
ఆసియన్లపై దాడులు చేస్తే సహించబోం: బైడెన్
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో ఆసియన్ అమెరికన్లు లక్ష్యంగా కొనసాగతున్న దాడులపై ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ మరోసారి తీవ్రంగా స్పందించారు. ఆసియన్ అమెరికన్లపై మితిమీరుతున్న హింసకు ప్రతిగా అదనపు చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ఈ మేరకు ఆయన మంగళవారం ట్విటర్లో వెల్లడించారు.
‘ఆసియన్ అమెరికన్లపై దాడులు పెరిగిపోతుంటే మేం చూస్తూ మౌనంగా ఉండబోం. ఈ హింసాత్మక విధానాలకు ప్రతిగా అదనపు చర్యలు తీసుకుంటాం. ఆసియన్లకు వ్యతిరేకంగా జరిగే నేరాల కోసం న్యాయశాఖలో విభాగాన్ని ఏర్పాటు చేస్తాం. ఈ తరహా దాడులు చేయడం చాలా తప్పు. వీటికి తప్పక స్వస్తి పలకాలి’ అని బైడెన్ విజ్ఞప్తి చేశారు. ‘మనలో ఎవరికైనా హాని జరుగుతుందంటే.. అది మనందరికీ జరిగినట్లే’ అని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ట్విటర్లో పేర్కొన్నారు. ‘ఈ తరహా హింస విషయంలో నేను గానీ, అధ్యక్షుడు బైడెన్ గానీ మౌనంగా ఉండబోం. సమస్యను పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటున్నాం’ అని తెలిపారు.
న్యూయార్క్లో తాజాగా సోమవారం ఆసియాకు చెందిన మరో వృద్ధురాలిపై దుండగుడు దాడికి తెగబడిన విషయం తెలిసిందే. మాన్హాటన్ ప్రాంతంలో అందరూ చూస్తుండగానే ఓ దుండగుడు వృద్దురాలిపై పిడిగుద్దులతో విరుచుకుపడ్డాడు. ఆమెపై దాడి చేయడమే కాకుండా ఆసియాకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. తీవ్రంగా గాయపడిన బాధితురాలిని ఆస్పత్రిలో చేర్చినట్లు పోలీసులు తెలిపారు.