Updated : 22 Feb 2021 09:41 IST

అర్థంకాని భాషలో చెప్పడం వ్యర్థం

పాలన, ప్రాథమిక బోధనంతా మాతృభాషలోనే సాగాలి
తానా ప్రపంచ సాహిత్య సమావేశంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

ఈనాడు డిజిటల్‌- అమరావతి: పాఠశాలల్లో ప్రాథమిక విద్యాభ్యాసం తెలుగులోనే కొనసాగాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. ఏ రాష్ట్రమైనా స్థానిక భాషలోనే ప్రాథమిక విద్య ఉండాలన్నారు. పరిపాలనంతా మాతృభాషలో జరగాలని, తెలుగువారిని ఆంగ్లంలో పాలించడమేమిటని ప్రశ్నించారు. ప్రజలకు అర్థంకాని భాషలో చెబితే వ్యర్థమేనని పేర్కొన్నారు. న్యాయస్థానాల తీర్పులు సామాన్యులకు తెలియకపోతే ఎలా? అని ప్రశ్నించారు. 30 ఏళ్ల తర్వాత తెలుగు భాష పరిస్థితి ఊహించడానికే కష్టంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర మాధ్యమాల్లో చదివే విద్యార్థులు మాతృభాషను మరిచిపోతే పరిస్థితేమిటో అందరూ అర్థం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వాల నుంచి తగిన ప్రోత్సాహం లేకపోవడం, ఇతర భాషలపై వ్యామోహం వల్ల మాతృభాష బలహీనపడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం ‘అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం’ సందర్భంగా తానా ప్రపంచ సాహిత్య వేదిక ‘తల్లి భాష- తెలుగు మన శ్వాస’ కార్యక్రమాన్ని ఆన్‌లైన్‌ వేదికగా నిర్వహించింది. ముఖ్యఅతిథిగా వెంకయ్యనాయుడు పాల్గొని మాట్లాడారు.
మాతృభాషను విస్మరించడం పొరపాటు
‘శాస్త్ర, సాంకేతిక రంగాలు అభివృద్ధి చెందే క్రమంలో తెలియకుండానే మాతృభాషను విస్మరించడం మన పొరపాటు. భాషా రక్షణకు ప్రభుత్వాల కృషి మాత్రమే సరిపోదు. తెలుగు సాహిత్యాన్ని ఆయా దేశాల భాషల్లోకి ప్రవాసులు కూడా అనువదించాలి. స్పానిష్‌ భాషలో గాబ్రియేల్‌ గార్షియా మార్క్‌వేజ్‌ రాసిన ‘100 ఇయర్స్‌ ఆఫ్‌ సాలిట్యూడ్‌’ పుస్తకం ఆంగ్లంలోకి అనువదించాకే దాని గొప్పదనం తెలిసింది. రవీంద్రుడి ‘గీతాంజలి’ కూడా ఆంగ్లంలోకి అనువదించాకే ప్రపంచం గుర్తించింది. ఇతర భాషల సాహిత్యం తెలుగులోకి అనువాదమైనట్లు మన సాహితీ సంపద తర్జుమా కావడం లేదు. ఈ విషయంలో ప్రభుత్వాలతోపాటు మనం చొరవ చూపాలి’ అని వెంకయ్యనాయుడు సూచించారు.
భాష, యాసను పరిరక్షించుకోవాలి
‘తెలుగు గొప్పదనాన్ని మనం ఇతరులకు చెప్పకపోతే భాష దెబ్బతింటుంది. తెలుగు రాష్ట్రాల ప్రజలు మన భాష, యాస, కట్టు, బొట్టును పరిరక్షించుకోవాలి. తెలుగులో మాట్లాడడం గొప్పదనంగా భావించాలి. ఈ తరం పిల్లలు గ్రంథాల్లోని మాధుర్యాన్ని తెలుసుకోవాలంటే కఠినమైన భాష అడ్డంకిగా మారే అవకాశముంది. భాషను సాంకేతికతతో అనుసంధానించాలి.  కంప్యూటర్‌లో భాష వినియోగంలో ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి మరిన్ని ఆవిష్కరణలు జరిగేందుకు తెలుగు సమాజం ఒకటిగా నిలవాలి’ అని వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. సమావేశంలో తానా ప్రపంచ సాహిత్య వేదిక సమన్వయకర్త చిగురుమళ్ల శ్రీనివాస్‌, రంగస్థల నటుడు గుమ్మడి గోపాలకృష్ణ, చరిత్ర పరిశోధకుడు ఈమని శివనాగిరెడ్డి, వివిధ దేశాల సాహితీవేత్తలు, భాషాభిమానులు పాల్గొని మాట్లాడారు. అమెరికాలో ప్రవాసాంధ్ర పిల్లలకు పాఠశాల కార్యక్రమం ద్వారా 2వేల మందికి తెలుగు భాష నేర్పుతున్నామని తానా అధ్యక్షుడు జయశేఖర్‌ తాళ్లూరి తెలిపారు. 6లక్షల మంది తెలుగు విద్యార్థులకు శతక పద్యాలు నేర్పించేందుకు అమ్మానాన్న కార్యక్రమం నిర్వహించామన్నారు. తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకుడు ప్రసాద్‌ తోటకూర, సాహితీవేత్త అద్దంకి శ్రీనివాస్‌ మాట్లాడారు.

ఏ స్థాయికి ఎదిగినా మాతృభాష మరవొద్దు
అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌ ముచ్చింతల్‌ సమీపంలోని స్వర్ణ భారత్‌ ట్రస్ట్‌ ప్రాంగణంలో ఆదివారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఇందులో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ ఏ దేశమేగినా.. ఏ స్థాయికి ఎదిగినా మాతృ భాషను మరవొద్దని ఉద్బోధించారు.

22 భాషల్లో ట్వీట్లు..
24 పత్రికల్లో ప్రత్యేక వ్యాసాలు

ఈనాడు-దిల్లీ: అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రత్యేకంగా జరుపుకొన్నారు. తల్లి భాష ప్రాధాన్యాన్ని చాటిచెబుతూ ఆదివారం 22 భాషల్లో ప్రత్యేకంగా ట్వీట్‌ చేశారు. ఆయన రాసిన వ్యాసాలు తెలుగులో ‘ఈనాడు’తో సహా 24 వివిధ భాషా పత్రికల్లో ప్రచురితమయ్యాయి. ఒక వ్యక్తి రాసిన వ్యాసాలు ఇన్ని భాషల్లో ఒకే రోజు ప్రచురితమవడం ఇదే మొదటిసారి. తొలి నుంచి మాతృభాషల ప్రాధాన్యాన్ని చాటుతూ వస్తున్న వెంకయ్యనాయుడు అదే అంశాన్ని తన వ్యాసాలు, ట్వీట్లలో పునరుద్ఘాటించారు.

Read latest Nri News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని