రామోజీరావుకు సింగపూర్‌లో ఘన నివాళి

రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు మృతికి విదేశాల్లోని తెలుగు ప్రజలు సంతాపం తెలుపుతున్నారు. ఆయన చేసిన విశేష సేవల్ని గుర్తు చేసుకొంటున్నారు.

Updated : 11 Jun 2024 20:37 IST

సింగపూర్‌: రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు మరణంపై విదేశాల్లో ఉన్న తెలుగువారు ఘనంగా నివాళులర్పిస్తున్నారు. ఆయన చేసిన విశేష సేవల్ని స్మరించుకొంటున్నారు. సింగపుర్‌లోని కాకతీయ సాంస్కృతిక పరివారం అనే సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం ది అమోర్‌ ఫంక్షన్‌ హాలులో జరిగిన సంతాప సభలో 50మందికి పైగా పాల్గొన్నారు.  రామోజీరావు తెలుగు నేలకు చేసిన సేవల్ని గుర్తు చేసుకున్నారు.  తెలుగు అక్షరం ఉన్నంతకాలం తెలుగు ప్రజలతో పాటు యావత్‌ భారతదేశం గుర్తుంచుకోవాల్సిన వ్యక్తి రామోజీరావు అంటూ ఘనంగా నివాళులర్పించారు.  

ఈసందర్భంగా ఆ సంస్థ అధ్యక్షులు రాంబాబు పాతూరి మాట్లాడుతూ.. తెలుగు జాతి సగర్వంగా తలెత్తుకొనేలా రామోజీ జీవిత పయనం సాగిందని, ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా నమ్మిన సిద్ధాంతాలను ఆయన వదులుకోలేదన్నారు. ఒక వార్త ‘ఈనాడు’లో వచ్చిందంటే.. దానివెనక ఎంతో పరిశోధన ఉండేదన్నారు. అది కచ్చితత్వానికి నిదర్శనమని, మారుమూల పల్లెల్లో సామాన్య ప్రజానీకానికి సైతం అర్థమయ్యేలా వార్తా ప్రచురణ ఉంటుందని కొనియాడారు. అనంతరం బీవీఆర్‌ చౌదరి మాట్లాడుతూ.. రామోజీరావుతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయన జీవితం ప్రతీ వ్యక్తికీ ఆదర్శప్రాయమని, జీవితంలో ఎదగాలనుకొనే ప్రతిఒక్కరికీ ఆయన జీవన పయనం ఒక పాఠ్యాంశంలా ఉపయోగపడుతుందని చెప్పారు. ప్రతీ తెలుగువారి జీవితాన్ని రామోజీరావు తన సంస్థలు, సేవల ద్వారా ఎంతగా ప్రభావితం చేశారో గుర్తు చేసుకుంటూ నివాళులర్పించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని