రామోజీరావుకు భారతరత్న ఇచ్చి గౌరవించాలి: మన్నవ సుబ్బారావు

‘ఈనాడు’ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు మృతిపట్ల ప్రవాసాంధ్రులు సంతాపం ప్రకటించారు. ఆయనకు భారతరత్న ఇచ్చి గౌరవించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

Published : 09 Jun 2024 17:46 IST

వాషింగ్టన్ డీసీ: ‘ఈనాడు’ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు మృతిపట్ల ప్రవాసాంధ్రులు సంతాపం ప్రకటించారు. ఆయనకు భారతరత్న ఇచ్చి గౌరవించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో ‘బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం’, తానా సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో రామోజీరావు మృతికి నివాళులర్పించారు. తొలుత ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా గుంటూరు మిర్చి యార్డ్‌ మాజీ ఛైర్మన్ మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ.. అనేక రంగాల్లో చారిత్రక విజయాలు సాధించి అందరికీ ఆదర్శంగా నిలిచిన రామోజీరావు, ఎన్టీఆర్‌లకు భారత రత్న ఇచ్చి గౌరవించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్‌ రాజధానికి అమరావతిగా పేరు పెట్టడం వెనుక రామోజీరావు ప్రేరణ ఉందన్నారు. అమరావతే రాజధాని అంటూ రైతులు చేపట్టిన ఉద్యమానికి తన కలాన్ని, గళాన్ని వినిపించి బాసటగా నిలిచారన్నారు. అంబేద్కర్, ఎన్టీఆర్, రామోజీరావు విగ్రహాలను రాజధాని నగరంలో పెట్టాలని, ఒక ప్రాంతానికి రామోజీరావు పేరు పెట్టాలంటూ ఈ సందర్భంగా తీర్మానం చేశారు.  

జీడబ్ల్యూటీసీఎస్ అధ్యక్షులు కృష్ణ లాం మాట్లాడుతూ.. అక్షరాన్ని ఆయుధంగా మలిచి సమాజాన్ని చైతన్యపరచి ప్రశ్నించే, పోరాడేతత్వాన్ని రామోజీరావు బోధించారని కొనియాడారు. ప్రతి అక్షరాన్ని ప్రజాపక్షం చేసి అరాచక, నిరంకుశ శక్తులపై అలుపెరుగని పోరాటం చేసి ఒక చారిత్రక విజయాన్ని అందించారన్నారు. రామోజీరావు తెలుగువారు కావడం మనందరికీ గర్వకారణమని తానా ప్రాంతీయ ప్రతినిధి సతీష్ చింతా అన్నారు. కాలుమోపిన ప్రతి రంగంలోనూ ఆయన విజయ సూత్రం కృషి, క్రమశిక్షణతో కూడిన కార్యాచరణేనన్నారు. భాను మాగులూరి సమన్వయ పరిచిన ఈ కార్యక్రమంలో సురేఖ చనుమోలు, శ్రీనివాస్ చావలి, రమాకాంత్ కోయ, సుధీర్ కొమ్మి, రవి అడుసుమిల్లి, సుశాంత్ మన్నే, ఉమాకాంత్, చక్రవర్తి పయ్యావుల, రమేష్ అవిర్నేని, వీర్రాజు, సీతారామారావు, రమేష్ గుత్తా, మురళి, ప్రభు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని