కాట్రగడ్డ అరుణకు శుభాకాంక్షల వెల్లువ

అమెరికా రాజ‌కీయాల్లో చరిత్ర సృష్టించిన తెలుగు ఆడపడుచు కాట్రగడ్డ అరుణ మిల్లర్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. అమెరికా మధ్యంతర ఎన్నికల్లో విజ‌యం సాధించిన ఆమెకు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులతో పాటు తెలుగు ఎన్నారైలు శుభాకాంక్షలు తెలియజేశారు.

Updated : 12 Nov 2022 13:00 IST

వాషింగ్టన్‌: అమెరికా రాజ‌కీయాల్లో చరిత్ర సృష్టించిన తెలుగు ఆడపడుచు కాట్రగడ్డ అరుణ మిల్లర్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. అమెరికా మధ్యంతర ఎన్నికల్లో విజ‌యం సాధించిన ఆమెకు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులతో పాటు తెలుగు ఎన్నారైలు శుభాకాంక్షలు తెలియజేశారు. అమెరికాలోని తెలుగు సంఘాల నాయ‌కులు అరుణ కాట్రగడ్డపై ప్రశంసలు కురిపించారు. మేరీ ల్యాండ్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా అరుణ మిల్లర్‌ గెలుపొందడం తెలుగు వారంద‌రికీ గ‌ర్వకారణమని తానా సంఘం ప్రెసిడెంట్ అంజయ్య చౌదరి లావు అన్నారు. మా అందరికీ ఆమె ఆత్మీయురాలని, ఆమె మ‌రిన్ని విజయ శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు.

అరుణ మిల్లర్ తెలుగువారికి ఎల్లప్పుడూ అండ‌గా ఉండేవార‌ని ఆటా ప్రెసిడెంట్ భువ‌నేశ్వర్‌ బుజాల కొనియాడారు. ఆమె లెఫ్టినెంట్‌ గవర్నర్ వంటి ఉన్నత స్థాయి ప‌ద‌వి చేప‌ట్టడం ఆనందదాయకమని పేర్కొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆమెకు ఆటా సంఘం త‌రఫున శుభాకాంక్షలు తెలియజేశారు. మేరీ ల్యాండ్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా ఎన్నికైన‌ అరుణ మిల్లర్ తెలుగు మ‌హిళ‌ కావ‌డం ఆనంద‌దాయ‌కంగా ఉంద‌ని టీటీఏ సంఘం అధ్యక్షుడు మోహన్‌ పొట్లాల అన్నారు. భార‌త్‌లో ఎంతో మందికి ఆమె స్ఫూర్తిదాయ‌క‌మ‌ని, మ‌రెన్నో ప‌ద‌వులు అధిరోహించాల‌ని ఆకాంక్షించారు. అరుణ మిల్లర్ నాట్స్‌ ప్రెసిడెంట్ భూప‌య్య చౌద‌రి శుభాకాంక్షలు తెలిపారు. భారత్‌ నుంచి వల‌స వ‌చ్చి అమెరికా రాజ‌కీయాల్లో ఉన్నత స్థాయికి  వెళ్లడం అభినందనీయమన్నారు. అమెరికాలో జ‌న్మించిన భారతీయులకు అరుణ స్పూర్తిదాయ‌క‌మ‌న్నారు.

మేరీ ల్యాండ్‌లో ఫైర్‌ బ్రాండ్‌గా గుర్తింపు పొందిన అరుణ.. బాలలందరికీ విద్య, మహిళలకు సమాన అవకాశాలపై చేసిన కృషితో ఇక్కడి ప్రజలు పట్టం కట్టారని అరుణ దగ్గరి బంధువులు పేర్కొన్నారు. భారత్‌ అంటే ఆమెకు ఎంతో ఇష్టమని, తెలుగు సంస్కృతి సంప్రదాయాల పట్ల ఆమెకు ఎనలేని మక్కువ అని తెలిపారు. హౌస్‌ ఆఫ్‌ డెలిగేట్‌ (శాసనసభ్యురాలు)గా గెలుపొందిన తొలి భారతీయ అమెరికన్‌గా ఘనత సాధించారని, 2010 నుంచి దాదాపు 8 ఏళ్లపాటు మేరీ ల్యాండ్‌ హౌస్‌ ఆఫ్‌ డెలిగేట్స్‌ సభ్యురాలిగా ఉన్నారని చెప్పారు. మేరీ ల్యాండ్‌లో తెలుగువారు సత్కార సభలో ఆమె పాల్గొన్నారని గుర్తు చేస్తున్నారు. అగ్రరాజ్యపు రాజ‌కీయాల్లో అరుణకు అరుదైన గౌరవం దక్కడం ఎంతో గర్వంగా ఉందని తెలుగు ఎన్నారైలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు