చికాగోలో ‘ఆటా’ కార్యాలయం.. అట్లాంటాలో సందడిగా ‘ఆటా’ బోర్డు కీలక సమావేశం

అమెరికాలోని అట్లాంటాలో సెప్టెంబర్‌ 24న అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) కార్యవర్గ సమావేశం జరిగింది. పెద్ద ఎత్తున కార్యవర్గ సభ్యులు, స్టాండింగ్.....

Published : 28 Sep 2022 16:03 IST

అట్లాంటా: అమెరికాలోని అట్లాంటాలో సెప్టెంబర్‌ 24న అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) కార్యవర్గ సమావేశం జరిగింది. పెద్ద ఎత్తున కార్యవర్గ సభ్యులు, స్టాండింగ్ కమిటీలు, ప్రాంతీయ సమన్వయకర్తలు ఈ సమావేశంలో పాల్గొని పలు అంశాలపై చర్చించారు. ఆటా కార్యాలయాన్ని చికాగోలో ఏర్పాటు చేసేందుకు ఈ బోర్డు ఏకగ్రీవంగా తీర్మానించింది. ఆటా ప్రెసిడెంట్ భువనేశ్ బుజాల ప్రారంభోపన్యాసం చేస్తూ తనపై కార్యవర్గం ఉంచిన ఈ గురుతర బాధ్యతకు సదా కృతజ్ఞుడినన్నారు. తన ఆధ్వర్యంలో ఆటాలో ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలు నిర్వహించినట్టు తెలిపారు. ఆటా చరిత్రలో ఎన్నడూ చూడని విధంగా 1500 మందితో వాషింగ్టన్‌ డీసీలో మహాసభలు నిర్వహించటం తన అదృష్టంగా భావిస్తున్నానని, అందుకు తోడ్పాటు అందించిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. కోశాధికారి సాయినాథ్ రెడ్డి బోయపల్లి నివేదికను బోర్డుకు సమర్పించారు. మహాసభల సమయంలో ఎంతో సమర్థంగా కోశాధికారి బాధ్యతలు నిర్వహించినందుకు ఆయన సేవలను ఆటా బోర్డు కొనియాడింది. ఎన్నో కీలకమైన విషయాలు చర్చించిన ఈ సమావేశాన్ని సమర్థంగా నిర్వహించినందుకు కార్యదర్శి హరిప్రసాద్ రెడ్డి లింగాలను కార్యవర్గం అభినందించింది.

‘ఆటా‘లో రెండేళ్లకోసారి ఎన్నుకొనే నూతన కార్యవర్గం నామినేషన్ కమిటీ ఛైర్మన్‌గా పరమేశ్‌ భీంరెడ్డిని నియమించారు. ఈ సందర్భంగా పరమేశ్‌ మాట్లాడుతూ.. ఆటాని ఎంతో సమర్థంగా ముందుండి నడిపించినందుకు అధ్యక్షుడు భువనేశ్‌ను అభినందించారు. తొలిసారి వినూత్న పద్ధతిలో బ్యాలెట్‌ ద్వారా నామినేషన్ కమిటీ సభ్యుల్ని ఎన్నుకున్నారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్‌ ప్రాసెస్‌, ఉపయోగాలను సంయుక్త కార్యదర్శి రామకృష్ణ  వివరించారు. ఆటా ఎన్నికలు ఎలక్ట్రానిక్ బ్యాలెట్‌ ద్వారా నిర్వహించడానికి సభ ఆమోద ముద్ర వేసింది. ఎన్నికల కమిటీ ఛైర్‌గా జాయింట్‌ ట్రెజరర్‌ విజయ్‌ కుందూరు వ్యవహరిస్తారు. ఆటా 17వ మహాసభల కన్వీనర్‌ సుధీర్‌ బండారు, కో-కన్వీనర్‌ కిరణ్‌ పాశం, కోర్‌కమిటీ, అడ్‌హక్‌, కాన్ఫరెన్స్‌ కమిటీల సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. ఆటా కాన్ఫరెన్స్‌ అడ్వయిజరీ కమిటీ ఛైర్‌ జయ్‌ చల్లా ఇంత పెద్ద ఎత్తున ఆటా మహా సభలు నిర్వహించడం ద్వారా ఆటా బ్రాండ్‌ వాల్యూ రెట్టింపు కావడం ఆనందదాయకమన్నారు. 

అట్లాంటాలో సభ ఘనంగా నిర్వహించినందుకు నిర్వాహకులకు ఆటా అడ్వయిజరీ కమిటీ ఛైర్‌ హనుమంత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఆటా కార్యాలయాన్ని చికాగోలో నెలకొల్పడం తన చిరకాల స్వప్నమని.. దాన్ని సాకారం చేస్తున్నందుకు బోర్డు సభ్యులను అభినందించారు. అట్లాంటా టీం సాయంత్రం నిర్వహించిన కార్యక్రమంలో ఆటా పూర్వ అధ్యక్షుడు కరుణాకర్ అసిరెడ్డి, బర్డ్ అఫ్ ట్రస్టీస్ అనిల్ బొదిరెడ్డి,  వేణు పిసికే, ప్రశీల్ గూకంటి, కాన్ఫరెన్స్ కో-ఆర్డినేటర్ కిరణ్  పాశం స్పాన్సర్లను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆటా ప్రెసిడెంట్ ఎలెక్ట్ మధు బొమ్మినేని మాట్లాడుతూ.. నామినేషన్ ప్రక్రియ, ఎలక్ట్రానిక్‌ ఓటింగ్ పద్ధతి ద్వారా పటిష్టమైన నూతన కార్యవర్గం ఏర్పాటు అవుతుందని ఆకాంక్షించారు. మహిళలు విరివిగా సంస్థ కార్యకలాపాల్లో భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ఆటా అట్లాంటా టీం ఇంత అద్భుతంగా ఏర్పాట్లు చేయడం తనకు ఎంతో ఆనందదాయకమని కొనియాడారు. ఈ సందర్భంగా నిర్వహించిన నృత్య ప్రదర్శనలు, పాటల కార్యక్రమాలు అతిథులను అలరించాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని