హాంకాంగ్‌లో ఘనంగా భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

హాంకాంగ్‌లో భారత స్వాతంత్ర్య వేడుకలను ఘనంగా నిర్వహించారు. కాన్సుల్‌ జనరల్‌ సత్వంత్‌ ఖనాలియా...

Published : 17 Aug 2022 15:56 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: హాంకాంగ్‌లో భారత స్వాతంత్ర్య వేడుకలను ఘనంగా నిర్వహించారు. కాన్సుల్‌ జనరల్‌ సత్వంత్‌ ఖనాలియా జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం భారత రాష్ట్రపతి ద్రౌపదిముర్ము ప్రసంగంలోని సారాంశాన్ని చదివి వినిపించారు. ఈ వేడుకల్లో ప్రవాస భారతీయులు ఉత్సాహంగా పాల్గొన్నారు. సుర్‌ సాధన గ్రూప్‌ దేశభక్తి గీతాలు, సలాంగై డ్యాన్స్‌ అకాడమీ వారిచే నిర్వహించిన భరతనాట్యం, శ్రీశక్తి అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘భారత్‌’ కథక్‌లతో ప్రతిధ్వనించింది. ఈ ఏడాది జనవరిలో నిర్వహించిన క్విజ్‌ పోటీల విజేతలకు సత్వంత్‌ ఖనాలియా పతకాలను అందజేశారు. హాంకాంగ్‌, మకావు ఎస్‌ఏఆర్‌ నివాసితులు కాన్సులేట్‌, టీకప్‌ ప్రొడక్షన్స్‌ సహకారంతో ‘అభివ్యక్తి’ పేరిట హిందీలో రాసిన 25 కథల సంకలాన్ని ప్రచురించింది. ఆ పుస్తక సంపాదక సభ్యులు, కొందరు రచయితలను ఈ సందర్భంగా కాన్సుల్‌ జనరల్ సత్కరించారు.

అనంతరం ప్రధాని మోదీ పిలుపు మేరకు ‘హర్‌ ఘర్‌ తిరంగా’ పేరిట నిర్వహించిన కార్యక్రమంలో ప్రవాస భారతీయులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మాతృదేశం పట్ల తమకున్న గౌరవాన్ని, దేశభక్తిని ఈ సందర్భంగా చాటుకున్నారు. అనంతరం OFBJP హాంకాంగ్, చైనా అధ్యక్షుడు సోహాన్ గోయెంకా మాట్లాడుతూ ‘‘భారతదేశాన్ని భారతీయుల వద్దకు తీసుకెళ్లడం మా లక్ష్యం. హాంకాంగ్‌లోని ప్రతి భారతీయుడికి త్రివర్ణ పతాకాన్ని పంపిణీ చేస్తున్నాం. ఇక్కడి ప్రతి భారతీయుడి ఇల్లు, కార్యాలయాలకు 6,000 కంటే ఎక్కువ త్రివర్ణ పతాకాలను పంపిణీ చేశాయి. హాంకాంగ్‌లో స్థిరపడిన భారతీయులంతా మాతృభూమిని కీర్తిస్తూ స్వాతంత్య్ర అమృత మహోత్సవాన్ని సంతోషంగా జరుపుకొన్నారు’’ అని పేర్కొన్నారు. OFBJP హాంకాంగ్, చైనా ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ మాట్లాడుతూ.. ‘‘ఈ ప్రచారంతో స్వదేశ, విదేశాల్లో ఉన్న భారతీయులను ఏకం చేసిన మన ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని 'హర్ ఘర్ తిరంగా' కార్యక్రమంలో పాల్గొనడం చాలా గర్వంగా ఉంది. దేశం పట్ల ప్రేమతో తమ ఇళ్లలో, కార్యాలయాల్లో భారతీయులు జెండాను ఎగురవేశారు’’ అని చెప్పారు.

OFBJP హాంకాంగ్ చైనా ఉపాధ్యక్షుడు, రాజు సబ్నానీ, రమాకాంత్ అగర్వాల్, అజయ్ జకోటియా, రాజు షా, కుల్దీప్ ఎస్.బుట్టార్, సోనాలి వోరా ప్రచారానికి మద్దతుగా నిలిచారు. వారి కృషి, అంకితభావంతో హాంకాంగ్‌లో 'హర్ ఘర్ తిరంగా' ప్రచారం విజయవంతంగా సాధ్యమైందని నిర్వాహకులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు