మహోన్నత సంస్కృతిని ఆచరణలో చూపాలి

మహోన్నత సంస్కృతికి వారసులమని చెప్పుకోవడం గొప్పకాదని, దాన్ని ఆచరణలో చూపినప్పుడే నిజమైన సార్థకత చేకూరుతుందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఆయన ఆదివారం సింగపూర్‌లోని శ్రీ సాంస్కృతిక కళాసారథి ద్వితీయ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు.

Published : 17 Oct 2022 15:24 IST

మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

ఈనాడు, దిల్లీ: మహోన్నత సంస్కృతికి వారసులమని చెప్పుకోవడం గొప్పకాదని, దాన్ని ఆచరణలో చూపినప్పుడే నిజమైన సార్థకత చేకూరుతుందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఆయన ఆదివారం సింగపూర్‌లోని శ్రీ సాంస్కృతిక కళాసారథి ద్వితీయ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ‘‘మన భాష సంస్కృతులను కాపాడుకొని ముందు తరాలకు అందించడమే మనం ఇచ్చే నిజమైన గౌరవం. ఉన్నతమైన సంస్కృతి ద్వారా ఉన్నత సమాజానికి బాటలుపడతాయి. పురోభివృద్ధిని కోరుకొనేవారు గత చరిత్రను మరువకూడదు. స్వధర్మం, సంస్కృతికి దూరం కాకూడదు. మన భాష, సంస్కృతులను పరిరక్షించుకొనేందుకు ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తున్న సంస్థలు ఒకే వేదికమీదికి రావాలి. నలుగురి ఆలోచనల సంగమం గొప్ప విజయాలను అందిస్తుంది. ఈ దిశగా శ్రీసాంస్కృతిక కళాసారథి లాంటి సంస్థలు చొరవ తీసుకోవాలి. యువతలో ఈ చొరవ మరింత పెరగాలి. స్త్రీలను గౌరవించటం మన సంస్కృతిలో భాగం. వైవిధ్యాన్ని ఆహ్వానించే భారతీయుల ఆలోచనా సరళి అందరికీ ఆదర్శం. మన ప్రార్థనల్లో ప్రతిచోటా శాంతికి ప్రాధాన్యం ఉంటుంది. బ్రిటిష్‌వారు ప్రవేశించిన కారణంగా మన ఘనమైన గతంలో కొంతభాగాన్ని భారతీయులు కోల్పోవాల్సి వచ్చింది. ఈ విషయాన్ని గుర్తించి మనదైన సంస్కృతిని పునరుజ్జీవింపజేసుకోవాలి. ఇందుకోసం ప్రపంచంలోని భారతీయులంతా ఏకంకావాలి’’ అని వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు.

శ్రీ సాంస్కృతిక కళాసారథి వ్యవస్థాపకులు కవుటూరు రత్నకుమార్ మాట్లాడుతూ ‘‘మా సంస్థ 2020లో ప్రారంభమై గత రెండు సంవత్సరాలుగా సుమారు 40 కి పైగా కార్యక్రమాలను ప్రపంచవ్యాప్తంగా అనేక తెలుగు సంస్థల సమన్వయంతో నిర్వహించింది. ద్వితీయ వార్షికోత్సవం వేడుకలను గౌరవనీయులు వెంకయ్య నాయుడు చేతుల మీదుగా జరుపుకోవాలని జూలై నుంచి ఎదురు చూస్తున్నాం. ఇన్నాళ్లకు మా కల నెరవేరింది’’ అని ఆనందం వ్యక్తం చేశారు.

సంస్థ ప్రధాన కార్యనిర్వాహకవర్గం రాధిక మంగిపూడి, రామాంజనేయులు చామిరాజు, భాస్కర్ ఊలపల్లి, శ్రీధర్ భరద్వాజ్, రాంబాబు పాతూరి, సుధాకర్ జొన్నాదుల కలసి వెంకయ్య నాయుడిని అభిమానపూర్వకంగా సత్కరించారు. సింగపూర్ తెలుగు ప్రజలను ఉద్దేశించి వెంకయ్య నాయుడు ఇచ్చిన ప్రసంగం చక్కటి ఛలోక్తులతో, మన భాష, సంప్రదాయ, సంస్కృతులను కాపాడుకునేందుకు పిలుపునిస్తూ, ఆలోచనాత్మకమైన సందేశంతో అందరిని అలరించింది. ఈ కార్యక్రమములో  సింగపూర్‌లో ప్రఖ్యాత తెలుగు సంస్థలు, ‘తెలంగాణ కల్చరల్ సొసైటీ’, ‘తెలుగు భాగవత ప్రచార సమితి’, ‘కాకతీయ సాంస్కృతిక పరివారం’ సంస్థ సభ్యులు హాజరై శ్రీ సాంస్కృతిక కళాసారథిని అభినందించారు. గణేశ్న రాధాకృష్ణ సాంకేతిక నిర్వాహకులుగా వ్యవహరించిన ఈ కార్యక్రమం  సామాజిక మాధ్యమాల వేదికగా ప్రసారం చేశారు.

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని