దిగ్విజయంగా అంతర్జాతీయ ‘స్వరరాగ శతావధానం’

ప్రముఖ స్వరకర్త గరికిపాటి వెంకటప్రభాకర్ మొదటి అంతర్జాతీయ స్వరరాగ శతావధాన కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది.

Published : 25 Apr 2023 19:37 IST

ప్రముఖ స్వరకర్త గరికిపాటి వెంకటప్రభాకర్ మొదటి అంతర్జాతీయ స్వరరాగ శతావధాన కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది. ‘వీధి అరుఁగు, నార్వే’, ‘ఎస్‌.ఎస్‌.మ్యూజిక్ అకాడెమీ ఇంటర్నేషనల్’ సంయుక్తంగా దీనిని నిర్వహించాయి. ఈ స్వర రాగశతావధానం కార్యక్రమంలో భాగంగా అంతర్జాల వేదికపై నిర్విరామంగా ఏప్రిల్ 14వ తేదీ నుంచి ఏప్రిల్ 22 వరకూ 17 దేశాల నుంచి 108 మంది పృచ్ఛకులతో, 15 మంది సమన్వయకర్తలతో ఆద్యంతం ఎంతో ఆహ్లాదకరంగా జరిగింది. అవధాన ప్రక్రియలో భాగంగా సంగీతజ్ఞులైన పృచ్ఛకులు సంధించిన ప్రశ్నలకు అతి స్వల్పవ్యవధిలో ఒకసారి రాగ వర్ణనతో, మరోసారి నిషిద్ధస్వర విన్యాసంతో, రాగమాలికల కూర్పులతో, స్వరాక్షరాలతో, రాగతాళరస మార్పుల కూర్పులతో సమాధానమిచ్చారు. అప్రస్తుత ప్రసంగ ప్రభంజనాన్ని అలవోకగా అడ్డుకుంటూ తన స్వరరాగావధానంతో అలరించారు. కొన్ని చోట్ల ఆయన రసస్ఫూర్తి అనితరసాధ్యమనిపించింది.

ఈ కార్యక్రమానికి సమన్వయకర్తగా ఖతార్ నుంచి విక్రమ్ సుఖవాసి వ్యవహరించారు. ముఖ్య అతిథులుగా సముద్రాల విజయానంద్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక శాఖ పూర్వ సంచాలకులు డా.విజయ్ భాస్కర్ దీర్ఘాశి, తానా పూర్వ అధ్యక్షులు జయ్ తాళ్లూరి, వంగూరి ఫౌండేషన్ అధ్యక్షులు వంగూరి చిట్టెం రాజు,  తానా పూర్వ అధ్యక్షులు ప్రసాద్ తోటకూర, శ్రీ సాంస్కృతిక కళాసారథి అధ్యక్షులు రత్న కుమార్ తదితరులు గరికిపాటి వెంకటప్రభాకర్ పాండిత్యాన్ని కొనియాడారు. ఇలాంటి కార్యక్రమాలు ముందు తరాల వారికి ఒక నిఘంటువుగా ఉంటాయని వీధిఅరుఁగు వ్యవస్థాపకులు వెంకట్ తరిగోపుల అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా పృచ్ఛకులు, ముఖ్య అతిథులు, స్వయంసేవకులతో పాటు పలువురిని సత్కరించారు. అంతర్జాతీయంగా మొట్టమొదటిసారి నిర్వహించిన ఈ శతావధానం కార్యక్రమాన్ని వండర్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డ్స్ మరియు తెలుగు బుక్ అఫ్ రికార్డ్స్ లో పొందుపరిచి అంగీకార పత్రాన్ని అందజేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని