US Visa: అమెరికాలో చదువులకు ‘వీసా’వహుల ఎదురుచూపులు..!

అమెరికా వీసా అపాయింట్‌మెంటు స్లాట్ల విడుదలకు అధికసంఖ్యలో విద్యార్థులు ఎదురు చూస్తున్నారు.

Updated : 25 Nov 2022 09:36 IST

రెండో దఫా స్లాట్ల విడుదల ఎప్పుడో..

ఈనాడు, హైదరాబాద్‌: అమెరికా వీసా అపాయింట్‌మెంటు స్లాట్ల విడుదలకు అధికసంఖ్యలో విద్యార్థులు ఎదురు చూస్తున్నారు. గత నెలలో విడుదలైన స్లాట్లు గంటల వ్యవధిలోనే నిండిపోయాయి. ఇంకా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందిన వేల సంఖ్యలో విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. ప్రస్తుత సీజన్‌ కోసం గతనెల 29వ తేదీన అమెరికా ప్రభుత్వం దిల్లీలోని రాయబార కార్యాలయంతోపాటు ముంబై, చెన్నై, కోల్‌కతా, హైదరాబాద్‌లోని కాన్సులేట్ల పరిధిలో స్లాట్లను విడుదల చేసింది. హైదరాబాద్‌ కాన్సులేట్‌ పరిధిలో ఇవి క్షణాల్లో భర్తీ అయ్యాయి. ఇతర ప్రాంతాల్లోనూ గంటల వ్యవధిలోనే పూర్తయ్యాయి. అప్పటి నుంచి విద్యార్థులు స్లాట్ల కోసం నిరీక్షిస్తున్నారు. రెండు దఫాలుగా వీసా స్లాట్లు జారీ చేస్తామని దిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం గతంలో ప్రకటించింది. చివరిదశలో వీసా దరఖాస్తు తిరస్కరణకు గురైన వారికీ అవకాశం కల్పిస్తామని వెల్లడించింది. తరగతుల సమయం సమీపిస్తున్న నేపథ్యంలో.. స్లాట్లకు నిర్దిష్ట తేదీని ప్రకటించకపోవడంతో ఎప్పుడు విడుదల చేస్తారోనన్న ఆందోళన విద్యార్థుల్లో వ్యక్తమవుతోంది. కొందరికి ఆయా విశ్వవిద్యాలయాల నుంచి ప్రవేశార్హతకు సంబంధించిన ‘ఐ-20’ పత్రాలు ఆలస్యంగా రావడం కూడా వీసా స్లాట్ల ఆశావహులు ఎక్కువగా ఉండటానికి ఒక కారణమని కన్సల్టెంట్లు చెబుతున్నారు. ఈనెల మొదటి, రెండో వారాల్లో ‘ఐ-20’ పత్రాలు కొందరు విద్యార్థులకు అందాయి. అమెరికాలోని విశ్వవిద్యాలయాలు వీటిని జారీచేసే ప్రక్రియలో ఈదఫా కొంత జాప్యం జరగడంతో ఎక్కువమంది విద్యార్థులు తొలి విడత వీసా అపాయింట్‌మెంట్లు పొందలేకపోయారని వరల్డ్‌వైడ్‌ ఎడ్యుకేషన్‌ కన్సల్టెంట్స్‌ మేనేజింగ్‌ పార్టనర్‌ వెంకటేశ్వరరెడ్డి ఉడుముల ‘ఈనాడు’తో చెప్పారు. సాధారణంగా బీటెక్‌ పూర్తి చేసుకున్న వారితోపాటు 6 నెలల నుంచి ఏడాది పాటు ఉద్యోగం చేసిన వారు కూడా ఎక్కువ సంఖ్యలో ఈదఫా అమెరికాలో ఉన్నత చదువులకు దరఖాస్తు చేసుకున్నారు. గురువారం స్వల్ప సంఖ్యలో జారీ చేసిన వీసా స్లాట్లు సైతం క్షణాల్లో అయిపోయాయి.


నెలాఖరులో విడుదలయ్యేనా?

రెండో విడత వీసా ఇంటర్వ్యూ తేదీలు ఈ నెల చివరిలో లేదా వచ్చే నెల మొదటి వారంలో విడుదల చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. గత నెలలో 29న విడుదల చేసిన నేపథ్యంలో రెండో విడత స్లాట్లు కూడా అదే సమయానికి విడుదల కావచ్చని భావిస్తూ ఎదురు చూస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని