సింగపూర్‌లో ఘనంగా ‘పాట షికారుకొచ్చింది’ పుస్తక పరిచయ కార్యక్రమం

Published : 20 May 2024 16:04 IST

సింగపూర్‌: శ్రీ సాంస్కృతిక కళాసారథి, సింగపూర్‌ వారి ఆధ్వర్యంలో ‘పాట షికారుకొచ్చింది’ పుస్తక పరిచయ కార్యక్రమం ఒన్ కాన్ బెర్రా ఫంక్షన్ హాలులో ఘనంగా జరిగింది. పుస్తక రచయిత, వ్యక్తిత్వ వికాస నిపుణుడు ఆకెళ్ళ రాఘవేంద్ర కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకూ దాదాపు 200లకు పైగా వేదికల మీద మాట్లాడినా  కుటుంబసమేతంగా ఓ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం మొదటిసారి లభించిందన్నారు, ఇంతకుముందు ఎన్నిసార్లు ప్రయత్నించినా వీలుకానిది ఈ సింగపూరు సభ ద్వారా జరగడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.  అలాగే వ్యాఖ్యాత సుబ్బు పాలకుర్తి తన గురించి ఎంతో శోధించి పరిచయ వాక్యాలు రాశారని ప్రశంసించారు.

‘పాట షికారుకొచ్చింది’ పుస్తకం తన గురువు అయిన సీతారామశాస్త్రి పాటలను, జీవితాన్ని సమతుల్యం చేసుకుంటూ రాసిందన్నారు. ప్రతి పాట వెనక ఉన్న కథను అందరికీ చేరవెయ్యాలనే ఉద్దేశంతో ప్రాణంపెట్టి రాసిన పుస్తకమని తెలిపారు. ఈసందర్భంగా సిరివెన్నెలతో తనకు ఉన్న అనుబంధాన్ని, వారు తనని ప్రోత్సహించిన వైనాన్ని పంచుకున్నారు. సింగపూర్‌లో శ్రీ సాంస్కృతిక కళాసారథి సంస్థ నిర్వహించిన ఈ కార్యక్రమం ఎప్పటికీ గుండెల్లో నిలిచిపోతుందన్నారు. ఈ కార్యక్రమాన్ని ముగించివెళ్తుంటే ఏదో పుట్టినిల్లుపై మమకారాన్ని దాచుకోలేని పెళ్లికూతురు వెళ్లలేక వెళ్లలేక మెట్టినింటికి వెళుతున్నట్లు అనిపిస్తోందని, సింగపూరు వారి ఆప్యాయత తనను కట్టిపడేసిందన్నారు. ఈ కార్యక్రమానికి వచ్చిన సిరివెన్నెల అభిమానులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ భావోద్వేగానికి లోనయ్యారు.

సుబ్బు వి పాలకుర్తి సభ నిర్వహణ చేసిన కార్యక్రమంలో, శ్రీ సాంస్కృతిక కళాసారథి అధ్యక్షులు రత్నకుమార్ కవుటూరు మాట్లాడుతూ సిరివెన్నెల జయంతి అయిన మే 20వ తేదీకి ఒక్కరోజు ముందు ఆయన జీవిత పుస్తకాన్ని రచయిత ఆకెళ్ళ రాఘవేంద్ర ద్వారా సింగపూర్‌లో ఆవిష్కరించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఎందరో అభిమానులను సొంతం చేసుకున్న సిరివెన్నెలను స్మరించుకునే అవకాశం ఈ పుస్తకం ద్వారా మరోసారి అందరికీ దక్కిందని చెబుతూ, తెలుగు అక్షరం ఉన్నంతవరకూ సిరివెన్నెల పాట తెలుగు వారి నోటివెంట వినబడుతూనే ఉంటుందని అన్నారు.

రామాంజనేయులు చమిరాజు, సునీల్ రామినేని, మమత మాడబతుల సహాయసహకారాలు అందించగా, రాధాకృష్ణ గణేశ్న, కాత్యాయని గణేశ్న సాంకేతిక సహకారం అందించారు. 50 మందికి పైగా పాల్గొన్న ఈ కార్యక్రమం, ఆన్‌లైన్‌ ద్వారా 1000 మందికి పైగా వీక్షించారు. సిరివెన్నెల అభిమానులు షర్మిల, కృష్ణకాంతి, మాధవి, ఫణీష్ తమ పాటలు, కవితలు వినిపించి వారి అభిమానాన్ని చాటుకున్నారు. కార్యక్రమంలో పాల్గొన అతిథులందరికీ విందుభోజన ఏర్పాట్లను రేణుక, అరుణ, శ్రీలలిత తదితరులు పర్యవేక్షించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని