సింగపుర్‌లో శ్రీ మారియంబికా ఆలయంలో ఘనంగా చండీహోమం

సింగపుర్‌లోని వాసవీ క్లబ్‌ మెర్లయన్‌ ఆధ్వర్యంలో ఆర్యవైశ్యులు అత్యంత పురాతన, విశిష్టమైన శ్రీ మారియంబికా ఆలయంలో చండీహోమం నిర్వహించారు.

Published : 04 Apr 2024 20:27 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: సింగపుర్‌లోని వాసవీ క్లబ్‌ మెర్లయన్‌ ఆధ్వర్యంలో ఆర్యవైశ్యులు అత్యంత పురాతన, విశిష్టమైన శ్రీ మారియంబికా ఆలయంలో చండీ హోమం చేశారు.  ఎంతో వైభవంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో భక్తులంతా ప్రత్యేక పూజలతో అమ్మవారి దీవెనలు అందుకున్నారు. హోమం అనంతరం ఆర్యవైశ్య కుటుంబసభ్యులు అమ్మవారికి సామూహిక కుంకుమార్చనలు చేశారు. అనంతరం అర్చకులు అమ్మవారి మూలవిరాట్‌కు ప్రత్యేక అభిషేకం నిర్వహించి విశేష అలంకరణ చేపట్టారు. దాదాపు 180 మంది భక్తుల జయజయధ్వానాల మధ్య జరిగిన ఈ చండీ హోమం అందరినీ పరవశింపజేసింది. తీర్థప్రసాదాల పంపిణీతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ముగించారు. ఈ వేడుకకు దాతలుగా ఉన్న కిరణ్‌ కైలాసపు, శ్రీకాంత్‌ నూతిగట్టును కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. 

తెలుగు రాష్ట్రాలకు దూరంగా ఉంటున్నా.. వాసవీక్లబ్‌ మెర్లయిన్‌ సింగపుర్‌ వారి ఆధ్వర్యంలో జరిగే ప్రతీ సాంస్కృతిక, పూజా కార్యక్రమాల్లో క్రమంతప్పకుండా పాల్గొంటూ ఇక్కడి భావితరాలకు మన సంస్కృతిని పరిచయం చేస్తూ అన్ని కార్యక్రమాలను విజయవంతం చేస్తోన్న ఆర్యవైశ్యులందరికీ క్లబ్‌ అధ్యక్షుడు మురళీకృష్ణ, కార్యదర్శి సుమన్‌ రాయల, కోశాధికారి ఆనంద్‌ గందె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. కోర్‌ కమిటీ సభ్యులు ముక్కా కిశోర్‌, సరితాదేవి విశ్వనాథన్‌, ముకేశ్‌ భూపతి, వినయ్‌ బత్నుర్‌, ఫణేశ్‌ ఆత్మూరి ఈ కార్యక్రమం విజయవంతానికి సహకరించారు. భోజన ప్రసాద వితరణ సజావుగా సాగేందుకు సహకరించిన సేవాదళ్‌ సభ్యులందరికీ ఈసందర్భంగా కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని