11 దేశాల కవులతో అంతర్జాతీయ వేదికపై ఉగాది కవి సమ్మేళనం

వంశీ అంతర్జాతీయ సాహితీ పీఠం, శ్రీ సాంస్కృతిక కళాసారథి- సింగపూర్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ‘ఉగాది కవి సమ్మేళనం’ ఘనంగా జరిగింది.

Updated : 15 Apr 2024 22:38 IST

సింగపూర్‌: వంశీ అంతర్జాతీయ సాహితీ పీఠం, శ్రీ సాంస్కృతిక కళాసారథి- సింగపూర్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ‘ఉగాది కవి సమ్మేళనం’ ఘనంగా జరిగింది. శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది సందర్భంగా  కేవలం విదేశాల్లో నివసించే తెలుగు కవుల కొరకు ప్రత్యేకంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. అంతర్జాలం వేదికగా జరిగిన ఈ సమ్మేళనానికి 11 దేశాల నుంచి దాదాపు 40 మంది కవులు, కవయిత్రులు పాల్గొనడం చాలా సంతోషకరమని, త్వరలోనే ఈ కవితలన్నింటినీ ఒక సంపుటిగా ప్రచురించనున్నట్లు నిర్వాహకులు, వంశీ వ్యవస్థాపకులు డాక్టర్‌ వంశీ రామరాజు, శ్రీ సాంస్కృతిక కళాసారథి సింగపూర్ వ్యవస్థాపకులు కవుటూరు రత్నకుమార్ తెలిపారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సాహితీవేత్త, పద్మభూషణ్ డాక్టర్‌ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ అభినందనలు తెలిపారు. కార్యక్రమాన్ని సాంతం వీక్షించారు. ఆంగ్ల వ్యామోహంలో తెలుగును దూరం చేసుకోకూడదని, యువతరం కవులను రచయితలను ప్రోత్సహించే మరిన్ని కార్యక్రమాలను చేపట్టాలని సందేశం ఇచ్చారు. విశిష్ట అతిథిగా పాల్గొన్న ప్రముఖ సినీగేయ రచయిత భువనచంద్ర.. కోయిలను పిలుస్తూ ఒక పాటను రచించి శ్రావ్యంగా ఆలపించి అందరినీ ఆహ్లాదపరిచారు. ఆత్మీయ అతిథిగా వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా అధ్యక్షులు డాక్టర్‌ వంగూరి చిట్టెన్ రాజు పాల్గొని సభను, నిర్వాహకులను అభినందించారు. 

రాధిక మంగిపూడి సభా నిర్వహణలో, కవులందరూ “నా బాల్యంలో ఉగాది” అనే శీర్షికతో తమ చిన్ననాటి ఉగాది పండుగ జ్ఞాపకాలను, తాము పెరిగిన సొంత ఊరి పరిస్థితులను తలచుకొని వర్ణిస్తూ కవితలను వినిపించడం అందరినీ మరింత విశేషంగా ఆకట్టుకుంది. అందరూ ఒకే శీర్షికతో రాసిన కవితలైనా, వివిధ ప్రాంతాలలో ఉగాది వేడుకల తీరుతెన్నులు, వివిధ మనోభావాల ద్వారా ప్రకటించడం.. ఇవన్నీ దేనికవే ప్రత్యేకంగా నిలిచాయి.  

అమెరికా, కెనడా, న్యూజిలాండ్, సింగపూర్, మలేసియా, ఇండోనేసియా, ఖతార్, ఒమాన్, యూఏఈ, పోలాండ్, యూకే దేశాల నుంచి 40మంది ఈ కవి సమ్మేళనంలో పాల్గొన్నారు. వంశీ అధ్యక్షురాలు డాక్టర్‌ తెన్నేటి సుధాదేవి, మేనేజింగ్ ట్రస్టీ సుంకరకపల్లి శైలజ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమం.. కల్చరల్ టీవీ, శ్రీ సాంస్కృతిక కళాసారథి యూట్యూబ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని