్నా.

ఆర్టిస్టు కావడానికి మీరు చేసిన ప్రయత్నాలు ఏంటి?

వేణు: ‘చిత్రం’ శ్రీను వద్ద చేస్తున్నప్పుడే నేను యాకర్ట్‌ అవ్వాలని వచ్చానని, చెప్పి అక్కడి నుంచి వచ్చేశా. పని లేకపోవడంతో కొంత ఇబ్బందిపడ్డా. అద్దె కట్టలేని పరిస్థితి. దర్శకుడు తేజ నవదీప్‌తో జై మూవీ కోసం కొత్త నటీనటులు కావాలనుకుంటున్నారని తెలిసి ఆడిషన్ ఇద్దామనుకున్నా. కానీ, ఎలా ఇవ్వాలో ఏం చేయాలో తెలియలేదు. అప్పుడే దేవుడిచ్చిన అన్నయ్యలా కొత్తపల్లి శేషు ‘చిత్రాంజలి’ జర్నలిస్టు పరిచయమయ్యారు. ‘వండర్‌ బాయ్‌’ అని నాకు పేరు పెట్టింది ఆయనే. జై మూవీ ఆడిషన్స్‌కి నా ఫొటోలు పంపించారు. షూటింగ్‌కి వెళ్లడానికి మంచి దుస్తులు లేకపోతే, ఆయన కొనిపెట్టారు. ‘మున్నా’ విడుదలయ్యాక ఫేం వచ్చాక కూడా నా ఇంటి అద్దె ఆయనే కట్టారు. నన్ను చాలా బాగా చూసుకున్నారు. ఎప్పటికప్పుడు నాలో స్ఫూర్తినింపుతుండేవారు. నాకోసం దేవుడు పంపిన అన్న కొత్తపల్లి శేషు. ఆయన కారణంగానే నాకు సినిమాలో అవకాశం వచ్చింది.

‘బలగం’ ఇంత మంచి విజయం ఇస్తుందని ముందే ఊహించారా?

వేణు: కథ రాసుకున్నప్పుడే నాకు నమ్మకమొచ్చింది. షూటింగ్‌ సమయంలో అది రుజువైంది. సినిమాలో ఎవరూ యాక్టర్స్‌ కాదు. ఆ ఊరిలో ఉన్నవారితోనే షూటింగ్‌ చేశాం. చిత్రీకరణ చేస్తున్న సమయంలోనే ఆ వాతావరణం, సన్నివేశాలు చూసి, చాలామంది భావోద్వేగానికి గురయ్యేవారు. అది చూశాక సినిమా హిట్‌ అవుతుందని నమ్మకం కుదిరింది. వేణు ఏంటి సినిమా చేయడం ఏంటి అనుకునేవారికి ఇది సమాధానం.

ప్రొడ్యూసర్‌ దిల్‌రాజుని ఎలా ఒప్పించారు?

వేణు: అందరూ ప్రొడ్యూసర్‌కి కథ, స్టోరీ లైన్‌ చెప్తారు. ‘బలగం’ అలా కాదు. కేవలం లైన్‌ చెప్తే ఎవరికీ అర్థం కాదు. దిల్‌రాజుని కలిసి దాదాపు మూడు గంటలు డైలాగ్‌ టు డైలాగ్‌ వివరిస్తూ కథ చెప్పాను. మధ్యలో పాట పాడి వినిపించాను. దాంతో ఆయన ఈ సినిమా చేయడానికి అంగీకరించారు.

‘బలగం’ హీరోగా ప్రియదర్శిని ఎంచుకోవడానికి కారణం?

వేణు: ఈ కథ నేను నటించాలని నాకోసం రాసుకున్నది. హీరో అవసరం లేదు, మంచి నటుడు అయితే చాలనుకున్నా. నేను డైరెక్ట్‌ చేయాల్సిరావడంతో ప్రియదర్శి ‘మల్లేశం’ మూవీ చూశాను. చాలా బాగా చేశారు. దీంతో ఆయనను హీరోగా ఎంపిక చేశాం.

మీకు ‘రణం’, ‘మున్నా’ల్లో అవకాశం ఎలా వచ్చింది?

వేణు: పోకూరి బాబూరావు ఈ అబ్బాయి బాగా చేస్తున్నాడని ‘రణం’కి పిలిచి అవకాశం ఇచ్చారు. కానీ, ‘మున్నా’ అలా కాదు.  వంశీ అన్నకి నాపై ఉన్న నమ్మకంతో నాకు టిల్లూగా మంచి పాత్రలో నటించే అవకాశం ఇచ్చారు.  కో-డైరెక్టర్‌ మార్తాండ్‌ కె శంకర్‌ ద్వారా వంశీ అన్న పరిచయమయ్యారు. నా కామెడీ టైమింగ్‌ నచ్చి నన్ను సినిమాలోకి తీసుకున్నారు. ఇప్పటికీ టిల్లూగా నన్ను గుర్తు పడుతున్నారు.

‘జబర్దస్త్‌’లోకి రావడానికి కారణం ఏంటి?

వేణు: మున్నా సినిమాతో మంచి అవకాశాలు వస్తున్నాయి. అప్పటికి సినిమా వేరు, టెలివిజన్‌ వేరు అనే అభిప్రాయం ఉండేది. దాంతో జబర్దస్త్‌లో చేయాలంటే కొంచెం ఆలోచించాను. పారితోషికం ఎక్కువగా ఇస్తామని చెప్పడంతో 13 ఎపిసోడ్లు చేయడానికి నిర్ణయించుకున్నా. మొదటిదాని తర్వాత మాలో మాకు పోటీ పెరిగింది. వాళ్లకంటే నేను బాగా చేయాలంటే నేను బాగా చేయాలని ఆ 13 ఎపిసోడ్లు యుద్ధంలా చేశాం.

జబర్దస్త్‌ ఎలా ఉపయోగపడింది?

వేణు: సినిమాను డైరెక్ట్‌ చేయడంలో చాలా ఉపయోగపడింది. జబర్దస్త్‌లో మేము చేసిన 27 ఎపిసోడ్స్‌లో ప్రతీ దానిలో కథ ఉండేది. స్టార్ట్‌, మిడిల్‌, క్లైమాక్స్‌ ఉండేది. ఎవరు ఎలా చేయాలి, ఏ కాస్ట్యూమ్స్‌ వేసుకోవాలనేది చెక్‌ చేసుకోవాలి.  ఓ రకంగా చెప్పాలంటే డైరెక్ట్‌ చేయాల్సి వచ్చేది.

కొత్త కథలు ఏమైనా రాస్తున్నారా?

వేణు: ‘బలగం’ విజయంతో కొత్త  బాధ్యతలు వచ్చాయి.  ప్రేక్షకులు నా నుంచి మంచి సినిమాలు ఆశిస్తున్నారు.  వారి నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి.  ప్రస్తుతం  అందరికీ నచ్చేలా కొత్త కథ రాశా.  మీరు అనుకున్నట్లే త్వరలోనే మంచి సినిమా వస్తుంది.

మీకు నచ్చిన కళాకారుడు ఎవరు?

వేణు: గోరేటి వెంకన్న అంటే చాలా ఇష్టం. ఆయనకి ఏకలవ్య శిష్యుడిగా నన్ను నేను భావిస్తా.  రెండు, మూడు గంటలు ఆయన పాటలు వింటూ ఉండిపోతా. బలగంలో ఆయనది ఓ పాట ఉంది.  కొన్ని కారణాల వల్ల దాన్ని సినిమాలో చూపించలేకపోయాం.

‘బలగం’ మీరే డైరెక్ట్‌ చేయాలని ఓ డిస్టిబ్యూటర్‌ చెప్తే ఆలోచించారట ఎందుకు?

వేణు:  మంచి కథ హీరోని పెట్టి  చేద్దామని శివరాం చెప్పారు. ‘మీరు తప్ప ఇంకెవరూ డైరెక్ట్‌ చేసినా ఊహించినంత మంచిగా రాదు. ఆలోచించుకోండి’ అన్నారు. ‘అన్నీ నా జీవితంలో జరిగినవే. నేనే సినిమా చేస్తా’ అని చెప్పాను.

ఈ కథ రాయడానికి కారణం ఏంటి?

వేణు: మాది చాలా పెద్ద కుటుంబం. దాదాపు రెండు వందల మంది ఉంటారు. ఎవరైనా చనిపోతే చేదునోరు విడిపించడం అనే కార్యక్రమం ఉంటుంది. చనిపోయిన వారి ఇంటికి వచ్చి వారి బాధను దూరం చేయాలని వారితో పాటు తిని వెళ్లేవాళ్లు. అది ఆచారంగా మారిపోయింది.  మా నాన్న చనిపోయినప్పుడు మా కుటుంబంలో ఉన్నవారంతా వచ్చారు.  అలా వచ్చినప్పుడు చనిపోతే వచ్చినట్లు లేదు. ఏదో పండగ చేసుకోవడానికి వచ్చినట్లు ఉందనిపించేది.  అలా నాకు బలగం కథ ప్రారంభమైంది.

‘బలగం’లో లాస్ట్‌సాంగ్‌ ఒరిజినల్‌గా ఉందా?

వేణు: మా పెద్దమ్మ చనిపోయిన వారం రోజులకే మా పెద్దనాన్న చనిపోయారు.  కుటుంబమంతా వెళ్లారు. నేను వెళ్లలేకపోయాను. కొన్ని రోజుల తర్వాత మా ఊరిలో ఉండే అన్న దగ్గరకి వెళ్లి మాట్లాడా. అప్పుడు మా అన్న చెప్పాడు.  చేదునోరు విడిపించడం కార్యక్రమానికి మావాళ్లు దాదాపు 150 మంది రావడంతో అంతా ఓ పండగలా అనిపించిందని. అలా ఎవరైనా ఎక్కువమంది ఒక చోటకి చేరితే బుడగ జంగమ్మలు అక్కడికి వచ్చి చిన్నపూస అని పాట పాడేవారు. వారి దగ్గర ఒకటే సెటప్‌ ఉండేది. పేర్లు మార్చి పాడేవారు. మా అన్నయ్య పెదనాన్న, పెద్దమ్మల పేర్లు చెప్పి పాడమని చెప్పడం, వారు మా అన్న బుచ్చయ్య, ఏడికెళ్లావురా అంటూ పాట మొదలుపెట్టడం, బంధువులంతా వారి వారి పేర్లు చెప్పి, పాడమంటూ జ్ఞాపకాలను గుర్తుచేసుకునేవాళ్లు. మా అన్న అది చెప్పినప్పుడు విని ఇది కదా నాకు కావాల్సిందనుకున్నా. మొదట అనుకున్న క్లైమాక్స్‌ వేరు. అది కొంచె నవ్వుతెప్పించేలా ఉంటుంది. కథ అంతా పూర్తయిన తర్వాత అది ఎందుకో నచ్చలేదు.  ఇలా చేయాల్సివచ్చింది.

మీరు రాసిన అమ్మ కథ మాటేంటి?

వేణు: అది మా అమ్మ కథ. డాక్యుమెంటరీ చేశా. గంటన్నర ఉంటుంది.  అమ్మ ఎక్కడ పుట్టింది, పెరిగింది, ఎక్కడ ఆడుకుంది, ఎలా వివాహం జరిగింది, ఇలాంటివన్నీ ఉంటాయి. మా అమ్మ నాకు దూరమైతే నేను ఎలా ఉండాలి అని అనిపించి ఈ డాక్యుమెంటరీ చేశాను. నాకోసం నేను చేసుకున్నా. రిలీజ్‌ చెయ్యలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని