NRI: సింగపూర్‌లో ఘనంగా కార్మిక దినోత్సవ వేడుకలు

కార్మిక దినోత్సవం సందర్భంగా సింగపూర్‌ తెలుగు సమాజం నూతన కార్యవర్గం బొమ్మారెడ్డి శ్రీనివాసులురెడ్డి ఆధ్వర్యంలో మే డే వేడుకలు ఘనంగా జరిగాయి.

Published : 06 May 2023 22:58 IST

సింగపూర్‌: కార్మిక దినోత్సవం సందర్భంగా సింగపూర్‌ తెలుగు సమాజం నూతన కార్యవర్గం బొమ్మారెడ్డి శ్రీనివాసులురెడ్డి ఆధ్వర్యంలో మే డే వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక తెరుసన్‌ రిక్రియేషన్‌ సెంటర్‌లో ఏర్పాటు చేసిన వేడుకల్లో పాటలు, డ్యాన్స్‌, మ్యూజిక్‌, వెంట్రిలాక్విజం, మెంటాలిజం, లేజర్‌ షో వంటి వివిధ వైవిధ్యభరితమైన కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

దాదాపు 700 మంది పాల్గొన్న ఈ కార్యక్రమానికి తెలంగాణ ఎమ్మెల్సీ, ప్రజా కవి గోరటి వెంకన్న ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వెంకన్న తన పాటలు, మాటలతో సభికులను ఉత్తేజపరుస్తూ అలరించారు. ప్రముఖ జానపద గాయని చైతన్య తనదైన రీతిలో జానపద గీతాలతో అలరించారు. వైవిధ్య కళాకారుడు రవి.. పిల్లల్ని, పెద్దల్ని తన మాయాజాలంతో మంత్ర ముగ్ధులను చేశారు. ఆ తర్వాత డ్యాన్స్‌లు, పాటలు, వినోదభరిత కార్యక్రమాలతో పలువురు శ్రామిక సోదరులు అత్యంత ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా కార్మిక సోదరుల కోసం 3 వారాంతాల్లో నిర్వహించిన క్రికెట్‌, వాలీబాల్‌ పోటీలు అందరినీ ఏకతాటిపైకి తెచ్చాయి. పోటీల్లో గెలిచిన వారికి గోరటి వెంకన్న చేతులుమీదుగా బహుమతులు, ప్రైజ్‌ మనీ అందజేశారు. 

ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా ఏపీ ప్రభుత్వ ప్రవాసాంధ్ర వ్యవహారాల సలహాదారు, మాజీ ఎంపీ జ్ఞానేంద్రరెడ్డి హాజరయ్యారు. కార్మిక సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమం ద్వారా అందరినీ ఒకతాటి పైకి తీసుకొచ్చిన కార్మిక సోదరులను, తెలుగు సమాజం చేస్తున్న కార్యక్రమాలను ప్రశంసించారు. ఏపీఎన్‌ఆర్‌టీ ప్రవాస బీమా గురించి వివరించడంతో పాటు, అవసరమైనప్పుడు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. సింగపూర్‌ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలకు విమాన సర్వీసులకై తన పరిధిలో కృషి చేస్తానని హామీ ఇచ్చారు. 

సింగపూర్‌ తెలుగు సమాజం అధ్యక్షులు బొమ్మారెడ్డి శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ.. కార్మిక సోదరుల వృతి నైపుణ్య పరీక్షలు తెలుగులో నిర్వహించాలని తెలుగు సమాజం కార్యవర్గం చేస్తున్న కృషి ఫలించిందన్నారు. తొలి దశలో 5 కోర్సులు ఆమోదం పొందాయని హర్షాతిరేకాల మధ్య ప్రకటించారు. సింగపూర్‌ చరిత్రలో ఇదే తొలిసారి అని పేర్కొన్నారు. సింగపూర్‌లో నివసించే వలస కార్మికులకు స్థిరమైన బీమా ప్రణాళికపై సింగపూర్‌ తెలుగు సమాజం గతకొంతకాలంగా పనిచేస్తుందన్నారు. ఆ ప్రణాళికను భారత హై కమిషన్‌ దృష్టికి తీసుకెళ్లడం, బీమా ప్రయోజకుల పరిధిని పెంచేందుకు చొరవ తీసుకుని మరింత ముందుకెళ్లేలా కృతార్థులయ్యారని తెలిపారు.

ప్రస్తుతం కొత్తగా ఇక్కడకు వచ్చేవారు నూతన బీమా పరిధిలోకి వచ్చే విధంగా అనుమతులొచ్చినప్పటికీ, ఇప్పటికే ఇక్కడ నివసిస్తున్న కార్మికులు కూడా బీమా పరిధిలోకి వచ్చే విధంగా వివిధ శాఖలకు సంబంధించిన అనుమతుల ప్రక్రియ చివరిదశకు వచ్చిందని సింగపూర్‌లో భారత హై కమిషనర్‌ పెరియసామి కుమరన్‌ మే డే సందర్భంగా ప్రకటించారు. ఈ కార్యక్రమం విజయవంతం కావటానికి సహకరించిన అందరికీ, హాజరైన వారికి, స్పాన్సర్స్‌, క్రీడాకారులకు నిర్వాహకులు మేరువ కాశిరెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయగా సుమారు 3,700 వీక్షించారని, భవిష్యత్తులో కార్మికుల సంక్షేమం కోసం తెలుగు సమాజం మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తుందన్నారు. ఈ నూతన కమిటీ గతంలో సాధించిన విజయాల్ని పునాదిగా చేసుకొని మరెన్నో వినూత్న కార్యక్రమాల్ని చేపట్టబోతున్నట్టు గౌరవ కార్యదర్శి అనిల్‌ పోలిశెట్టి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని