
వర్జీనియా గవర్నర్ రేసులో భారత సంతతి వ్యక్తి
వాషింగ్టన్: అగ్రరాజ్యంలోని వర్జీనియా రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి భారత సంతతికి చెందిన వ్యాపారవేత్త పునీత్ అహ్లువాలియా పోటీపడుతున్నారు. ఈయన రిపబ్లికన్ పార్టీ తరఫున ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘వర్జీనియా ప్రస్తుతం సమస్యల్లో ఉంది. ఇక డెమోక్రటిక్ పార్టీ ఇస్తున్న పాత, వ్యర్థమైన వాగ్దానాలకు ఎప్పుడో కాలం చెల్లింది. ప్రస్తుతం మన రాష్ట్రానికి కొత్త ఆలోచనలు కావాలి. పెట్టుబడులు, ఉద్యోగాలు, సంపద, అభివృద్ధి సాధించేందుకు ఓ కొత్త వ్యాపార వాతావరణం కావాలి’’ అని ఆయన ప్రకటించారు.
‘‘నేను అమెరికాలో జన్మించలేదు. కానీ నేను, నా భార్య ఇష్టపూర్వకంగా అమెరికా పౌరులమయ్యాం. నేను రాజకీయ వేత్తను కాదు. కానీ అమెరికన్ స్వప్నాన్ని సాకారం చేసుకున్న అమెరికా పౌరుడిగా నేనెంతో గర్విస్తున్నాను’’ అని ఆయన తెలిపారు. అంతేకాకుండా ధైర్యంగా, కష్టపడి పనిచేసే వర్జీనియా పోలీసు సిబ్బందికి శాంతి భద్రతల కల్పనలో చేయూత నివ్వాలని దిల్లీకి చెందిన పునీత్ అహ్లువాలియా పిలుపునిచ్చారు.
దిల్లీ పబ్లిక్ స్కూల్లో విద్యాభ్యాసం చేసిన అహ్లువాలియా, 1990లో అమెరికాకు వలస వెళ్లారు. ఈయన ప్రస్తుతం ‘ద లివింగ్స్టన్ గ్రూప్’ సంస్థకు అంతర్జాతీయ వాణిజ్య సలహాదారుగా వ్యవహరిస్తున్నారు. ఈయన గత రెండు దశాబ్దాలుగా అమెరికా రిపబ్లికన్ పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాలుపంచుకుంటున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.