Donald Trump: డొనాల్డ్‌ ట్రంప్‌ స్వగృహంలో ఘనంగా దీపావళి వేడుకలు

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ నివాసంలో దీపావళి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఫ్లోరిడాలోని ట్రంప్‌ స్వగృహం ‘మార్‌ ఎ లాగో’లో నిర్వహించిన ఈ వేడుకల్లో పలు భారతీయ సంఘాల ప్రతినిధులు, రిపబ్లికన్‌ హిందూ సమాఖ్య ప్రతినిధులు పాల్గొన్నారు.

Updated : 24 Oct 2022 14:47 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ నివాసంలో దీపావళి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఫ్లోరిడాలోని ట్రంప్‌ స్వగృహం ‘మార్‌ ఎ లాగో’లో నిర్వహించిన ఈ వేడుకల్లో పలు భారతీయ సంఘాల ప్రతినిధులు, రిపబ్లికన్‌ హిందూ సమాఖ్య ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ట్రంప్‌ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రతినిధులకు ఆయన దీపావళి శుభాకాంక్షలు చెప్పారు. వేడుకలను దిగ్విజయంగా నిర్వహించిన రిపబ్లికన్‌ హిందూ సమాఖ్య వ్యవస్థాపకుడు షల్లీ కుమార్‌, తానా మాజీ అధ్యక్షుడు సతీష్‌ వేమన, విక్రమ్‌కుమార్‌, హరిభాయ్‌ పటేల్‌లను ట్రంప్‌ ప్రత్యేకంగా అభినందించారు.

అనంతరం ట్రంప్‌ మాట్లాడుతూ అనాదిగా చెడుపై మంచి ఎప్పుడూ విజయం సాధిస్తోందని.. సమస్త మానవాళి శాంతి, సౌభ్రాతృత్వంతో మెలగాలని ఆకాంక్షించారు. భారత్‌, అమెరికా దౌత్య సంబంధాలు.. పరస్పర సహాయ సహకారాలు ఉన్నతంగా కొనసాగాలన్నారు. 2016 అమెరికా ఎన్నికల్లో తన వెన్నంటే ఉంటూ బలపరిచిన రిపబ్లికన్‌ హిందూ సమాఖ్య నాయకత్వాన్ని, సభ్యులను ఆయన అభినందించారు. రానున్న కాలంలో ఈ సహకారం ఇలాగే అందించాలని ట్రంప్‌ కోరారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చాక హిందూ సమాఖ్య సభ్యులను తన ప్రభుత్వ కార్యనిర్వహణలో భాగస్వాములను చేస్తామని చెప్పారు. షల్లీ కుమార్‌ను తమ ప్రభుత్వం తరఫున భారత రాయబారిగా నియమిస్తామన్నారు. 

భారత్‌ ఎదుర్కొంటున్న పలు సమస్యలపై సానుకూల దృక్పథాన్ని అవలంబిస్తామని.. సంయుక్తంగా ఉగ్రమూలాలను ఏరివేస్తామని ట్రంప్‌ చెప్పారు. భారతీయులు శాంతికాముకులని ట్రంప్‌ కొనియాడారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా కష్టపడుతూ సానుకూల దృక్పథంతో సాగే స్వభావమే వారికి ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టిందన్నారు. విభిన్న వ్యక్తులు, భాషలు, ప్రాంతాలు, దేశాల సమాహారమే అమెరికా అని.. ప్రతిభకు పట్టం కట్టే విధానంతో అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. భారతీయులు, హిందువుల సంస్కృతీ సంప్రదాయాల పట్ల తనకు గౌరవముందన్నారు. భారతీయుల అపార ప్రతిభా పాటవాలు పరస్పరం ఇరు దేశాల అభివృద్ధికి తోడ్పడాలని అభిలషించారు. 

ఈ వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన భారతీయ సంప్రదాయ విందు పలువురిని ఆకర్షించింది. పూర్తి సంప్రదాయబద్ధంగా అన్ని రాష్ట్రాల వంటల రుచులను అతిథులకు ప్రత్యేకంగా అందజేశారు. ఒక్కో అతిథి విందుకు నిర్వాహకులు సుమారు రూ.85వేలు ఖర్చు చేశారు. దేశం కాని దేశంలో మూలాలను కాపాడుకుంటూ.. తమ వారికి ఏ ఆపద వచ్చినా సంయుక్తంగా అండగా నిలవడంతో పాటు ప్రవాస సంఘాల సారథులను సమన్వయం చేస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన రిపబ్లిక్‌ హిందూ సమాఖ్య వ్యవస్థాపకుడు షల్లీకుమార్‌తో పాటు కార్యవర్గ సభ్యులను తానా మాజీ అధ్యక్షుడు సతీష్‌ వేమన ప్రత్యేకంగా అభినందించి ధన్యవాదాలు తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని