Kidnap in US: అమెరికాలో భారత సంతతి కుటుంబం కిడ్నాప్‌

అమెరికాలోని కాలిఫోర్నియాలో ఓ భారత సంతతి కుటుంబం అపహరణకు గురయ్యింది.

Published : 04 Oct 2022 20:19 IST

కాలిఫోర్నియా: అమెరికాలోని కాలిఫోర్నియాలో ఓ భారత సంతతి కుటుంబం అపహరణకు గురికావడం కలకలం రేపుతోంది. కాలిఫోర్నియాలోని మెర్స్‌డ్‌ కౌంటీలో ఈ ఘటన చోటుచేసుకుంది. అపహరణకు గురైన వారిలో ఎనిమిదేళ్ల బాలికతోపాటు ఆమె తల్లిదండ్రులు ఉన్నారు. అయితే, దుండగులు ప్రమాదకర ఆయుధాలు కలిగి ఉన్నట్లు పేర్కొన్న పోలీసులు.. అనుమానాస్పద వ్యక్తులను ఎవరూ నేరుగా సంప్రదించవద్దని హెచ్చరించారు.

భారత సంతతికి చెందిన జస్దీప్‌ సింగ్‌ (36), జస్లీన్‌ కౌర్‌ (27) దంపతులు తమ ఎనిమిదేళ్ల చిన్నారితో కలిసి సెంట్రల్‌ వ్యాలీలో నివాసముంటున్నారు. వీరితోపాటు చిన్నారి మామ అమన్‌దీప్‌ సింగ్‌ (39)లు అక్టోబర్‌ 3న అపహరణకు గురైనట్లు స్థానిక పోలీసులు వెల్లడించారు. సౌత్‌హైవే 59లోని 800 బ్లాక్‌ వద్ద వీరిని కొందరు దుండగులు ఎత్తుకెళ్లినట్లు గుర్తించామన్నారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నామన్న పోలీసులు.. అపహరణకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందన్నారు.

దుండగులు ఆధారాలన్నింటినీ నాశనం చేశారని.. ఇప్పటివరకు  ఎటువంటి డిమాండ్లు రాలేదని మెర్స్‌డ్‌ కౌంటీ పోలీసులు వెల్లడించారు. వారి దగ్గర ప్రమాదకర ఆయుధాలు ఉన్నాయని.. అనుమానాస్పద వ్యక్తులు, బాధితులను నేరుగా సంప్రదించవద్దని సూచించారు. ఏదైనా సమాచారం ఉంటే వెంటనే తమకు తెలియజేయాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని