Sundeep Kishan: అలా చేసుంటే మీ సినిమా బ్లాక్‌బస్టర్‌ అయ్యేది: సందీప్‌ కిషన్‌తో అభిమాని

తన అభిమానులతో సోషల్‌ మీడియా వేదికగా ముచ్చటించారు హీరో సందీప్‌ కిషన్‌.

Published : 25 Feb 2024 17:46 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: యంగ్‌ హీరో సందీప్‌ కిషన్‌ (Sundeep Kishan) ప్రస్తుతం ‘ఊరు పేరు భైరవకోన’ (Ooru Peru Bhairavakona) విజయోత్సాహంలో ఉన్నారు. ఈ సందర్భంగా సోషల్‌ మీడియా ఎక్స్‌ (ఇంతకుముందు ట్విటర్‌) ద్వారా అభిమానులతో ఆదివారం ముచ్చటించారు. గతంలో సందీప్‌ నటించిన ‘నిను వీడని నీడను నేనే’ (Ninu Veedani Needanu Nene) సినిమాని మంచి సమయంలో విడుదల చేసుంటే బ్లాక్‌బస్టర్‌ అయ్యేదని ఓ అభిమాని అభిప్రాయం వ్యక్తం చేశారు. సినిమాల విడుదల తేదీలపై జాగ్రత్తగా వ్యవహరించండంటూ సలహా ఇచ్చారు. దీనికి సందీప్‌ బదులిస్తూ.. సినిమా రిలీజ్‌ డేట్స్‌ విషయంలో ఇప్పటికీ యుద్ధాన్ని తలపించే పరిస్థితులున్నాయని, తన 14 ఏళ్ల కెరీర్‌లో ఓ హాలీడే కలిసొచ్చేలా ఒక్కసారి మేనేజ్‌ చేయగలిగానని పేర్కొన్నారు. మరికొందరు ఫ్యాన్స్‌ అడిగిన ప్రశ్నలు, సందీప్‌ సమాధానాలివీ..

* మీ సినిమాల్లో ఏది రీరిలీజ్‌ చేస్తే బాగుంటుందనుకుంటున్నారు?

సందీప్‌: ‘మైఖేల్‌’ సినిమా రీ ఎడిట్‌ చేసి, రీరిలీజ్‌ చేస్తే బాగుంటుంది.

* ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’ రీరిలీజ్‌ చేయొచ్చు కదా..

సందీప్‌: త్వరలో చేద్దాం..

* ఆల్‌టైమ్‌ ఫేవరెట్‌ ఫిల్మ్స్‌?

సందీప్‌: ఆర్య (తెలుగు), పుదుపెట్టై (తమిళం)

* ఒకవేళ రీమేక్‌ చేయాల్సి వస్తే 80, 90ల్లో వచ్చిన సినిమాల్లో దేన్ని ఎంపిక చేసుకుంటారు?

సందీప్‌: గోవిందా గోవింద (1994)

* ఊరు పేరు భైరవకోన చిత్రం ఓటీటీ విడుదల ఎప్పుడు?

సందీప్‌: ఏయ్‌.. ఇంకా థియేటర్లలోనే ఉంది. వెళ్లి చూడు బ్రదర్‌.

* ఈ ఏడాది ఏదైనా సినిమా నిర్మిస్తారా?

సందీప్‌: రెండు సినిమాలు ప్రొడ్యూస్‌ చేయాలనుకుంటున్నా.

* మీ పెళ్లి ఎప్పుడు?

సందీప్‌: హా.. హా.. హా.. 

రొమాంటిక్‌ థ్రిల్లర్‌గా దర్శకుడు కార్తీక్‌ రాజు రూపొందించిన ‘నిను వీడని నీడను నేనే’ 2019 జులై 12న విడుదలైంది. సోషియో ఫాంటసీగా వి. ఐ. ఆనంద్‌ తెరకెక్కించిన ‘ఊరు పేరు భైరవకోన’ ఫిబ్రవరి 16న ప్రేక్షకుల ముందుకొచ్చింది. కావ్యా థాపర్‌, వర్ష బొల్లమ్మ, వెన్నెల కిశోర్‌, హర్ష కీలక పాత్రలు పోషించి మెప్పించారు. సందీప్‌ కోలీవుడ్‌లోనూ బిజీగా ఉన్నారు. ఆయన కీలక పాత్ర పోషించిన ‘కెప్టెన్‌ మిల్లర్‌’ (Captain Miller) ఇటీవల రిలీజైంది. ఇప్పుడు ‘రాయన్‌’ (Raayan)లో ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఈ రెండింటిలోనూ ధనుష్‌ హీరో.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని