Sudheer Babu: మహేశ్‌బాబుతో మల్టీస్టారర్‌.. సుధీర్‌ బాబు ఏమన్నారంటే

సుధీర్‌ బాబు హీరోగా తెరకెక్కిన చిత్రం ‘హరోం హర’. తాజాగా దీని ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ జరిగింది. 

Published : 30 May 2024 17:21 IST

ఇంటర్నెట్‌ డెస్క్: ‘హరోం హర’ అంటూ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు హీరో సుధీర్ బాబు (Sudheer Babu). మాళవిక శర్మ కథానాయిక. జ్ఞానసాగర్‌ ద్వారక దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జూన్‌ 14న ప్రేక్షకుల ముందుకురానుంది. తాజాగా దీని ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈసందర్భంగా టీమ్ మీడియాతో ముచ్చటించింది. 

‘హరోం హర’ కథ గురించి చెప్పండి?

సుధీర్ బాబు: నేనెప్పుడూ యాక్షన్ సినిమా చేయాలనుకునేవాడిని. ‘హరోం హర’తో  (Harom Hara) అలాంటి కథ దొరికింది. మంచి విజయం సాధిస్తుందని నమ్మకం కలిగింది. చాలా రిస్క్‌ తీసుకొని చేసిన సినిమా ఇది. కృష్ణగారే నాతో ఈ చిత్రం చేయించారేమో అనిపించింది. అవుట్‌పుట్‌ అద్భుతంగా ఉంది. ట్రెండింగ్‌లో ఉన్న కథ ఇది. ఇలాంటి బ్యాక్‌డ్రాప్‌తో ఇప్పటివరకు ఇండియాలో ఏ సినిమా తెరకెక్కలేదు.

ఈ చిత్రంలో ఆడియన్స్‌కు ఆసక్తి కలిగించే పాయింట్‌ ఏంటి?

జ్ఞానసాగర్‌ ద్వారక: ‘హరోం హర’ చూశాక మంచి సినిమా చూశామనే భావన కలుగుతుంది. ఇప్పటివరకు చూసిన వారందరికీ నచ్చింది. జూన్‌ 14న ఆడియన్స్‌ నుంచీ ఇదే మాట వింటాం. నిర్మాతలు ఏ విషయంలోనూ రాజీ పడలేదు.

విమర్శలను ఎలా ఎదుర్కొంటారు?

సుధీర్ బాబు: నా సినిమాలు బాగా లేవని ఎవరైనా అంటే వాళ్లు నా నుంచి ఇంకా మంచి చిత్రాలు ఆశిస్తున్నారేమో అనిపిస్తుంది. ఏ విమర్శనైనా పాజిటివ్‌గానే తీసుకుంటా.

మే 31 నుంచి జూన్‌ 14కి వాయిదా వేయడానికి గల కారణమేంటి?

సుధీర్ బాబు: మంచి సినిమాను అందించాలనే వాయిదా వేశాం. మొదట మే 31న రిలీజ్‌ చేద్దామనుకున్నాం. కానీ, జూన్‌ 4న ఎన్నికల ఫలితాలు వస్తాయి. ఆ హడావిడి అంతా అయ్యాక విడుదలైతే బాగుంటుందని జూన్‌ 14కు మార్చాం. 

ఈ కథను ఎంచుకోవడానికి కారణమేంటి?

మాళవిక: ఈ పాత్ర నాకు సవాలుగా అనిపించింది. ఉత్తరాది నుంచి వచ్చి కుప్పం భాషలో తెరకెక్కుతోన్న సినిమాలో నటించాను. టీమ్‌ ఎంతో సపోర్ట్‌ చేసింది.

ప్రీ రిలీజ్‌కు మహేశ్‌బాబు వస్తారా?

సుధీర్ బాబు: చెప్పలేను. ఇంకా ఆయన్ని సంప్రదించలేదు.

కథను ఎంపిక చేయడంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు?

సుధీర్ బాబు: ఏ కథనైనా ఆడియన్స్‌ పాయింట్‌లో వింటాను. నా కెరీర్‌కు సరిపోతుందా? అని ఆలోచిస్తాను. కృష్ణగారి జయంతిరోజు ఈ సినిమా ట్రైలర్‌ రిలీజ్‌ కావడం ఆనందంగా ఉంది. నేను యాక్షన్‌ సినిమా చేయాలని ఆయన కోరుకున్నారు.

ఆడి పేరు సుబ్రహ్మణ్యం.. కేరాఫ్‌ కుప్పం.. ఆసక్తిగా ‘హరోం హర ’ ట్రైలర్‌

మహేశ్‌బాబుతో (Mahesh Babu) మల్టీస్టారర్‌ తీసే అవకాశం ఉందా?

సుధీర్ బాబు: నాకూ చేయాలని ఉంది. మా ఇద్దరికీ సరిపోయే కథ ఉంటే కచ్చితంగా కలిసి నటిస్తాం.

పాన్‌ ఇండియాలో రిలీజ్‌ చేసే ఆలోచనలు ఉన్నాయా?

సుధీర్ బాబు: అలా విడుదల చేయాలంటే మొదటినుంచే కథను దానికి అనుగుణంగా తెరకెక్కించాలి. విడుదలయ్యాక ఫలితాన్ని బట్టి ఈ విషయం గురించి ఆలోచిస్తాం. 

మీ అబ్బాయి మహేశ్‌లా ఉంటాడు కదా.. వాళ్లిద్దరూ సినిమా తీసే అవకాశం ఉందా?

సుధీర్ బాబు: మొదట మా అబ్బాయిని సినిమాల్లోకి రానివ్వండి.

పుల్లెల గోపీచంద్‌ బయోపిక్‌లో మీరు నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. నిజమేనా?

సుధీర్ బాబు: అవును. ఆ బయోపిక్‌లో నటిస్తున్నాను. సైన్‌ చేశాను. ఇంకా దానికి సంబంధించిన పనులు మొదలుపెట్టలేదు.

కృష్ణ, మహేశ్‌ సినిమాల్లో రీమేక్‌ చేసే అవకాశం వస్తే ఏది చేస్తారు?

సుధీర్ బాబు: అల్లురి సీతారామరాజు చేస్తాను.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని