Mano: ఇంకోసారి అలా చేస్తే మద్రాసులో ఉండవన్నారు: మనో

Ali tho saradaga: ‘ఆలీతో సరదాగా’ తాజా ప్రోమో విడుదలైంది. ఈ వారం అతిథిగా ప్రముఖ గాయకుడు మనో విచ్చేశారు.

Published : 08 Sep 2021 01:12 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తను ఓ సందర్భంలో స్వరాలు పలికిస్తే, అది విన్న సంగీత దర్శకుడు విజయకృష్ణ మూర్తి ‘ఇంకోసారి ఇలా చేశావంటే మద్రాసులో ఉండవు’ అని అన్నారని ప్రముఖ గాయకుడు మనో తెలిపారు. ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి సతీసమేతంగా విచ్చేసిన ఆయన పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఆలీ వ్యాఖ్యాతగా ప్రతి మంగళవారం ఈటీవీలో ప్రసారమయ్యే కార్యక్రమం ఇది. ఈ నెల 13న టెలీకాస్ట్‌కానున్న ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. మనో పాటలు, ఆయన సతీమణి జమీలా మాటలతో ఆద్యంతం అలరిస్తోంది.

మనో, జమీలా మీ పరిచయం ఎలా మొదలైంది? అని ఆలీ అడగ్గా జమీలా చెప్పిన సమాధానం ఆకట్టుకుంటుంది. ‘ఆయన పాడిన అన్ని పాటలూ నాకు బాగా ఇష్టం. వాటిల్లో ‘ప్రియా ప్రియతమా రాగాలు’ ఎక్కువ ఇష్టం’ అని ఆమె తెలిపారు. ఇప్పటికీ రాత్రి 2- 3 గంటలకీ బిర్యానీ వండుతున్నట్టు చెప్పుకొచ్చారు. ‘ఓసారి గమపస పస అంటూ ఓ స్వరం రాశా. అది దర్శకుడు విశ్వనాథ్‌ గారికి నచ్చింది. ‘విజయ కృష్ణమూర్తి’.. వీడు చాలా బాగా రాస్తున్నాడే అని చెప్పి, ఫోన్‌ మాట్లాడేందుకు వెళ్లారాయన. ఇంతలో విజయ కృష్ణమూర్తిగారు పిలిచి.. ఇంకోసారి స్వరం రాసావనుకో మద్రాసులో ఉండవు’ అని అన్నారని మనో వివరించారు (నవ్వుతూ).

తనకి దూరమవుతాడనే కారణంగా ప్రముఖ సంగీత దర్శకుడు చక్రవర్తి ఈయనకి చాలాకాలం పాటలు ఇవ్వలేదని, ఈ విషయమై.. కొన్నాళ్ల తర్వాత చక్రవర్తి క్షమించమన్నారంటూ గత జ్ఞాపకాల్ని గుర్తుచేసుకున్నారు. ఆలీ నటించిన ‘సోంబేరి’ చిత్రానికి తొలిసారి సంగీత దర్శకుడిగా మారినట్టు చెప్పారు. ఇదే సినిమా వేడుకలో ‘ఒకవేళ నాగూర్‌ బాబు (మనో) మ్యూజిక్‌ డైరెక్టర్‌గా కొనసాగితే నాకు ఇంతమంది నిర్మాతలు సినిమా అవకాశాలు ఇచ్చేవారు కాదేమో!’ అని సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి అభిప్రాయపడ్డారని తెలిపారు. రజనీకాంత్‌ నటించిన ‘చంద్రముఖి’లోని సంభాషణలు చెప్పి మెప్పించారు. ఓ పద్యం ఆలపించారు. మనో పంచుకున్న విశేషాలన్నీ తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. అప్పటి వరకు ఈ ప్రోమో చూసి ఆనందించండి... 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని