ఐర్లాండ్‌లో అంబరాన్నింటిన బతుకమ్మ సంబురాలు

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకలను ఐర్లాండ్‌లో Telanganites Of Ireland ఆధ్వర్యంలో......

Published : 27 Sep 2022 16:46 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకలను ఐర్లాండ్‌లో Telanganites Of Ireland ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. ‘బతుకమ్మ’ వేడుకలు ప్రారంభించి పదేళ్లు అయిన సందర్భంగా డబ్లిన్‌లో తెలంగాణ ఎన్నారైలు 40 మంది వాలంటీర్స్‌తో కలిసి ఈ పండుగను ఘనంగా జరుపుకొన్నారు. ఈ వేడుకలకు ప్రాంతాలకు అతీతంగా దాదాపు 600 మంది తరలివచ్చారు. మహిళలు సంప్రదాయ వస్త్రధారణతో బతుకమ్మలు, దాండియా ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా ఆడటం అందరినీ ఆకట్టుకుంది. పిల్లలకు బతుకమ్మ పండుగ గురించి వివరించారు. దుర్గా మాత పూజతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు.

తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలు ఇక్కడి పిల్లలకు తెలియజేయాలనే సంకల్పంతో Telanganites Of Ireland వారు ఏటా బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తున్నారు. చిన్నారులకు ఫేస్‌ పెయింటింగ్‌, మ్యాజిక్‌ షోలు విశేషంగా ఆకట్టుకున్నాయి. బతుకమ్మను పేర్చి తీసుకువచ్చిన  ఆడపడుచులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ వేడుకలకు హాజరైన అతిథులకు ప్రసాదంతో పాటు సాయంత్రం తేనీరు, స్నాక్స్, రాత్రి రుచికరమైన వంటకాలు వడ్డించారు. పదేళ్లుగా బతుకమ్మ వేడుకలను వాలంటీర్లు, దాతల సహకారంతో ఉచితంగా నిర్వహిస్తున్నారు. సుమారు ముప్పై మంది వాలంటీర్లు, నలభై మంది దాతలు ముందుకొచ్చి ఈ వేడుకలు నిర్వహించేందుకు సహాయ సహకారాలు అందిస్తుండటం విశేషం. వారందరికీ నిర్వాహకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని