Nagendra kaasi: మట్టి కథలంటే ఇష్టం

‘‘సాహిత్య నేపథ్యం నుంచి వస్తున్న రచయితలకు ప్రస్తుతం చిత్రసీమలో మంచి గుర్తింపు లభిస్తోంది’’ అంటున్నారు నాగేంద్ర కాశి. ‘పలాస’, ‘విరూపాక్ష’, ‘కోట బొమ్మాళి పీఎస్‌’ లాంటి విజయవంతమైన చిత్రాలకు రచనా సహకారం అందించిన నాగేంద్ర..

Updated : 11 Dec 2023 09:49 IST

‘‘సాహిత్య నేపథ్యం నుంచి వస్తున్న రచయితలకు ప్రస్తుతం చిత్రసీమలో మంచి గుర్తింపు లభిస్తోంది’’ అంటున్నారు నాగేంద్ర కాశి. ‘పలాస’, ‘విరూపాక్ష’, ‘కోట బొమ్మాళి పీఎస్‌’ లాంటి విజయవంతమైన చిత్రాలకు రచనా సహకారం అందించిన నాగేంద్ర.. ఇప్పుడు ‘హాయ్‌ నాన్న’కు దర్శకుడు శౌర్యువ్‌తో కలిసి రచయితగా పని చేశారు. నాని, మృణాల్‌ ఠాకూర్‌ జంటగా నటించిన ఈ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలోనే ఆదివారం విలేకర్లతో ముచ్చటించారు.

  • ‘‘నేను ‘పలాస’కు తొలిసారి రచనా సహకారమందించా. ఆ తర్వాత ‘శ్రీదేవి సోడా సెంటర్‌’కు కథ అందించా. కానీ, అది ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఆ తర్వాత సుకుమార్‌ రైటింగ్స్‌ టీమ్‌లో చేరి ‘పుష్ప’, ‘విరూపాక్ష’ చిత్రాలకు పని చేశా. ఈ క్రమంలోనే నేను రాసిన ‘నల్ల వంతెన’ అనే పుస్తకం ద్వారా ‘హాయ్‌ నాన్న’కు పని చేసే అవకాశం దొరికింది’’.
  • ‘‘కథలోని కోర్‌ ఎమోషన్‌ను పట్టుకొని ‘హాయ్‌ నాన్న’కు మాటలు రాశాను. ఈ చిత్ర విషయంలో నానికి, తన కూతురికి మధ్య వచ్చే సన్నివేశాలకు సంభాషణలు రాయడం సవాల్‌గా అనిపించింది. ముఖ్యంగా ఆ పాపకు తన తల్లి కథ చెప్పాల్సి వచ్చినప్పుడు.. అసలు కథను కొంత దాస్తూ.. దాంట్లోని ఎమోషన్‌ను పాప ఆలోచనా శక్తికి అందే విధంగా చిన్న చిన్న మాటలతో బలంగా చెప్పడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. సినిమా విడుదలయ్యాక ఆ మాటలకు ఇండస్ట్రీ నుంచి మంచి ప్రశంసలొచ్చాయి’’.
  • ‘‘మాది కోనసీమ. బీటెక్‌ పూర్తి చేశాక.. ఎయిర్‌క్రాఫ్ట్‌ ఇంటీరియర్‌ డిజైనర్‌గా పని చేశా. నాకు చిన్నప్పటి నుంచి కథలు రాయడమంటే ఇష్టం. ఈ క్రమంలోనే ‘నల్ల వంతెన’ అనే పుస్తకం రాశా. దాని ద్వారానే దర్శకుడు   సుకుమార్‌కు దగ్గరయ్యా. అలా ఆయన సుకుమార్‌ రైటింగ్స్‌లో పని చేసే అవకాశం వచ్చింది. మట్టి మీద నిలబడే కథలంటే నాకు చాలా ఇష్టం. భవిష్యత్తులో దర్శకత్వం చేస్తానేమో కానీ.. ప్రస్తుతానికైతే నా దృష్టి రచనపైనే ఉంది. నేను చెప్పాల్సిన కథలు, మాటలు చాలా ఉన్నాయి. ఇప్పుడు నేను ‘పుష్ప2’, ‘ఆర్‌సీ 16’, ‘రెయిన్‌బో’ చిత్రాలతో పాటు మరికొన్ని సినిమాలకు రచయితగా పని చేస్తున్నా’’.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని