Telugu in US: అమెరికాలో అతి వేగంగా అభివృద్ధి చెందే భాషగా తెలుగు

అమెరికాలో అధిక సంఖ్యలో మాట్లాడే తొలి 20 భాషల్లో తెలుగుకు చోటు దక్కడమే కాకుండా.. అతివేగంగా అభివృద్ధి చెందుతున్న భాషగా రూపుదిద్దుకోవడం సంతోషకరమని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌ పేర్కొన్నారు.

Updated : 12 Jul 2022 08:45 IST

మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌
ఘనంగా సిలికానాంధ్ర మనబడి స్నాతకోత్సవం

ఈనాడు, అమరావతి: అమెరికాలో అధిక సంఖ్యలో మాట్లాడే తొలి 20 భాషల్లో తెలుగుకు చోటు దక్కడమే కాకుండా.. అతివేగంగా అభివృద్ధి చెందుతున్న భాషగా రూపుదిద్దుకోవడం సంతోషకరమని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌ పేర్కొన్నారు. తెలుగు భాషాభివృద్ధికి సిలికానాంధ్ర మనబడి చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. పదిహేనేళ్లలో 75వేల మందికి తెలుగు నేర్పడం అద్భుతమని కొనియాడారు. ఉత్తర కాలిఫోర్నియాలోని మిల్‌పిటాస్‌లో సిలికానాంధ్ర విశ్వవిద్యాలయ ప్రాంగణంలోని డాక్టరు లక్కిరెడ్డి హనిమిరెడ్డి భవనంలో ఆదివారం స్నాతకోత్సవ సభ నిర్వహించారు. 2021-22 విద్యా సంవత్సరానికి 1,689 మంది జూనియర్‌ సర్టిఫికెట్‌ పరీక్షకు హాజరవ్వగా 97.8% మంది, 1,102 మంది సీనియర్‌ సర్టిఫికెట్‌ పరీక్షకు హాజరవ్వగా 97.7% మంది ఉత్తీర్ణత సాధించారని సిలికానాంధ్ర, మనబడి అధినేత చమర్తి రాజు తెలిపారు. తెలుగు విశ్వవిద్యాలయ భాగస్వామ్యంతో ఎనిమిదేళ్లుగా ఈ సర్టిఫికెట్‌ పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. 15 ఏళ్లుగా పిల్లలకు తెలుగు భాషను నేర్పిస్తున్న విద్యాసంస్థ సిలికానాంధ్ర, మనబడి మాత్రమే అని వివరించారు. ఈ విజయం వెనుక 2,500 మంది భాషా సైనికుల స్వచ్ఛంద సేవ ఉందని, అమెరికాలోని పిల్లలకు తెలుగు సంస్కృతి, సంప్రదాయాలతో పాటు భాషనూ నేర్పిస్తున్నామని సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు కూచిబొట్ల ఆనంద్‌ పేర్కొన్నారు. గుమ్మడి గోపాలకృష్ణ దర్శకత్వంలో మనబడి విద్యార్థుల శ్రీకృష్ణ రాయబారం పద్యనాటకం ఆకట్టుకుంది. సమన్వయకర్తలుగా గంటి శ్రీదేవి, రాధాశాస్త్రి వ్యవహరించగా.. కొండిపర్తి దిలీప్‌, కూచిబొట్ల శాంతి, కందుల సాయి, సంగరాజు దిలీప్‌, కోట్ని శ్రీరాం, తనారి గిరి, కస్తూరి ఫణిమాదవ్‌ సహకారం అందించారు. 2022-23 మనబడి విద్యాసంవత్సరం సెప్టెంబరు 10 నుంచి మొదలవుతుందని సంస్థ అధినేత చమర్తి రాజు తెలిపారు. https://manabadi.siliconandhra.org/ వెబ్‌సైట్‌లో తమ పిల్లల పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని