NRI News: వైకాపా పాలనతో ఏపీ ప్రజలు విసిగిపోయారు: జయరాం కోమటి

వైకాపా ప్రభుత్వ పాలనతో ప్రజలు విసిగిపోయారని తెదేపా ఎన్‌ఆర్‌ఐ కోఆర్డినేటర్‌ జయరాం కోమటి అన్నారు. వైకాపా దోపిడీ చూసి ప్రవాసాంధ్రులు పెట్టుబడి పెట్టేందుకు వెనుకాడుతున్నారని చెప్పారు. తెదేపా వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా అమెరికాలోని మేరీల్యాండ్‌లో ఆరో మహానాడు కార్యక్రమం నిర్వహించారు.

Updated : 18 Oct 2022 09:48 IST

మేరీల్యాండ్‌లో ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాలు..

మహానాడులో పలు తీర్మానాలకు ఆమోదం

ఇంటర్నెట్‌డెస్క్‌: వైకాపా ప్రభుత్వ పాలనతో ప్రజలు విసిగిపోయారని తెదేపా ఎన్‌ఆర్‌ఐ కోఆర్డినేటర్‌ జయరాం కోమటి అన్నారు. వైకాపా దోపిడీ చూసి ప్రవాసాంధ్రులు పెట్టుబడి పెట్టేందుకు వెనుకాడుతున్నారని చెప్పారు. తెదేపా వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా అమెరికాలోని మేరీల్యాండ్‌లో ఆరో మహానాడు కార్యక్రమం నిర్వహించారు. జయరాం కోమటి అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్, గుంటూరు మిర్చియార్డు ఛైర్మన్‌ మన్నవ సుబ్బారావు పాల్గొన్నారు. శ్రీనాథ్‌రావు ఆధ్వర్యంలో ఈ శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.

ప్రపంచవ్యాప్తంగా ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాలు జరుగుతున్న వేళ.. హెల్త్‌ యూనివర్సిటీకి ఆయన పేరు తొలగించడంతో తెలుగువారు తీవ్ర మనస్తాపానికి గురయ్యారని జయరాం కోమటి అన్నారు. తెలుగువాడి గుండెచప్పుడైన ఎన్టీఆర్‌ పేరు కొనసాగించాలని ఆయన డిమాండ్‌ చేశారు. 

వైవీబీ రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసిన సీఎం జగన్‌కు వికేంద్రీకరణ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. అమరావతి రైతుల పాదయాత్రను అడ్డుకోవడమేంటని ప్రశ్నించారు. న్యాయస్థానం అనుమతితో పాదయాత్ర చేస్తుంటే సాక్షాత్తు మంత్రులే ఆటంకాలు కల్పించడం కోర్టు ధిక్కరణ అవుతుందన్నారు. 

మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ ఏపీలో చట్టబద్ధ పాలన లేదన్నారు. పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తున్నారని.. ప్రశ్నించిన వారిని అణచివేస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారన్నారు. విశాఖలో భూములు దోచుకున్న విజయసాయిరెడ్డిపై విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు.

అనంతరం వెంకట్‌ కూకట్ల, జానకి భోగినేని, మహేశ్‌ నెలకుదిటి, శ్రీనివాసరావు దామా, శ్రీనివాసరం సామినేని, వాసు గోరంట్ల, శివ నెల్లూరి, హర్ష పేరంనేని, హరీశ్ కూకట్ల పలు తీర్మానాలను ప్రవేశపెట్టారు. ఆ తీర్మానాలను సమావేశంలో ఆమోదించారు. ఈ కార్యక్రమంలో రవి మందలపు, శ్రీనివాస్ కూకట్ల, సాయి బొల్లినేని, యాష్ బొద్దులూరి, తానా పూర్వ అధ్యక్షుడు సతీష్ వేమన, ప్రొఫెసర్ నరేన్ కొడాలి, భాను మాగులూరి, బోయపాటి వెంకటరమణ, డీవీ శేఖర్ తదితరులు పాల్గొని మాట్లాడారు.

ప్రవేశపెట్టిన తీర్మానలివే..

1. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలి
2. హెల్త్‌ యూనివర్సిటీకి ఎన్టీఆర్‌ పేరు కొనసాగించాలి
3. అమరావతి రైతుల పాదయాత్ర విజయవంతం కావాలి
4. క్షీణిస్తున్న శాంతిభద్రతలు, ఆగని వేధింపులు, అక్రమ అరెస్టులు
5. అన్నా క్యాంటీన్లు అడ్డుకోవడం దుర్మార్గమైన చర్య
6. పోలవరం నిర్మాణం తక్షణమే పూర్తి చేయాలి
7. సభ్యత్వ నమోదు- పార్టీ సంస్థాగత నిర్మాణం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు