TANA: తానా మహాసభలపై హైదరాబాద్‌లో సన్నాహక సమావేశం

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) వచ్చే ఏడాది జులైలో అమెరికాలోని ఫిలడెల్ఫియాలో మహాసభలను నిర్వహించనుంది. 

Updated : 24 Mar 2023 15:23 IST

హైదరాబాద్: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) వచ్చే ఏడాది జులైలో అమెరికాలోని ఫిలడెల్ఫియాలో మహాసభలను నిర్వహించనుంది. దీనిలో భాగంగా ఇండియాలో మొట్టమొదటిసారిగా సన్నాహక సమావేశం నిర్వహించారు. హైదరాబాద్‌లోని దసపల్లా హోటల్‌లో నిర్వహించిన ఈ సమావేశంలో తానా నాయకులతో పాటు పలువురు దాతలు, సినీ, వ్యాపార, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. తానా బోర్డు డైరెక్టర్‌ జాని నిమ్మలపూడి ఆధ్వర్యంలో జరిగిన ఈ సన్నాహక సమావేశానికి వ్యాపారవేత్తలు రామకృష్ణ బొబ్బ, సుధాకర్‌ కొర్రపాటి డోనర్లుగా వ్యవహరించారు. 

ఈ సమావేశానికి ప్రముఖ సినీనటుడు మురళీమోహన్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తానా మహాసభల లోగో, ప్రోమోను ఆయన ఆవిష్కరించారు. తనకు తానా అంటే చాలా ఇష్టమని.. ఇప్పటికి 20సార్లు మహాసభల్లో పాల్గొన్నట్లు చెప్పారు. తానా ఆధ్వర్యంలో చేపడుతున్న సేవా కార్యక్రమాలను ఈ సందర్భంగా మురళీమోహన్‌ ప్రశంసించారు. 

తానా అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి మాట్లాడుతూ ఫిలడెల్ఫియాలో తానా మహాసభలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని.. ఈ సభలకు అందరూ రావాల్సిందిగా కోరారు. వ్యాపార, సినీ, రాజకీయ, వ్యాపార, సాహితీ రంగాలకు చెందిన ప్రముఖులతో పాటు అందరూ పాల్గొని మహాసభల విజయవంతానికి సహకరించాలని.. తానా ఆతిథ్యాన్ని స్వీకరించాలని కోరారు. తానాకు సహకరిస్తున్న దాతలను ఈ సందర్భంగా  ఘనంగా సత్కరించారు. తానా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కార్యక్రమాలను మరింత విస్తరించడంతో పాటు సంఘం బలోపేతానికి కృషి చేస్తున్నట్లు అంజయ్యచౌదరి వివరించారు. తానా మహాసభల కన్వీనర్‌ రవి పొట్లూరి మాట్లాడుతూ మహాసభలకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.  తానా బోర్డు డైరెక్టర్ జాని నిమ్మలపూడి సేకరించిన రూ.కోటి విరాళాన్ని బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రికి అందజేస్తున్నట్లు ఈ కార్యక్రమంలో ప్రకటించారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడంలో ప్రతాప్‌రెడ్డి కీలక పాత్ర పోషించినట్లు జాని నిమ్మలపూడి తెలిపారు.

ఈ సమావేశానికి తానా నాయకులు లక్ష్మీ దేవినేని, శశికాంత్‌ వల్లేపల్లి, పురుషోత్తం చౌదరి గూడె, సురేశ్‌ పుట్టగుంట, రవి మందలపు, సునీల్ పంత్ర, శ్రీనివాస్‌ ఓరుగంటి, ఉమ కటికి, రాజా కసుకుర్తి, సురేశ్‌ కాకర్ల, హితేశ్‌ వడ్లమూడి, శశాంత్‌ యార్లగడ్డ, శ్రీనివాస్‌ కూకట్ల, ఠాగూర్‌ మలినేని, రఘు ఎద్దులపల్లి, సుమంత్‌ పుసులూరి తదితరులతో పాటు సినీరంగ ప్రముఖులు, వివిధ రాజకీయ పార్టీల నేతలు హాజరయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని