న్యూయార్క్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో అమెరికాలోని న్యూయార్క్‌లో బంగారు బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి.

Updated : 11 Oct 2022 23:27 IST

ఈనాడు, అమరావతి: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో అమెరికాలోని న్యూయార్క్‌లో బంగారు బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆ నగరంలోని టైమ్స్‌ స్క్వేర్‌లో ఈ నెల 8వ తేదీ మధ్యాహ్నం 3.30 గంటల నుంచి రాత్రి వరకూ ఈ ఉత్సవాలు నిర్వహించారు. వివిధ రకాల పుష్పాలతో 20 అడుగుల ఎత్తున బంగారు బతుకమ్మను సర్వాంగ సుందరంగా అలంకరించారు. అమెరికాలోని వివిధ రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రజలు వేలమంది తరలివచ్చారు. నటి అనసూయ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. మంగ్లీ పాడిన పాటలు, రమేష్‌ మిమిక్రీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి, పూర్వ అధ్యక్షుడు జయ్‌ తాళ్లూరి, కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు నిరంజన్‌, తానా కల్చరల్ కో ఆర్డినేటర్ శిరీష తూనుగుంట్ల న్యూజెర్సీ బీఓడీ లక్ష్మీ దేవినేని, రీజిన‌ల్ రిప్రజెంటేటివ్‌(న్యూజెర్సీ) వంశీ వాసిరెడ్డి, దీపిక సమ్మెట తదితరుల ఆధ్వర్యంలో ఉత్సవాలు ఘనంగా జరిగాయి. 
 

ఈ వేడుకలలో పాల్గొన్న తానా సంస్థ అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి ప్రత్యేక ఉపన్యాసం చేశారు. ఈ పండగను విశ్వవేదిక మీద నిర్వహించుకోవడం గర్వంగా ఉందన్నారు. సమష్టి కృషితో ఘనమైన బతుకమ్మ పండుగను నిర్వహించి మన తెలుగుజాతి సంస్కృతిని ప్రపంచానికి తెలియజేశామన్నారు. ఈ వేడుకలో తెలుగువారందరిని సమన్వయపరిచి, ఇంత పెద్ద ఎత్తున ఉత్సవం నిర్వహించి విజయవంతం చేయటంలో కీలక పాత్ర వహించిన తానా కల్చరల్ కో ఆర్డినేటర్ శిరీష కృషిని ఆయన కొనియాడారు. ఈ భారీ కార్యక్రమానికి సహకరించిన మహిళలకు, కార్యక్రమ విజయవంతానికి కృషిచేసిన వాలంటీర్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తానా పూర్వ అధ్యక్షులు జయశేఖర్ మాట్లాడుతూ.. మన సంప్రదాయంలో దేవుళ్లని పూలతో పూజించే మనం, ఈ పండగకి మాత్రం పూలనే దేవుళ్లుగా చేసి పూజించటం ఒక విశిష్టత అని తెలిపారు. ప్రెసిడెంట్ ఎలెక్ట్ నిరంజన్ శృంగవరపు మాట్లాడుతూ తానా ఎల్లప్పుడూ వినూత్నమైన కార్యక్రమాలు చేస్తుందన్న మాటని రుజువు చేసుకుంటూ సంస్థ ప్రతిష్ఠని మరింత పెంచే విధంగా బంగారు బతుకమ్మ ఉత్సవం నిర్వహించుకోవడం గర్వంగా ఉందన్నారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన న్యూయార్క్ నగర మేయర్ ఎరిక్ ఆడమ్స్ కార్యక్రమాన్ని జ్యోతి వెలిగించి ప్రారంభించారు. కనులవిందుగా అలంకరించిన బతుకమ్మ టైమ్ స్క్వేర్‌కే ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందన్నారు. ఇంతటి మంచి కార్యక్రమాన్ని న్యూయార్క్ నగరంలో చేయడం ఎంతో సంతోషాన్నిచ్చిందన్నారు. ఈ సందర్భంగా తనకు భారత దేశ సంప్రదాయాలను, పండుగల గురించి  తెలుసుకునే అవకాశం కల్పించినందుకు తానా సంస్థకు అభినందనలు తెలిపారు. భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను విశ్వవ్యాప్తం చేయడంలో తానా సంస్థ చేస్తున్న కృషిని కొనియాడారు. బ్రూక్లీన్ బరో ప్రెసిడెంట్ ఆఫీసు ప్రతినిధి, దక్షిణ ఆసియా వ్యవహారాల డైరెక్టర్ దిలీప్ చౌహాన్ తానా సంస్థకు మేయర్ ద్వారా అభినందన పత్రాన్ని అందించారు. 

ఈ సందర్భంగా తెలుగుద‌నం ఉట్టి పడేలా సంప్రదాయమైన అలంక‌ర‌ణ‌ల‌తో తెలుగు ఆడపడుచులు ఉత్సాహభరితమైన బతుకమ్మ పాటలు, నృత్యాలతో సంద‌డి చేశారు. సంప్రదాయ నృత్యాలు, మహిషాసుర మర్దిని నృత్య రూపకం, చిన్నారుల జానపద నృత్యాలు ప్రత్యేకంగా అలరించాయి. 
 

ఈ కార్యక్రమాన్ని ఫౌండేష‌న్ ట్రస్టీ విశ్వనాథ్‌ నాయునిపాటి, ఫౌండేష‌న్ ట్రస్టీలు సుమంత్ రామిశెట్టి, విద్య గార‌పాటి, శ్రీనివాస్ ఓరుగంటి, రీజిన‌ల్ రిప్రజెంటేటివ్‌(న్యూజెర్సీ) వంశీ వాసిరెడ్డి, రీజిన‌ల్ రిప్రజెంటేటివ్‌(న్యూయార్క్) దిలీప్ ముసునూరు, రీజిన‌ల్ రిప్రజెంటేటివ్‌(న్యూ ఇంగ్లాండ్) ప్రదీప్ గ‌డ్డం, క‌మ్యూనిటీ స‌ర్వీస్ కోఆర్డినేట‌ర్ రాజా క‌సుకుర్తి, కిరణ్ పర్వతాల ఆధ్వర్యంలో విశ్వవేదికపై క‌ల‌కాలం గుర్తుండిపోయేలా తానా సంస్థ బ‌తుక‌మ్మ సంబరాల‌ను దిగ్విజ‌యంగా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి అమెరికాలోని వివిధ నగరాల నుంచి తానా సంస్థ నాయకులు భారీగా వచ్చారు. నిర్మాత విశ్వప్రసాద్‌తో పాటు ఫౌండేష‌న్ ఛైర్మన్‌ వెంక‌ట‌ర‌మ‌ణ యార్లగడ్డ, ఈవీపీ నిరంజన్ శృంగవరపు, వెంకట్ చింతలపల్లి, సునీల్ కోగంటి, రవి పొట్లూరి, రవి మందలపు, సంస్థ ట్రస్టీ సభ్యులు రవి సామినేని, పద్మజ బెవర, మాధురి ఏలూరి, రాంచౌదరి ఉప్పుటూరి, శ్రీ అట్లూరి, ధృవ నాగండ్ల పాల్గొన్నారు. 

ఈ కార్యక్రమానికి వచ్చిన వారందరికీ ‘బీంజ్ హోటల్‌’ (న్యూయార్క్) వారు ప్రత్యేకంగా తెలుగు వంటకాలతో కమ్మని విందు అందించారు. ఇంతటి భారీ కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించడానికి వారాల తరబడి కృషి చేసిన వారందరికీ తానా సంస్థ తరఫున తానా కల్చరల్ కో ఆర్డినేటర్ శిరీష తూనుగుంట్ల, న్యూజెర్సీ బీఓడీ లక్ష్మి దేవినేని అందరికీ ధన్యవాదాలు చెప్పారు. సహచర అమెరికా తెలుగు సంఘాలు టీఎల్‌సీఏ, టీటీఏ, ఎన్‌వైటీటీఏ సంస్థలకు, సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. 

 


 

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని