
జార్జియా: రీకౌంటింగ్‌లోనూ బైడెన్‌దే గెలుపు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జార్జియా పోరు ఆసక్తికరంగా సాగింది. ఇక్కడ ఆది నుంచి రిపబ్లికన్ అభ్యర్థి, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. డెమొక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్ మధ్య గెలుపు దోబూచులాడుతూ వచ్చింది. చివరకు బైడెన్ అత్యల్ప మెజార్టీతో విజయం సాధించడంతో రీకౌంటింగ్‌కు వెళ్లాల్సి వచ్చింది. అయితే రీకౌంటింగ్‌లోనూ గెలుపు బైడెన్‌నే వరించింది. రీకౌంటింగ్‌కు ముందు బైడెన్, ట్రంప్ మధ్య తేడా దాదాపు 14వేలు ఉండగా.. పునఃలెక్కింపు తర్వాత డెమొక్రాటిక్ నేత 12,284 ఓట్ల తేడాతో విజయం సాధించినట్లు జార్జియా ఉన్నత ఎన్నికల అధికారి వెల్లడించారు.
రిపబ్లికన్లకు గట్టి పట్టున్న జార్జియా రాష్ట్రంలో 28ఏళ్ల తర్వాత ఓ డెమొక్రాటిక్ నేత విజయం సాధించడం ఇదే విశేషం. చివరిసారిగా 1992లో అప్పటి అధ్యక్ష అభ్యర్థి, డెమొక్రాటిక్ నేత బిల్ క్లింటన్ ఇక్కడ గెలుపొందారు. ఆ తర్వాత నుంచి జార్జియాలో రిపబ్లికన్లే ఆధిపత్యం ప్రదర్శిస్తూ వస్తున్నారు. 2016 అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ నేత హిల్లరీ క్లింటన్, రిపబ్లికన్ ట్రంప్ మధ్య హోరాహోరీ పోరు జరగ్గా.. చివరకు హిల్లరీపై ట్రంప్ కేవలం 5శాతం ఓట్ల తేడాతో విజయం సాధించారు. తాజా ఎన్నికల్లో ట్రంప్, బైడెన్ మధ్య ఓట్ల మార్జిన్ 1 శాతం కంటే తక్కువగా ఉండటంతో ఇక్కడ రీకౌంటింగ్ జరపాల్సి వచ్చింది. జార్జియాలో 16 ఎలక్టోరల్ ఓట్లు ఉన్నాయి. తాజా ఫలితంలో బైడెన్ ఎలక్టోరల్ ఓట్ల సంఖ్య 306కు పెరగ్గా.. ట్రంప్ 232 ఎలక్టోరల్ ఓట్లతో ఓటమిని చవిచూశారు.
అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్ విజయం సాధించినట్లు నవంబరు 7న అమెరికా ప్రధాన మీడియా సంస్థలన్నీ ప్రకటించాయి. అయితే ట్రంప్ మాత్రం ఇంతవరకూ తన ఓటమిని ఒప్పుకోకపోవడం గమనార్హం. ఎన్నికల్లో మోసాలు జరిగాయని గత కొంతకాలంగా ఆరోపిస్తూ వస్తున్న ట్రంప్ న్యాయస్థానాలను కూడా ఆశ్రయించారు. అంతేగాక, బైడెన్‌తో అధికార మార్పిడికి కూడా ససేమిరా అంటున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.