ఎన్నారైలే తెదేపాకు కీలకం కావాలి: మాజీ మంత్రి గొల్లపల్లి

ఏపీలో వచ్చే ఎన్నికల్లో ప్రవాసీ ఓటర్లే కీలకం కావాలని తెదేపా సీనియర్‌ నేత, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు అన్నారు.

Published : 16 Oct 2022 19:44 IST

దుబాయి: ఏపీలో వచ్చే ఎన్నికల్లో ప్రవాసీ ఓటర్లే కీలకం కావాలని తెదేపా సీనియర్‌ నేత, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు అన్నారు. వేలాది మంది తెదేపా అభిమానులు గల్ఫ్‌లో ఉంటున్నారని. అభిమానాన్ని ఓట్ల రూపంలో మలచుకోవడాన్ని సులభతరం చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. యూఏఈ తెలుగుదేశం పార్టీ ఆహ్వానం మేరకు దుబాయి విచ్చేసిన ఆయన పార్టీ బలోపేతానికి చేయాల్సిన కృషిపై మాట్లాడారు. ప్రతి ఎన్నారై తమ ప్రాంతంలో తెదేపా  బలోపేతానికి పనిచేయాలన్నారు. జగన్‌ విధ్వంసక పాలనకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. కనీస సౌకర్యాల్లేని రాష్ట్రం ఏదైనా ఉందా అంటే అది ఆంధ్రప్రదేశేనని ప్రపంచంలో అందరికీ తెలుసన్నారు. ఏపీని అభివృద్ధి పథంలో నడిపించాలంటే మళ్లీ చంద్రబాబు సీఎం కావాలని, అందుకోసం ప్రతి ప్రవాసీయుడూ శ్రమించాల్సిన అవసరం ఉందన్నారు. జగన్‌కు ఏదీ కట్టడం చేతకాదని.. కూల్చడం ఒక్కటే తెలుసని విమర్శించారు. తన స్వార్థ రాజకీయాల కోసం కూల్చడం సీఎం చేతగానితనానికి నిదర్శనమన్నారు. ఎన్టీఆర్‌ ప్రపంచంలో ప్రతి తెలుగువాడూ గర్వించదగిన మహానీయుడని.. పేదల సంక్షేమం కోసం ఆలోచించి ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రారంభించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాష్ట్రంలోని వైకాపా హయాంలో  సంక్షేమం లేదు.. అభివృద్ధి లేదు.. రోడ్లు లేవు.. జీతాల్లేవు, ఉద్యోగాల్లేవ్‌.. ఇళ్లు లేవు.. పాలన లేదు.. ఇంత దారుణమైన పాలన ఇదివరకు ఎన్నడూ చూడలేదంటూ ధ్వజమెత్తారు.

ఎన్టీఆర్‌ పేరు తొలగింపును ముక్తకంఠంతో ఖండించాలి

అనంతరం గల్ఫ్‌ తెదేపా అధ్యక్షుడు రావి రాధాకృష్ణ మాట్లాడుతూ.. ఆరోగ్యమే మహాభాగ్యమన్న దాన్ని కార్యచరణలో అమలు చేసి చూపిన ఏకైక తెలుగు నేత ఎన్టీఆర్‌ అని కొనియాడారు. ప్రజల ఆరోగ్యంతోనే అసలైన సంక్షేమం అమలవుతుందని విశ్వసించిన కొద్దిమంది భారతీయ నేతల్లో ఆయనొకరన్నారు. మారుమూల మండల కేంద్రాల్లో పీహెచ్‌సీలను నెలకొల్పాలని 1985లో తెదేపా సర్కార్‌ నిర్ణయించినప్పుడో అదో సంచలనమన్నారు. మండల కేంద్రాల నుంచి మొదలుకొని హైదరాబాద్‌లో స్పెషాలిటీ ఆస్పత్రుల దాక ప్రతిచోట ఎన్టీఆర్‌ ప్రత్యేక శ్రద్ధ కనబరిచారన్నారు. ఆరోగ్య రంగంలో ఆయన ఎన్నారైల సేవలు, సూచనలు కూడా తీసుకున్నారని తెలిపారు. ఎన్టీఆర్‌ విజ్ఞప్తిని మన్నించి ఎంతోమంది ఎన్నారైలు మాతృదేశానికి వచ్చి సేవలందించారని.. అలా వచ్చిన వారిలో చెప్పుకోదగ్గ వ్యక్తి డాక్టర్ కాకర్ల సుబ్బారావు అని గుర్తు చేశారు.  డాక్టర్‌ కాకర్ల సుబ్బారావుతో ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఒక స్పెషాల్టీ ఆసుపత్రిగా నిమ్స్‌ని తీర్చిదిద్ది నేటి కార్పోరేట్ ఆసుపత్రుల కన్నా మెరుగ్గా తీర్చిదిద్దిన ఘనత ఆయనకే దక్కుతుందని కొనియాడారు. ఎన్నారైల సూచన మేరకు మామూలు వైద్య సేవలతో పాటు వైద్య విద్యా బోధనా వసతులు సైతం మెరుగుపరిచారని.. అందులో భాగంగా ఆరోగ్య విశ్వవిద్యాలయాన్నీ నెలకొల్పారని తెలిపారు. ప్రభుత్వ రంగంలోని నిమ్స్‌లాంటి ఆస్పత్రిని పేదలకు అందుబాటులోకి తీసుకొచ్చిన ఎన్టీఆర్‌ పేరు ఆరోగ్య వర్సిటీకి ఉండాలా? లేదంటే ఆరోగ్యశ్రీ పేరిట ప్రభుత్వ ఆస్పత్రులను వ్యూహాత్మకంగా నాశనం చేసి ప్రైవేటు ఆస్పత్రులకు లాభాలను ప్రోత్సహించిన వైఎస్సార్‌ పేరు ఉండాలో ఆలోచించుకోవాలన్నారు. ఇటీవల ఆరోగ్య వర్సిటీకి ఎన్టీఆర్‌ పేరు తొలగించడం బాధాకరమని.. దీన్ని అంతా ముక్తకంఠంతో ఖండించాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూఏఈ తెదేపా నేతలు విశ్వేశ్వరరావు , ఖాదర్ బాషా, వాసు రెడ్డి , నిరంజన్ రవికిరణ్ , హరి , జాఫర్ అలీ, దుర్గా ప్రసాద్, బాబ్జీ, శ్రీనివాస్ , షబ్బీర్ బాషా తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని