Forbes: ఫోర్బ్స్‌లో గుంటూరు యువకుడిపై వ్యాసం

ప్రపంచ ఖ్యాతి గాంచిన ఫోర్బ్స్‌ పత్రిక తన వెబ్‌సైట్‌లో గుంటూరుకు చెందిన సాయి ప్రజ్వల్‌ కాటంరాజు, అమెరికాకు చెందిన బోర్డాన్‌ జెస్టర్స్‌లను ప్రపంచ యువ స్టార్టప్‌ అధినేతల్లో ఒకరిగా ప్రశంసిస్తూ వ్యాసం ప్రచురించిందని కేఎల్‌ యూనివర్సిటీ రిజస్ట్రార్‌గా పనిచేస్తున్న సాయి ప్రజ్వల్‌ తండ్రి కాటంరాజు సుబ్బారావు తెలిపారు.

Updated : 19 Aug 2023 10:04 IST

తాడేపల్లి, న్యూస్‌టుడే: ప్రపంచ ఖ్యాతి గాంచిన ఫోర్బ్స్‌ పత్రిక తన వెబ్‌సైట్‌లో గుంటూరుకు చెందిన సాయి ప్రజ్వల్‌ కాటంరాజు, అమెరికాకు చెందిన బోర్డాన్‌ జెస్టర్స్‌లను ప్రపంచ యువ స్టార్టప్‌ అధినేతల్లో ఒకరిగా ప్రశంసిస్తూ వ్యాసం ప్రచురించిందని కేఎల్‌ యూనివర్సిటీ రిజస్ట్రార్‌గా పనిచేస్తున్న సాయి ప్రజ్వల్‌ తండ్రి కాటంరాజు సుబ్బారావు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం కేఎల్‌యూలో 2016 సంవత్సరంలో బీటెక్‌ పూర్తి చేసిన సాయి ప్రజ్వల్‌ అనంతరం 2017లో ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లారు. అక్కడ పరిచయమైన బోర్డాన్‌ జెస్టర్స్‌తో కలిసి నూతన సాంకేతికతపై అవగాహన పెంచుకొని ‘ఆటోమోటాస్‌’ అనే ఆటోమేటెడ్‌ కర్బ్‌ మేనేజ్‌మెంట్‌ ఫ్లాట్‌ఫాంను 2023లో ఆవిష్కరించారు. 

అమెరికాలోని నగరాలు, విమానాశ్రయాల్లో రద్దీని తెలుసుకోవడానికి, ప్రమాదాలు నివారించడానికి దీన్ని ఉపయోగించేలా రూపొందించారు. ఆయా ప్రాంతాల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆటోమోటాస్‌ కెమెరాల సాయంతో ఎక్కడ ట్రాఫిక్‌ ఉందో కచ్చితత్వంతో తెలుసుకోవచ్చు. వినియోగదారులు దీన్ని ఉపయోగించుకొని రద్దీ సమస్యను అధిగమించడం, ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఈ విధానం నచ్చి టెక్నాలజీని మరింత అభివృద్ధి చేసి ఎక్కువమంది ప్రజలకు చేరువ చేసేందుకు ‘టెక్‌ స్టార్స్‌ వెంచర్స్‌’ సంస్థ 12 మిలియన్‌ డాలర్లు ఇచ్చేందుకు ముందుకొచ్చింది. దీంతో ప్రపంచ యువ స్టార్టప్‌ అధినేతలంటూ ఫోర్బ్స్‌ మ్యాగజైన్‌ సాయి ప్రజ్వల్‌ కాటంరాజు, బోర్డాన్‌ జెస్టర్స్‌లపై వ్యాసం ప్రచురించింది. ప్రస్తుతం వీరు రూపొందించిన టెక్నాలజీ అమెరికాలోని 12 నగరాల్లో ఉపయోగిస్తున్నారని సాయి ప్రజ్వల్‌ తండ్రి వివరించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు