Raghu Karumanchi: స్టాక్‌మార్కెట్‌.. రూ.కోట్లలో నష్టపోయా: రఘు

ఈటీవీలో ప్రసారమవుతోన్న సెలబ్రిటీ టాక్‌ షో ‘చెప్పాలని ఉంది’ (Cheppalani Vundi). బాలాదిత్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఈ కార్యక్రమంలో తాజాగా టాలీవుడ్‌ హాస్యనటుడు రఘు కారుమంచి (Raghu Karumanchi) పాల్గొన్నారు. తన కెరీర్‌ విశేషాలు పంచుకున్నారు.

Updated : 12 Mar 2024 11:54 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాన్ని పక్కనపెట్టి అనుకోనివిధంగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు హాస్యనటుడు రఘు కారుమంచి (Raghu Karumanchi). ‘ఆది’లోనే నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన ఎన్నోఏళ్ల పాటు ప్రేక్షకులను అలరించారు. ఒకానొక సమయంలో జీవితంలో ఆర్థికంగా ఒడుదొడుకులు ఎదుర్కొని వచ్చి సవాళ్లను స్వీకరించి ధైర్యంగా నిలబడ్డారు. తాజాగా ఈటీవీలో ప్రసారమవుతోన్న ‘చెప్పాలని ఉంది’ కార్యక్రమానికి విచ్చేసి పలు విశేషాలు పంచుకున్నారు.

మీ సినీ ప్రయాణం ఎలా మొదలైంది? ‘ఆది’లో అవకాశం ఎలా వచ్చింది?

రఘు: మా సొంతూరు తెనాలి. నేను పుట్టి పెరిగిందంతా హైదరాబాద్‌లోనే. నాన్న ఆర్మీలో పని చేశారు. డిగ్రీ పూర్తైన వెంటనే సాఫ్ట్‌వేర్‌లో మార్కెటింగ్‌ జాబ్‌ చేశా. ఉద్యోగంలో ఉన్నత శిఖరాలకు వెళ్లేందుకు ఎంబీఏలో ఇంటర్నేషనల్‌ మార్కెటింగ్‌ చేశా. ఆ తర్వాత సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో వర్క్‌ చేశా. నా తల్లిదండ్రులు ఆల్వాల్‌లో ఉండేవారు. నా ఆఫీస్‌ బంజారాహిల్స్‌లో ఉండేది. జర్నీ ఇబ్బందిగా మారడంతో బేగంపేట్‌లో ఒక అపార్ట్‌మెంట్‌లో ఉండేవాడిని. మా కింది ఫ్లాట్‌లో సురేందర్‌రెడ్డి, వి.వి.వినాయక్‌ ఉండేవారు. అలా, మా మధ్య పరిచయం ఏర్పడింది. నా మాటతీరు, హావభావాలు వాళ్లకు బాగా నచ్చాయి. ‘నేను దర్శకుడిని అయ్యాక నీకు తప్పకుండా ఆఫర్‌ ఇస్తా’నని వినాయక్‌ 1998లో మాటిచ్చారు. 2001 నవంబర్‌లో ఆయన ఆఫీస్‌ నుంచి నాకు ఫోన్‌ వస్తే వెళ్లి కలిశా. ‘ఆది’లో అవకాశం ఇచ్చారు. యాక్టింగ్‌ తెలియకుండా సెట్‌లోకి అడుగుపెట్టడంతో తొలిరోజు కెమెరామెన్‌ కోప్పడ్డారు. ‘ఎవడయ్యా వీడు. కెమెరా చూసి నవ్వుతున్నాడు’ అని కేకలు వేశారు. సెట్‌లో నేను కలిసిన తొలి నటుడు రాజీవ్‌ కనకాల. తారక్‌ అన్న అంటే నాకెంత ఇష్టమో అందరికీ తెలుసు. ఆయన అద్భుతమైన వ్యక్తి. నన్నెంతో ప్రోత్సహించారు. ఆ సినిమా తర్వాత కుటుంబంతో కలిసి తిరుమల వెళ్లా. స్వామివారి దర్శనం చేసుకునే సమయంలో కర్టెన్‌ వేసేశారు. నాకు చాలా బాధగా అనిపించింది. నిరాశతో ముందుకు అడుగువేయగానే అక్కడే ఉన్న ఒక అయ్యవారు నా చొక్కా పట్టుకుని వెనక్కిలాగారు. ‘‘హేయ్‌ ఫెయిర్‌ అండ్‌ లవ్లీ’’ అంటూ నన్ను గుర్తు పట్టారు. వెంటనే ప్రత్యేక దర్శనం చేయించారు. దేవాలయం నుంచి బయటకు రాగానే చుట్టుపక్కల వాళ్లు ఫొటోలు తీసుకున్నారు. సినిమాలో నటిస్తే ఇంతటి పాపులారిటీ ఉంటుందా? అనుకున్నా. వచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు అడుగువేశా.

మీ కెరీర్‌లో మరో మైలురాయి ‘అదుర్స్’. అప్పటివరకూ ఉద్యోగం చేస్తూనే సినిమాలు చేశారా? రెండింటినీ బ్యాలెన్స్‌ చేయడం ఎలా సాధ్యమైంది?

రఘు: వృత్తిపరంగా మంచి స్థాయిలో ఉండటంతో నాకంటూ కాస్త స్వేచ్ఛ ఉండేది. దానిని దుర్వినియోగం చేసుకోకుండా, ఎటువంటి బ్రేక్‌ తీసుకోకుండా రెండింటినీ బ్యాలెన్స్‌ చేశా. ‘ఆది’ నుంచి ‘అదుర్స్‌’ వరకూ దాదాపు ఎనిమిదేళ్ల కెరీర్‌లో ఎన్నో మైలురాళ్లు చూశా. 38 సినిమాలు చేస్తే అందులో 34 చిత్రాలు బ్లాక్‌బస్టర్స్‌ అందుకున్నాయి. ‘ది అంగ్రేజ్‌’, ‘హైదరాబాద్‌ నవాబ్స్‌’ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిపెట్టాయి. దురదృష్టవశాత్తూ తెలుగులో నాకంత గుర్తింపు రాలేదు. ఎందుకంటే, తెలుగువాళ్లు ఆ ప్రాజెక్ట్స్‌ చూడలేదు. 2008లో మహేశ్‌బాబు - సురేందర్‌రెడ్డి సినిమా చేశారు. షూట్‌ అప్పుడు ‘ది అంగ్రేజ్‌’ ‘హైదరాబాద్‌ నవాబ్స్‌’ గురించి సురేందర్‌ రెడ్డిని మహేశ్‌బాబు అడిగారు. సురేందర్‌ రెడ్డి చెప్పడంతో ఆ రెండు ప్రాజెక్ట్స్‌లో నేను నటించానని మహేశ్‌కు తెలిసింది. ‘రఘు.. నువ్వు ఆ సినిమాల్లో నటించావా? వాటి డీవీడీలు కావాలి’ అని అడిగారు. వెంటనే మాల్‌ నుంచి తీసుకువెళ్లి ఆయనకు ఇచ్చా. ఆయన నన్నెంతో మెచ్చుకున్నారు. ‘రాఖీ’ షూట్‌ నుంచి వచ్చిన వెంటనే ఎన్టీఆర్‌ అడగ్గా.. ‘హైదరాబాద్‌ నవాబ్స్‌’ ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటుచేశా. అందులో నా యాక్టింగ్‌ చూసి తారక్‌ ప్రశంసల వర్షం కురిపించారు. ఆ మాటలు నాకు ఎప్పటికీ గుర్తుంటాయి. అవే నాకు స్ఫూర్తి. ఆ సినిమా చూసి సల్మాన్‌ఖాన్‌ నన్ను ప్రత్యేకంగా కలిశారు.

జీవితంలో ఎప్పుడైనా బాధపడిన క్షణాలు ఉన్నాయా? ఉద్యోగం ఎందుకు మానేశానా అని అనుకున్నారా?

రఘు: ‘అదుర్స్‌’ రిలీజయ్యాక జాబ్‌కు రిజైన్‌ చేశా. కొన్ని నెలలు అంతా చక్కగానే జరిగింది. ఆ తర్వాత ఆర్థికంగా కాస్త ఒడుదొడుకులు ఎదుర్కొన్నా.  అలాంటి సమయంలో తొందరపడ్డాననిపించింది. నా భార్యాపిల్లలు ఎప్పుడూ ప్రశ్నించలేదు. బాగా నమ్మినవాళ్ల వల్లే ఎక్కువగా నష్టపోయా. అప్పుడు బాగా బాధపడ్డా. తొందరపడి ఉద్యోగం వదిలేశానేమో అనుకున్నా. నాకు షేర్‌ మార్కెట్లపై అవగాహన ఉంది. తరచూ స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడి పెడుతుంటా. ఓసారి షూట్‌కు ల్యాప్‌టాప్‌ తీసుకువెళ్లలేకపోయా. ఆరోజు షేర్స్‌ భారీ మొత్తంలో పడిపోయాయి. దాంతో కోట్లలో నష్టపోయా. కోపం, బాధ, చిరాకుతో కొన్ని నెలల పాటు బెడ్‌రూమ్‌ నుంచి బయటకు కూడా రాలేదు. ఆరోజు ల్యాప్‌టాప్‌ తీసుకువెళ్లి ఉంటే ఏదో ఒకటి చేసేవాడిని.

ఇప్పుడు మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమనిపిస్తుంది?

రఘు: ఏది ఏమైనా అది నేను తీసుకున్న మంచి నిర్ణయమే అనుకుంటా. పిల్లలు, కుటుంబపరంగా ఆలోచిస్తే తప్పు చేశాననిపిస్తుంది. ఒకప్పుడు నాతోపాటు ఉన్నవాళ్లు ఇప్పుడు మంచి జీవితాన్ని అనుభవిస్తున్నారనిపిస్తుంది.

మీరు యాక్టింగ్‌ ఎక్కడ నేర్చుకున్నారు?

రఘు: నిజం చెప్పాలంటే.. యాక్టింగ్‌ చేసి ఉంటే ఇబ్బంది పడేవాడిని. ఇప్పటికీ నాకు యాక్టింగ్‌ రాదు. ఎక్కడ ఎలా ప్రవర్తించాలో మాత్రమే తెలుసు. ప్రేక్షకులు నన్ను ఆదరించడంతో వాళ్లను అలరించడానికి ఇంకా ఏదైనా చేయాలనే తపన పెరిగింది. తోటి నటీనటులను చూసి నాకు నేనే ఒక ఛాలెంజ్‌ చేసుకున్నా. ‘ఆది’ తర్వాత ‘సత్య’ అనే ధారావాహిక చేశా. అక్కడ ఎంతోమంది సీనియర్‌ నటీనటులను కలిశా. రాజీవ్‌ నాకెంతో సాయం చేశాడు. ‘ఖైదీ నంబర్‌ 150’ సమయంలో చిరంజీవి నన్ను మెచ్చుకున్నారు. ‘‘నటనలో నీకున్న శక్తి నాకు తెలుసు. అందుకే కళామ తల్లి సాఫ్ట్‌వేర్‌ నుంచి ఇండస్ట్రీకి పిలిపించుకుంది’’ అని అన్నారు.

ఇండస్ట్రీలోకి అడుగుపెడతానని చెప్పినప్పుడు తల్లిదండ్రులు ఏమన్నారు?

రఘు: నటుడినైన వెంటనే మా నాన్నకు విషయం చెప్పలేదు. ఐదారేళ్ల తర్వాత మా నాన్నకు ఆయన సహోద్యోగులు చెప్పారు. బయటవాళ్లందరూ ఆయన్ని.. ‘‘రఘు వాళ్ల నాన్న’’ అని గుర్తుపట్టేవారు. ఆ సమయంలో టీవీలో నా ఇంటర్వ్యూ వచ్చింది. ‘‘ఇవన్నీ ఎందుకురా. మంచిగా ఉద్యోగం చేసుకోక’’ అని చెప్పినప్పటికీ.. లోపల మాత్రం నటుడిగా గుర్తింపు పొందానని సంతోషించారు.

నేనింకా కష్టపడి ఉంటే బాగుండేది అని ఎప్పుడైనా అనిపించిందా? లేదా మీరు ఏదైనా పాత్ర కోసం కష్టపడిన సందర్భాలు ఉన్నాయా?

రఘు: పాత్రల కోసం కష్టపడుతున్నానని ఎప్పుడూ అనుకోలేదు. ప్రతీది ఎంజాయ్‌ చేశా. కొన్నిసార్లు నిరాశకు గురైన సందర్భాలున్నాయి. బాగా చేసినప్పటికీ రావాల్సినంత గుర్తింపు ఎందుకు రాలేదు? ఆ సీన్‌ ఎందుకు తొలగించారు? అని ఫీలయ్యా. ప్రతి సినిమా, ప్రతి పాత్ర ఇంతకంటే బాగా చేసుంటే బాగుండేది కదా అనుకునేవాడిని.

సినిమా, సీరియల్‌, టీవీ షోస్‌.. మీకు కనిపించిన వ్యత్యాసం ఏమిటి?

రఘు: సినిమా ఎప్పటికీ సినిమానే. సీరియల్‌ నుంచి ఎంతో నేర్చుకున్నా. సీరియల్స్‌లో కనిపించినంత కాలం నువ్వు స్టార్‌వే. ఒక్కసారి సీరియల్‌ ఆగిపోతే నిన్ను ఎవరూ గుర్తుపట్టరు. కామెడీ, విలనిజం ఇలా నేను ఏదైనా చేయగలననే ఆలోచన అందరిలో క్రియేట్‌ చేయాలనే ఉద్దేశంతోనే ‘జబర్దస్త్‌’ చేశా. 26 ఎపిసోడ్స్‌ కోసం వర్క్‌ చేశా. మంచి పేరు వచ్చింది. ప్రేక్షకులకు బాగా చేరువయ్యా. కానీ, సినిమాల పరంగా నాకు ఎలాంటి ఉపయోగం లేకుండాపోయింది. అనివార్య కారణాల వల్ల కొన్ని అవకాశాలు వదులుకోవాల్సి వచ్చింది. దాంతో ప్రోగ్రామ్‌ నుంచి వైదొలగా. కమ్యునికేషన్‌ గ్యాప్‌ వల్ల ‘చెన్నై ఎక్స్‌ప్రెస్‌’ ఆఫర్‌ చేజారింది. అందుకు ఇప్పటికీ ఎంతో బాధపడుతుంటా.

ప్రస్తుతం రాజకీయాల్లో రాణిస్తోన్న ఓ కీలక నేత మీ క్లాస్‌మేట్‌ అని విన్నాం. నిజమేనా? ఇంతకీ ఆయన ఎవరు?

రఘు: అవును. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నా క్లాస్‌మేట్‌. ఏవీ కాలేజీలో బి.ఎ. ఆఫీస్‌ మేనేజ్‌మెంట్‌ చదివే రోజుల్లో మేమిద్దరం క్లాస్‌మేట్స్‌. టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జెట్టి కుసుమకుమార్‌ నా బంధువు. ఆయన కూడా మాతోపాటే చదువుకున్నారు. మేము ముగ్గురం ఒకే బెంచ్‌లో కూర్చొనేవాళ్లం. అప్పట్లో నేను ఒక్కడినే రాజకీయాలపై ఆసక్తి చూపించేవాడిని. రేవంత్‌తో నాకు మంచి అనుబంధం ఉంది. మేము తరచూ మాట్లాడుకునేవాళ్లం. సీఎం అయ్యాక ఆయన్ని కలవలేదు. స్నేహాన్ని స్నేహంగానే ఉంచడం నాకు ఇష్టం.

మీరు తెనాలి వెళ్లి వస్తుంటారా?

రఘు: చుట్టాలు ఉన్నారు. ఫంక్షన్స్‌ ఉన్నప్పుడు వెళ్తుంటా. నాకు డ్రైవింగ్‌, వంట చేయడం అంటే ఇష్టం. చిరాకుగా ఉన్నప్పుడు డ్రైవింగ్‌కు వెళ్లిపోతుంటా. ప్రకృతితో మమేకం కావడం నాకెంతో ఇష్టం. దాదాపు 400 మొక్కలు పెంచుతున్నా. గత మూడున్నర ఏళ్లలో బయట నుంచి కూరగాయలు కొనలేదు.

ఎన్టీఆర్‌తో ఫ్రెండ్‌షిప్‌ ఎలా మొదలైంది?

రఘు: మా పరిచయం ‘ఆది’తోనే మొదలైంది. రాను రాను మేము క్లోజ్‌ ఫ్రెండ్స్‌ అయ్యాం. సీనియర్‌ ఎన్టీఆర్‌ అంటే నాకు ఎంత ఇష్టమో తారక్‌ అంటే కూడా అంతే ఇష్టం. నేను ఎప్పుడూ ఆయన్ని పేరు పెట్టి పిలవను. పెద్దన్న అని పిలుస్తుంటా. ఆ స్థాయిలో ఉన్నప్పటికీ మాతో ఎంతో సరదాగా ఉంటారు. గుండె, ఊపిరితిత్తులు మాదిరిగా ఎన్టీఆర్‌ కూడా నా శరీరంలో ఒక అవయవమే. నేను ప్రొడెక్షన్‌ హౌస్‌ పెట్టి.. ఒకే ఒక్క సినిమా చేస్తా. అది కూడా ఆయనతోనే చేస్తా.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని