అంతర్జాలం వేదికగా.. ఘనంగా వద్దిపర్తి పద్మాకర్‌ శతావధానం

భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా ప్రపంచ వ్యాప్తంగా 108 మంది మహిళా పృచ్ఛకులతో అంతర్జాల వేదికగా శతావధానం కార్యక్రమం నిర్వహించారు. పృచ్ఛకులు అడిగిన ప్రశ్నలకు ఏలూరు, శ్రీ ప్రణవ పీఠానికి చెందిన బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్‌ సమాధానాలిచ్చారు.

Updated : 07 Dec 2022 19:19 IST

భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా ప్రపంచ వ్యాప్తంగా 108 మంది మహిళా పృచ్ఛకులతో అంతర్జాల వేదికగా బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్‌ శతావధానం కార్యక్రమం నిర్వహించారు. పృచ్ఛకులు అడిగిన ప్రశ్నలకు ఏలూరులోని శ్రీ ప్రణవ పీఠం వేదికగా బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్‌ సమాధానాలిచ్చారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో మధ్యప్రదేశ్‌ భాజపా బాధ్యులు మురళీధర్‌ రావు పాల్గొన్నారు. రెండున్నర రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ తెలుగు సంస్థల నుంచి 108 మంది మహిళలు పాల్గొన్నారు. మూడవ రోజు ఉదయం జరిగిన ధారణ సభ నయనానందకరంగా ఒక పండుగ వాతావరణాన్ని తలపించింది. ప్రత్యక్షంగానూ, అంతర్జాలంలోనూ తిలకిస్తున్న సాహితీప్రియులు అశ్చర్యపోయేలా బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గత రెండు రోజుల్లో పూరణ చేసిన 78 సమస్యలని కేవలం 55 నిమిషాల్లోనే ధారణ చేశారు.

అనంతరం జరిగిన విజయోత్సవ సభలో భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెలుగు భాషలో ప్రత్యేకమైన ప్రక్రియగా అవధానానికి ఉన్న స్థానం సుస్థిరమని ఆయన అన్నారు. కేవలం మహిళా పృచ్ఛకులతో అవధాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కోలవెన్ను మలయవాసిని, డాక్టర్ శారదా పూర్ణ సుసర్ల శొంఠి, బులుసు అపర్ణ, మా శర్మ, డాక్టర్ సుహాసిని ఆనంద్ కొమరగిరి, పాలడుగు శ్రీచరణ్‌ తోపాటు ప్రపంచం నలుమూలల నుంచి తెలుగు భాషాభిమానులు, పలు తెలుగు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. 

ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన అంతర్జాతీయ తెలుగు సంస్థలకు ప్రణవ పీఠం స్వచ్ఛంద కార్య నిర్వాహకురాలు కృష్ణ పద్మ ధన్యవాదాలు తెలిపారు. ఉత్తర అమెరికా ఖండం, తెలుగు తల్లి కెనడా -లక్ష్మీ రాయవరపు, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ప్రణవ పీఠం నుంచి శ్రీ రావు తల్లాప్రగడ, ఆసియా ఖండం- మలేషియా తెలుగు సంఘం - డా. వెంకట ప్రతాప్, సత్య మల్లుల, ఆఫ్రికా ఖండం - దక్షిణ ఆఫ్రికా సాహిత్య వేదిక - రాపోలు సీతారామరాజు పాల్గొన్నారు. ‘‘ అవధానిగా, కవిగా, సంగీతవేత్తగా, పౌరాణికులుగా, ప్రవచనకర్తగా, శ్రీ ప్రణవపీఠ స్థాపకులుగా, త్రిభాషా కోవిదులుగా పేరుపొందిన వద్దిపర్తిని అందరూ కొనియాడారు. పద్యం మన సంపద. అవధానం మన సంతకం. ఈ మార్గంలో నడుస్తున్న ప్రతి కవీ ధన్యులు. ఆ విధంగా బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ పరమ ధన్యులు’’అని కృష్ణ పద్మ కొనియాడారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని