Aruna Miller: హైదరాబాద్‌లో పుట్టి.. అమెరికాలోని మేరీలాండ్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా ఎదిగి!

అమెరికాలోని మేరీలాండ్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా భారత సంతతికి చెందిన అరుణా మిల్లర్‌ ప్రమాణ స్వీకారం చేశారు. మేరీలాండ్‌లో ఈ పదవి చేపట్టిన తొలి ఇండో అమెరికన్‌ పౌరురాలిగా ఆమె చరిత్ర సృష్టించారు.

Published : 19 Jan 2023 21:28 IST

అన్నాపొలిస్‌‌: అగ్రరాజ్యం అమెరికా(America)లో భారత సంతతి మహిళకు అరుదైన గౌరవం దక్కింది. గతేడాది నవంబర్‌లో అమెరికాలో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో విజయం సాధించిన అరుణా మిల్లర్‌(Aruna miller) మేరీలాండ్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌(Maryland Lieutenant Governor)గా బుధవారం ప్రమాణస్వీకారం చేశారు. హైదరాబాద్‌లో పుట్టిన అరుణా మిల్లర్‌ అమెరికాలోని మేరీలాండ్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా ఎన్నికైన తొలి ఇండో అమెరికన్‌గా చరిత్ర సృష్టించారు. అరుణ డెమొక్రాట్ల తరఫున  పోటీ చేసి విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో ప్రత్యర్థి రిపబ్లికన్‌ పార్టీకి చెందిన వారు కూడా  ఆమెకు మద్దతివ్వడం విశేషం. మరోవైపు, మేరీలాండ్‌ గవర్నర్‌గా విజయం సాధించిన వెస్‌ మూర్‌ సైతం బుధవారమే ప్రమాణస్వీకారం చేశారు. అమెరికా చరిత్రలో గవర్నర్‌గా ఎన్నికైన మూడో నల్ల జాతీయ వ్యక్తి ఆయనే. వెస్‌ మూర్‌, అరుణ మిల్లర్‌ తరఫున అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌ విస్తృతంగా ప్రచారం చేసిన విషయం తెలిసిందే. అయితే, మన తెలుగు మహిళ అరుణా మిల్లర్‌ మేరీలాండ్‌లో 2010 నుంచి 2018 వరకు ప్రతినిధుల సభకు ఎన్నికై సేవలందించారు.

భగవద్గీతపై ప్రమాణం చేసిన అరుణ

చిన్నప్పుడే విదేశాలకు వెళ్లినా హిందూ మూలాల్ని మరిచిపోని 58 ఏళ్ల అరుణా మిల్లర్‌ బుధవారం  ప్రమాణస్వీకారం సందర్భంగా చేతిలో భగవద్గీత పట్టుకున్నారు. గతంలో భారత్‌ నుంచి తన కుటుంబం అమెరికాకు వలస వెళ్లినప్పటి జ్ఞాపకాలను పంచుకున్నారు. అక్కడి పాఠశాలలో మొదటి రోజు తనకు ఎదురైన అనుభవాన్ని వెల్లడించారు. ‘‘ఇక్కడ ఫిట్‌ కావాలనుకున్నా. కెఫ్టెరియాకు వెళ్లినప్పుడు ముందుగా ఓ ప్లాన్‌ వేసుకున్నా. అందరూ ఏం చేస్తున్నారో నేనూ అలాగే చేయాలని. తొలిసారి నేను అమెరికన్‌ ఫుడ్‌ తీసుకున్నా. నా జీవితంలో కోల్డ్‌ మిల్క్‌ తాగడం అదే తొలిసారి. చాలా బాగా అనిపించింది. అంతా ఓకే అనుకున్నా. తోటి విద్యార్థులందరితో కలిసి సరదాగా ఉన్నా. ఇప్పుడు వాళ్లంతా నా స్నేహితులే. ఆ తర్వాత తరగతి గదికి నడుచుకుంటూ వెళ్లి డెస్క్‌ మొత్తం వాంతి చేసుకున్నా. చాలా సిగ్గుగా అనిపించింది’’ అని అరుణా మిల్లర్‌ తన స్కూల్‌ తొలిరోజు అనుభవాన్ని పంచుకున్నారు.

అరుణ గురించి క్లుప్తంగా..

అరుణా మిల్లర్‌ సొంతూరు ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా పెదపారుపూడి మండలం వెంట్రప్రగడ.  58ఏళ్ల అరుణా మిల్లర్‌ హైదరాబాద్‌లో జన్మించారు. ఆమెకు ఏడేళ్ల వయసున్నప్పుడు అరుణ తండ్రి కాట్రగడ్డ వెంకటరామారావు ఉద్యోగ రీత్యా 1972లో అమెరికాకు వలస వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. వెంకటరామారావుకు అరుణ రెండో సంతానం. ఆమె విద్యాభ్యాసమంతా అక్కడే సాగింది. మిస్సోరి యూనివర్సిటీ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీలో ఇంజినీరింగ్‌ పూర్తిచేసిన అరుణా మిల్లర్‌.. ట్రాన్స్‌పోర్టేషన్‌ ఇంజినీరింగ్‌లో నిపుణురాలు. 1990లో డేవిడ్‌ మిల్లర్‌తో అరుణ వివాహమైంది. వీరికి ముగ్గురు పిల్లలు. అరుణ డెమొక్రటిక్‌ పార్టీ సభ్యురాలిగా చాలాకాలం నుంచి కొనసాగుతున్నారు. అంచెలంచెలుగా ఎదిగి లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ స్థాయికి ఎదిగారు. ఇప్పటికీ సొంతూరికి ఏడాదికోసారైనా వస్తుంటారని ఆమె బంధువులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని