ఘంటసాలకు భారతరత్న కార్యక్రమం.. అద్వితీయంగా 200 టీవీ ఎపిసోడ్స్ పూర్తి

ఘంటసాల వెంకటేశ్వరరావు శత జయంతి వేడుకల సందర్భంగా ఆయనకు భారతరత్న పురస్కారం ఇవ్వడం సముచితం అనే నినాదంతో నిర్వహిస్తున్న ప్రత్యేక కార్యక్రమాలు 200 ఎపిసోడ్స్‌ పూర్తి చేసుకున్నాయి.

Updated : 13 Jan 2023 15:26 IST

అమరగాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు శత జయంతి వేడుకల సందర్భంగా ఆయనకు భారతరత్న పురస్కారం ఇవ్వడం సముచితం అనే నినాదంతో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో యూఎస్‌ఏ నుంచి శంకర నేత్రాలయ అధ్యక్షుడు బాలరెడ్డి ఇందుర్తి ఆధ్వర్యంలో ఇప్పటివరకు 200 టీవీ కార్యక్రమాలను నిర్వహించారు.

తాజాగా జనవరి 8న అంతర్జాలం వేదికగా నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర పర్యాటకశాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి  పాల్గొని ఘంటసాలకు ఘన నివాళి అర్పించారు. సుమధుర గానంతో ఘంటసాల కోట్లాది ప్రజల హృదయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారని అన్నారు. ఆయన ఆలపించిన భక్తి గీతాలు, భగవద్గీత వేటికవే ప్రత్యేకమన్నారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ పేరుతో ఉత్సవాలను నిర్వహిస్తున్నామని, అలాగే, ఘంటసాల శతజయంతి ఉత్సవాలను అనేక ప్రాంతాల్లో కూడా జరపాలని నిర్ణయించామన్నారు. వచ్చే ఏడాది పాటు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో, దేశ రాజధానిలో కేంద్ర ప్రభుత్వం తరఫున వీటిని నిర్వహిస్తామన్నారు. ప్రతి ఒక్కరూ ఈ ఉత్సవాల్లో భాగం కావాలని పిలుపునిచ్చారు.

రక్షణశాఖ మంత్రికి శాస్త్రీయ సలహాదారు డాక్టర్ జి.సతీష్ రెడ్డి మాట్లాడుతూ ‘ఘంటసాల అంటే తెలియని తెలుగు వారు ఉండరు. ఆయన బాల్యం నుంచే ఎన్నో కష్టాలకు ఓర్చి, విజయనగం వెళ్లి సంగీతం నేర్చుకున్నారు. వారికి సంగీతం నేర్పించిన గురువు సీతారామశాస్త్రిని జీవితాంతం స్మరించుకున్నారు. పదివేలకు పైగా పాటలు పాడారు. తిరుమల తిరుపతి దేవస్థానం గర్భగుడిలో పాటలు పాడిన ఏకైక గాయకుడు ఘంటసాల’ అని కొనియాడారు.

శారద ఆకునూరి వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో 10 సార్లు నోబెల్ బహుమతికి నామినేట్ అయిన వ్యాపారవేత్త డాక్టర్ ఎంఎస్‌ రెడ్డి (జున్ను రాజు), సినీ దర్శకుడు ఎ. కోదండరామి రెడ్డి, నటుడు, నిర్మాత ఎం. మురళీ మోహన్, ఘంటసాల కృష్ణకుమారి, నాటా మాజీ అధ్యక్షుడు డాక్టర్ రాఘవరెడ్డి గోసాల, TTA మాజీ అధ్యక్షుడు భరత్ మాదాడి, శంకర నేత్రాలయ ట్రస్టీ భాస్కర్ గంటి, శ్రీ సాంస్కృతిక కళాసారథి వ్యవస్థాపక అధ్యక్షుడు రత్నకుమార్ కవుటూరు, NRIVA ఛైర్మన్, డాక్టర్ జయసింహ సుంకు, శంకర నేత్రాలయ ట్రస్టీ శ్యామ్ అప్పాలి తదితరులు పాల్గొన్నారు. ఘంటసాలకు భారతరత్న గౌరవం దక్కాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమం 33 దేశాలకు చేరుకోవడానికి సహాయ సహకారాలు అందించిన ఆదిశేషు కోట, శ్రీలత మగతల, రత్నకుమార్ కవుటూరులకు నిర్వాహకులు బాలారెడ్డి ఇందూర్తి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే 200 TV కార్యక్రమాలకు సాంకేతిక సహాయాన్ని అందజేసిన శ్యాం అప్పాలి, ప్రమీల గోపు, హరీష్ కోలపల్లికు తన ధన్యవాదాలు తెలియజేశారు. వ్యాఖ్యాతలుగా వ్యవహరించిన శారద ఆకునూరి, రత్నకుమార్ కవుటూరు,  శ్యామ్ అప్పాలి, విజు చిలువేరు, నీలిమ గడ్డమనుగు, Dr.రెడ్డి  ఉరిమింది, జయ పీసపాటి, రామ్ దుర్వాసుల, ఫణి డొక్క, శ్రీలత మగతలకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.

ఘంటసాలకు భారతరత్న ఇవ్వాలని మొదలుపెట్టిన సంతకాల సేకరణలో భాగంగా వివరాలు ఇచ్చేందుకు https://www.change.org/BharatRatnaForGhantasalaGaru సందర్శించవచ్చు. ఈ కార్యక్రమానికి సహాయం చేయాలనుకుంటే ghantasala100th@gmail.comకి వివరాలు పంపవచ్చని నిర్వాహకులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని