దిగ్విజయంగా 8వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు

8వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు ఘనంగా ముగిసింది.

Published : 05 Oct 2022 21:22 IST

సింగపూర్‌: 8వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు ఘనంగా ముగిసింది. వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, న్యూజిలాండ్ తెలుగు సంఘం, తెలుగు మల్లి ఆస్ట్రేలియా, శ్రీ సాంస్కృతిక కళాసారథి సింగపూర్, మలేషియా తెలుగు సంఘం, వంశీ ఆర్ట్ థియేటర్స్ భారతదేశం, వీధి అరుగు నార్వే, దక్షిణాఫ్రికా తెలుగు సాహిత్య వేదిక, తెలుగు తల్లి కెనడా, సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో, ప్రతిష్టాత్మకంగా దీనిని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీ నటులు, రచయిత తనికెళ్ల భరణి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పారిస్ నుంచి డా.డేనియల్ నేజర్స్ సదస్సు సమాపన సమావేశంలో పాల్గొని స్వచ్ఛమైన తెలుగులో ప్రసంగించారు.

సింగపూర్ నుంచి కవుటూరు రత్నకుమార్, రాధాకృష్ణ గణేశ్న ప్రధాన సాంకేతిక నిర్వాహకులుగా ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారం చేసిన ఈ సదస్సులో సుమారు 75 మంది భారతదేశ వక్తలు తమ వైవిధ్యభరితమైన సాహిత్య ప్రసంగాలను అందించారు. రాధిక మంగిపూడి (ముంబయి), సుబ్బు పాలకుర్తి (సింగపూర్), గౌతమ్ లింగా (జొహానెస్ బర్గ్), జయ పీసపాటి (హాంగ్ కాంగ్), రాధిక నోరి (అమెరికా), శ్రీసుధ (ఖతార్) ఈ సదస్సులోని ఆరు వేదికలను సమర్థంగా నిర్వహించారు. డా.ఎస్.ఆర్.ఎస్ కొల్లూరి(అమలాపురం) నిర్వహణలో ఒక ప్రత్యేక కవి సమ్మేళన వేదిక, కథా పఠనాలు, శారద కాశీవజ్ఝల (అమెరికా) నిర్వహణలో సాహిత్యం క్విజ్ మొదలైన ఆసక్తికరమైన అంశాలతో ఈ సదస్సు అందరినీ ఆకట్టుకుంది. ‘వసంతవల్లరి’ అయ్యగారి వసంతలక్ష్మి గళంలో “వంగూరి చిట్టెన్ రాజు చెప్పిన అమెరికా కామెడీ కథలు” ఆడియో పుస్తకాన్ని తనికెళ్ళ భరణి ఆవిష్కరించగా, “డయాస్పోరా తెలుగు కథ, సాహిత్యం అంటే ఏమిటి?” అనే వ్యాస సంకలనాన్ని సంపాదకులు వంగూరి చిట్టెన్ రాజు పరిచయం చేశారు. వంశీ రామరాజు, రామ చంద్రమౌళి, గంటి భానుమతి, చిత్తర్వులతో పాటు, సిలిలిక, అనఘ దత్త మొదలయిన చిన్నారుల ప్రసంగాలతో సదస్సు ఆసాంతం ఆసక్తికరంగా సాగింది.

వచ్చే ఏడాది జూన్ 22, 23, 24 తేదీలలో పారిస్ మహా నగరంలో INALCO University ఆధ్వర్యంలో తెలుగు భాష, సాహిత్యం, కళా రూపాలు, జానపదాలని ఫ్రాన్స్ దేశవాసులకి పరిచయం చేయడానికి ఒక సమగ్రమైన కార్యక్రమానికి రూప కల్పన జరుగుతోందని ప్రొఫెసర్ డేనియల్ నెజెర్స్ (యూనివర్శిటీ ఆఫ్ పారిస్), వంగూరి చిట్టెన్ రాజు తమ సంయుక్త ప్రకటనలో తెలియ జేశారు.  ఇందుకు వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, తదితరుల సహకారం ఉంటుందని తెలిపారు.

8వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు కార్యనిర్వాహక వర్గం సభ్యులు..

వంగూరి చిట్టెన్ రాజు (హ్యూస్టన్, టెక్సాస్), శ్రీలత మగతల (న్యూజిలాండ్), శాయి రాచకొండ (హ్యూస్టన్, టెక్సాస్), రావు కొంచాడ (ఆస్ట్రేలియా), రత్నకుమార్ కవుటూరు (సింగపూర్), డా. వెంకట ప్రతాప్ (మలేషియా), రాపోలు సీతారామరాజు (జోహానెస్ బర్గ్), రాధిక మంగిపూడి (భారత దేశం, సింగపూర్): వంశీ రామరాజు (భారత దేశం), వెంకట్ తరిగోపుల (ఆస్లో, నార్వే), లక్ష్మి రాయవరపు:(టొరంటో, కెనడా), రాధాకృష్ణ గణేశ్న (సింగపూర్) మధు చెరుకూరి (ఆర్లాండో, ఫ్లోరిడా) కార్యక్రమ నిర్వహణలో పాలుపంచుకున్నారు.

Read latest Nri News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని