Radha Interview: చిరంజీవితో ఆ పాటకు డ్యాన్స్‌ వేయడం కష్టంగా అనిపించింది: రాధ

నటి రాధ ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆమె కెరీర్‌కు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

Updated : 27 Mar 2024 18:02 IST

అభినయంతో నటనకు శ్రీకారం చుట్టి.. అందమే అలంకారంగా అగ్ర హీరోల సరసన నటించారు నటి రాధ (Radha). తన కోసం పుట్టిన పాత్రలకు ప్రాణం పోసి.. ప్రతీ పాత్రకు న్యాయం చేశారు. అప్పటికీ, ఇప్పటికీ ఎంతోమందికి డ్రీమ్‌ గర్ల్‌ అయిన రాధ ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి అతిథిగా హాజరయ్యారు. ఆమె సినీ కెరీర్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అవేంటో మీరూ చదివేయండి.

మీ అసలు పేరేంటి.. ఎక్కడ పుట్టారు?

రాధ: నా పేరు ఉదయ చంద్రిక. శ్రీశైలంలో పుట్టాను. ఆ తర్వాత కేరళకు షిఫ్ట్‌ అయ్యాం. అక్కడే పెరిగాను. మేము మొత్తం ఐదుగురం. నాకు ఇద్దరు అక్కలు, ఇద్దరు తమ్ముళ్లు ఉన్నారు. మా అక్క కూడా హీరోయిన్‌గా చేశారు.  

డ్యాన్స్‌లో మీకు స్ఫూర్తి ఎవరు..? మీరు సింగిల్‌ టేక్‌లో చేసేవారట నిజమేనా?

రాధ: చిరంజీవి గారు స్టైలిష్‌గా డ్యాన్స్‌లు చేసే క్రమంలో నేను ఇండస్ట్రీకి వచ్చాను. నేను వచ్చాక ఫాస్ట్‌ బీట్‌ సాంగ్స్‌ ఎక్కువయ్యాయి. జయప్రద మంచి డ్యాన్సర్‌. శ్రీదేవి డ్యాన్స్‌లో స్టైల్‌ నాకిష్టం. మనం నటించిన సినిమా హిట్ అయినంత మాత్రాన అవకాశాలు రావు. నిజాయతీగా ఉండాలి. మన కోసం డబ్బులు పెడుతోన్న నిర్మాతల గురించి ఆలోచించాలి. అందుకే ఎక్కువ టేక్‌లు తీసుకోకుండా ఉండడానికి ప్రయత్నించేదాన్ని. 

ఇప్పటివరకు ఎన్ని సినిమాల్లో నటించారు?

రాధ: ఐదు భాషల్లో కలిపి సుమారు 120 చిత్రాలు చేశాను. మా నాన్నకు చదువు అంటే ఇష్టం. కనీసం పదోతరగతి వరకు చదవాలి అని కండీషన్‌ పెట్టారు. పరీక్షలు పూర్తయ్యేవరకు ఎన్ని అవకాశాలు వచ్చినా నో చెప్పారు. భారతీరాజా ‘సీతకోక చిలుక’ (తమిళ వెర్షన్‌)  కోసం నన్ను సంప్రదించినప్పుడు కూడా మా నాన్న పరీక్షలు ఉన్నాయని వద్దన్నారు. ఎగ్జామ్స్‌ అయ్యాక ఆ సినిమాలో నటించాను.

మొదటి సినిమా అవకాశం ఎలా వచ్చింది?

రాధ:  ‘సీతాకోక చిలుక’ కోసం ఆడిషన్స్‌ జరుగుతున్నాయని తెలిసి అక్క ఫొటో తీసుకొని మా అమ్మ భారతీరాజా గారి ఆఫీసుకు వెళ్లారు. తను కేరళ అమ్మాయిలా ఉందని తమిళ సినిమాకు సెట్‌ కాదన్నారు. తర్వాత నా ఫొటో చూసి.. రియల్‌గా చూడాలి ఇంటికి వస్తామన్నారు. ఇంటికి వచ్చి చూశాక ఓకే చేశారు. ఆయన నాకు దేవుడితో సమానం. నాకు డ్రెస్సింగ్‌ అంటే ఇష్టం. ఆ సినిమా ఫొటోషూట్‌ కోసం మొదటిసారి పంజాబీ వేసుకున్నా. ఆ తర్వాత షూటింగ్‌పై ఆసక్తి ఎక్కువైంది. ఇటీవల మా అమ్మాయి పెళ్లికి కార్డ్‌ ఇవ్వడానికి ఇళయరాజాను కలిసినప్పుడు కూడా ఆయన ‘సీతాకోక చిలుక’ రోజులను గుర్తు చేశారు. 

మీ చేతిరాత ముత్యాల్లా ఉంటుందా.. క్లాస్‌ టాపర్‌ అని విన్నాం?

రాధ: క్లాస్‌ టాపర్‌ను కాదు.. లీడర్‌ని. ప్రోగ్రెస్‌ కార్డులో నేనే మార్కులు వేసుకునేదాన్ని. నా చేతిరాత అసలు బాగుండదు. స్కూల్లో అందరినీ బెదిరించి నోట్సులు రాయించుకునేదాన్ని. ‘చేతిరాత బాలేకపోతే తలరాత బాగుంటుంది’ అని మా నాన్న నాతో చెప్పారు. అది నిజం. ఆయన నన్నెంతో ప్రోత్సహించేవారు. మా అమ్మాయి కార్తిక చదువులో టాపర్‌. తన చేతిరాత చాలా బాగుంటుంది. 

‘దొంగ’ పేరుతో వచ్చిన మీ సినిమాలన్నీ హిట్లే. కానీ, నిజజీవితంలోనూ మీరు దొంగే అని విన్నాం?

రాధ: మా నాన్న జేబులో నుంచి రెండు రూపాయలు కొట్టేశాను. ఆయనకు రేషన్‌షాప్‌ ఉండేది. స్కూల్‌కు వెళ్లే ముందు ఆ షాపులో ఎవరికీ తెలియకుండా రూపాయి నోట్లు రెండు తీసుకున్నాను. మా అమ్మకు తెలిసి వాత పెట్టింది. ఇప్పటికీ ఆ మచ్చ ఉంది. ఆ వాత తర్వాత ఇప్పటివరకు వాళ్లకు తెలియకుండా ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు.

కృష్ణగారి గురించి ఏదో చెప్పాలన్నారు?

రాధ: డ్యాన్స్‌ అంటే నాకు పిచ్చి. కృష్ణగారితో డ్యాన్స్ చేసేటప్పుడు ఆయన ఎంతో స్వేచ్ఛనిచ్చేవారు. ముందు ఆ అమ్మాయికి నచ్చినట్లు వేయనివ్వండి అని చెప్పేవారు. ఆయనంటే ఎంతో గౌరవం. సెట్‌లో కూడా సైలెంట్‌గా ఉండేవారు. ఆయన ప్రపంచం ఆయనది. మగవారు అలాఉంటే నాకు చాలా ఇష్టం. 

కార్తికకు పెళ్లి చేసినప్పుడు ఎలా అనిపించింది?

రాధ: ఆడపిల్లకు పెళ్లి చేసి వేరే ఇంటికి పంపాలంటే ఏ తల్లిదండ్రులకైనా భయమేస్తుంది. నేను మా పుట్టింట్లో ఎలా ఉన్నానో.. పెళ్లి అయ్యాక కూడా అలానే ఉన్నాను. ఏ విషయంలోనూ మావారు హద్దులు పెట్టలేదు. మా అమ్మాయికి కూడా అలాంటి భర్తే రావాలని ఎంతోమంది దేవుళ్లకు మొక్కుకున్నా. మా ఆయనకు కార్తిక అంటే చాలా ఇష్టం. పెళ్లి అయ్యాక ఎంత ఏడ్చారో చెప్పలేను. తన పెళ్లి మా లైఫ్‌లో గొప్ప మూమెంట్‌. 

ఎంజీఆర్‌తో నటించాలని కోరిక ఉండేదట?

రాధ: ఆయన చూడడానికి యాపిల్‌లా ఉంటారు (నవ్వుతూ). ఆయనతో నటించాలని చాలా ఆశపడ్డాను. చెన్నైలో మా స్టూడియో ఓపెనింగ్‌కు ఆయన వచ్చారు. నేను రెండు జనరేషన్స్‌ నటులతో నటించాను. ఆ విషయంలో చాలా అదృష్టవంతురాలిగా ఫీలవుతా. ఎన్టీఆర్‌- బాలకృష్ణ, నాగేశ్వరరావు- నాగార్జునలతో నటించాను. 1980, 1990ల్లో ఉన్న హీరోలందరితో నేను నటించాను. 

మీరు కింద కూర్చుంటే లేవలేరని అంటుంటారు?

రాధ: నిజం. నేను లావుగా ఉన్నందువల్ల కాదు.. ఆరోగ్యంగా లేకపోవడం వల్ల కింద కూర్చుంటే పైకి లేవలేను. శోభన్‌బాబుతో నేను సినిమా చేసేటప్పుడు ఒక మాట చెప్పారు. 40 ఏళ్లు వచ్చాక నువ్వు ఎవరి సాయం తీసుకోకుండా కింద కూర్చుని పైకి లేస్తే ఆరోగ్యంగా ఉన్నట్లు అన్నారు. నేను ఈరోజుకు కూడా ఆయన మాటలు గుర్తుచేసుకుంటాను. ఆరోజే ఆయన మాటలు విని యోగా చేసిఉంటే ఈరోజు ఇలా ఉండేదాన్ని కాదేమో అనుకుంటుంటా. శోభన్‌ బాబు చాలా మంచి వ్యక్తి. 

80-90 గ్రూప్‌ గురించి చెప్పండి?

రాధ: 1980, 1990ల్లో ఉన్న నటీనటులందరూ ఆ గ్రూప్‌లో ఉంటారు. అప్పటి హీరోలు చాలా గొప్పవాళ్లు. వాళ్లతో ఉంటే చాలా సేఫ్టీగా ఉన్నట్లు అనిపిస్తుంది. మేమందరం అప్పుడప్పుడు కలుస్తుంటాం. ఆరోజు బాగా ఎంజాయ్‌ చేస్తాం. 

చిరంజీవితో (Chiranjeevi) చేసిన మొదటి సినిమా ఏది?

రాధ: ‘గూండా’. మొదటి రోజు షూటింగ్‌ విజయాగార్డెన్స్‌లో జరిగింది. ఆయనతో సమానంగా డ్యాన్స్ వేసేదాన్ని. అప్పట్లో మానిటర్స్‌ లేవు కాబట్టి డ్యాన్స్‌ వేసేటప్పుడే చిరంజీవిని చూస్తూ ఆయన కంటే ఫాస్ట్‌గా వేసేదాన్ని. ‘అందం హిందోళం అధరం తాంబూలం..’ పాటకు ఆయనతో సమానంగా డ్యాన్స్ చేయడం కొంచెం కష్టమనిపించింది. చిరంజీవి చాలా నిజాయతీగా ఉంటారు. మా ఇద్దరి మధ్య ఎప్పుడూ పోటీ ఉండేది. అలా ఉంటేనే సినిమా బాగుంటుంది. 

రాఘవేంద్రరావు (Raghavendra Rao) గురించి చెప్పండి?

రాధ: ఆయన ఎప్పటికీ యువకుడే. నన్ను గ్లామర్‌గా, మోడ్రన్‌గా చూపించిన దర్శకుడు ఆయనే. ‘వన్‌వన్‌ నంబర్‌ వన్‌..’ సాంగ్‌లో కనీసం 15 డ్రెస్‌లు మార్చారు. హిందీ సినిమాలో నటించాలనే నా కల ఆయన వల్లే తీరింది. 

బాలకృష్ణ (Balakrishna)సినిమాలో డైలాగ్‌లు మీరు చెప్పగలరా?

రాధ: ఆయన సినిమాలంటే నాకు చాలా ఇష్టం. ఇప్పటికీ థియేటర్‌లో ఆయన సినిమా చూసేటప్పుడు ఎంట్రీ సీన్ రాగానే పేపర్లు విసురుతాను. కొంతమంది హీరోలు ఏం చేసినా మనకు నచ్చుతుంది. అలాంటి హీరోల్లో బాలయ్య ఒకరు. ఆయనతో నా మొదటి సినిమా ‘రక్తాభిషేకం’. అందులో నాతో సమానంగా డ్యాన్స్ చేయడం కోసం స్టెపులన్నీ ముందే ప్రాక్టీస్‌ చేశారు. సినిమా అంటే ఆయనకు అంత శ్రద్ధ. అదే స్పిరిట్‌ ఇప్పుడు కూడా ఉంది. ఎంత పెద్ద సన్నివేశమైనా చేసేస్తారు. సూపర్‌మేన్‌, స్పైడర్‌మేన్‌ ఎవరైనా మన బాలకృష్ణకు సరిపోరు. హీ ఈజ్ గ్రేట్‌.. అంతే.

చిరంజీవి గురించి ఒక్క మాటలో చెప్పండి?

రాధ: మా అమ్మాయి కార్తికకు కూడా చిరంజీవి అంటే చాలా ఇష్టం. హీరోగా, భర్తగా ఆయన పర్‌ఫెక్ట్‌. సురేఖ లాంటి వ్యక్తిని నేను ఇప్పటివరకు చూడలేదు. అన్నీ చక్కగా బ్యాలెన్స్ చేస్తారు. ఇటీవల వాళ్ల ఇంటికి వెళ్లినప్పుడు కూడా చిరంజీవి దోసెలు వేస్తున్నారు. ఆయనది చిన్నపిల్లాడి మనస్తత్వం.

మీది ప్రేమ వివాహమా?

రాధ: నాకు మొదటినుంచి లవ్‌ మ్యారేజ్‌ మీద మంచి అభిప్రాయం లేదు. అందుకే పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకున్నా. మావారు రియల్ హీరో. పెళ్లికి ముందు పెద్ద ఫ్యామిలీ అయితే చేసుకోను అని మా అమ్మతో చెప్పా. కానీ, మా ఆయన వాళ్లది చాలా పెద్ద కుటుంబం. ఎనిమిది మంది పిల్లలు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని