NATS: డల్లాస్‌లో వైభవంగా నాట్స్ తెలుగు వేడుకలు

నాట్స్ తెలుగు వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు డల్లాస్‌లోని పది వేల మందికిపైగా తెలుగువారు హాజరయ్యారు.

Updated : 23 Mar 2024 11:08 IST

డల్లాస్‌: నాట్స్ తెలుగు వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు డల్లాస్‌లోని పది వేల మందికి పైగా తెలుగువారు హాజరయ్యారు. ఆట, పాటలతో ఆద్యంతం వినోద భరితంగా సాగిన వేడుకలు తెలుగువారికి మధురానుభూతులను పంచాయి. ప్రముఖ సినీ గాయకుడు కార్తిక్ పాటల ప్రవాహంలో అందరూ తడిసి ముద్దయ్యారు.

ఇదే వేదికపై ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్‌కు జీవిత సాఫల్య పురస్కారాన్ని అందించారు. ప్రముఖ కవి కరుణ శ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రికి కూడా లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు ప్రకటించి వారి కుటుంబ సభ్యులకు అందించారు. స్థానిక శ్రీచక్ర కళా నిలయం, రాగ మయూరి స్కూల్ ఆఫ్ డ్యాన్స్ శాస్త్రీయ నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఐక్య బ్యాండ్, తాళం పరై & పాయిల్ ఆన్ లైన్ డప్పు నృత్యం, మధురాజ్ డ్యాన్స్ గ్రూపు తెలుగు పాటలకు చేసిన నృత్యాలు జోష్‌ నింపాయి. రోబో గణేశన్ ప్రదర్శన అలరించింది. హీరోయిన్ కాథెరీన్, హాస్య నటులు శ్రీనివాస రెడ్డి, సత్యం రాజేశ్‌ల ప్రత్యేక సంభాషణ, ప్రముఖ వ్యాఖ్యాత, సినీ నటి ఉదయభాను వ్యాఖ్యానం అందరినీ ఆకట్టుకున్నాయి. మహిళా సాధికారత, వ్యాపార సదస్సులు, సాహిత్య కార్యక్రమాలు, వ్యక్తిత్వ వికాస సదస్సులు, సినీ తారలతో ఇష్టాగోష్టి వంటి కార్యక్రమాలు అందరి ప్రశంసలు అందుకున్నాయి.

డల్లాస్ తెలుగు వేడుకల వేదికపై నాట్స్ స్టూడెంట్స్ స్కాలర్‌షిప్‌లను అందించారు. ఈ సందర్భంగా డా. మధు కొర్రపాటి, డా. సుధీర్ .సి. అట్లూరి, శ్రీనివాస్ గుత్తికొండ, డా.వెంకట్ ఆలపాటి, మురళీ మేడిచెర్ల, ఆనంద్ కూచిభొట్ల, మైత్రేయి ఎడ్లపల్లిలకు కమ్యూనిటీ సర్వీస్ అవార్డులను, కేఎస్‌ లక్షణరావు (M.L.C), వీరమ్మ మాదాల, రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (RDT) Mr&Mrs. Moncho Ferrer, ఉత్తమ  సేవా పురస్కారాలను కూడా అందించింది.

ఈ వేడుకలను అద్భుతంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషించిన వారిని నాట్స్ డల్లాస్ తెలుగు వేడుకల కన్వీనర్ రాజేంద్ర మాదాల అభినందించారు. నాట్స్ నేతలు, వాలంటీర్లు చక్కటి సమన్వయంతో పనిచేశారని నాట్స్ అధ్యక్షుడు బాపయ్య చౌదరి(బాపు) నూతి ప్రశంసించారు. డల్లాస్‌లో నాట్స్‌ ఏ కార్యక్రమం చేపట్టినా తెలుగు ప్రజలు, స్పాన్సర్స్ ఇస్తున్న మద్దతు, ఆదరణ మరువలేనిదన్నారు. ఈ వేడుకలను దిగ్విజయం చేసిన ప్రతి ఒక్కరికి నాట్స్ బోర్డ్ ఛైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని