ఫిలడేల్ఫియాలో తానా ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

అమెరికాలోని ఫిలడెల్ఫియాలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆటపాటలతో కూడిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. చిన్నారులు, మహిళలు నృత్యాలతో అలరించారు. 

Updated : 18 Mar 2023 01:19 IST

అమెరికా: అమెరికాలోని ఫిలడెల్ఫియాలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పెన్సిల్వేనియాలోని ఫిలడెల్ఫియాకు ఆనుకుని ఉన్న వెస్ట్ చెస్టర్‌లో మార్చి 11న మిడ్ అట్లాంటిక్ తానా టీం ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. మహిళా సాధికారతకు పెద్దపీట వేసి, అవని నుంచి అంతరిక్షం వరకు అన్ని రంగాలలో పురుషులతో సరిసమానంగా రాణిస్తున్న మహిళామణులందరిలో సృజనాత్మకతను తట్టి లేపే పలు కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో 600 మందికి పైగా పెన్సిల్వేనియా, న్యూ జెర్సీ పరిధిలోని ఎందరో ప్రవాస తెలుగింటి ఆడపడుచులు హాజరయ్యారు. ఆటపాటలతో, నృత్య ప్రదర్శనలతో, ఫ్యాషన్ షోలతో ఆద్యంతం ఉత్సాహంగా సందడి చేశారు. మగువలు, పిల్లలు ప్రదర్శించిన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సెలవు దినాన్ని సంభ్రమాశ్చర్యాలతో, ఆసాంతం ఆహ్లాద పరిచేలా వేడుక కనులవిందుగా నిర్వహించారని అక్కడకు వచ్చిన మహిళలు తమ అనుభూతిని పంచుకున్నారు.

ఈ వేడుకలను పురస్కరించుకుని తానా అధ్యక్షులు అంజయ్యచౌదరి లావు మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. తానా 23వ మహాసభల సమన్వయకర్త రవి పొట్లూరి మాట్లాడుతూ.. సమాజ నిర్మాణంలో సగభాగమైన స్త్రీ సమానత్వమే మన ప్రగతికి మూలమన్నారు. విద్య, వైద్య, వ్యాపార, రాజకీయ, క్రీడ, ఆర్థిక, అంతరిక్ష, టెక్నాలజీ వంటి పలు రంగాల్లో మహిళలు ఎన్నో విజయాలు సాధిస్తున్నారని పేర్కొన్నారు. రంగం ఏదైనా పురుషులతో సమానంగా ఉన్నత శిఖరాలు అందుకుంటున్నారని ప్రశంసించారు. ‘‘మహిళలు మీకు జోహార్లు’’ అంటూ వందనం చేశారు. తానా కమ్యూనిటీ సర్వీసెస్ కోఆర్డినేటర్ రాజా కసుకుర్తి మాట్లాడుతూ.. స్త్రీల జీవన ప్రమాణాలు దేశ అభ్యున్నతికి కొలమానాలని పేర్కొన్నారు. ఒక తల్లిగా, తోబుట్టువుగా, బిడ్డగా, భార్యగా రకరకాల అవతారాలలో మగవారి జీవితానికి ఒక అర్థం పరమార్థం తెచ్చే మహిళామూర్తులందరికి పాదాభివందనం అని అన్నారు. తానా ఉమెన్ కోఆర్డినేటర్ ఉమా కటికి ప్రసంగం మహిళలందరిలోనూ స్ఫూర్తినింపేలా సాగింది. ఉమెన్స్ సర్వీసెస్ కోఆర్డినేటర్‌గా అందించిన సేవలు, గృహహింసకు లోనైనా మహిళలకు, వరకట్న వేధింపులకు గురైన మగువలకు ఆసరాగా నిలిచినిన పలు సందర్భాలు ఆమె నెమరేసుకున్నారు. 

ఈ సందర్భంగా వైద్య రంగంలో అత్యున్నత సేవలందిస్తునందుకు గానూ ప్రముఖ వైద్యురాలు డా.శైలజ ముసునూరు, డా.ప్రమీల మోటుపల్లి, డాక్టర్ ప్రశాంతి బొబ్బా, స్వర్ణ జువెలర్స్ అలివేలు రాచమడుగు, మిస్ ఇండియా డెలావేర్ శ్వేతా కొమ్మోజీని ఘనంగా సత్కరించారు.మిడ్ అట్లాంటిక్ మహిళా కోఆర్డినేటర్ సరోజ పావులూరి, భవాని కొత్తపల్లి, లక్ష్మి ముద్దన, మనీషా మేక, రాజేశ్వరి కొడాలి, భవాని మామిడి, దీప్తి కొక, రమ్య పావులూరి, లక్ష్మి కసుకుర్తి, మైత్రి నడింపల్లి, ఇందు పొట్లూరి, రూప ముద్దన, హిమబిందు కోడూరు, స్మిత తదితరులు ఈ కార్యక్రమ విజయానికి కృషి చేశారు.

ఈ కార్యక్రమంలో తానా 23వ మహాసభల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రవి మందలపు, కార్యదర్శి సతీష్ తుమ్మల, మిడ్ అట్లాంటిక్ ప్రాంత ప్రతినిధి సునీల్ కోగంటి, తానా ఫౌండేషన్ ట్రస్టీ శ్రీనివాస్ ఓరుగంటి, తానా టీం స్క్వేర్ కో చైర్ కిరణ్ కొత్తపల్లి, రంజిత్ మామిడి, చలం పావులూరి, ఫణి కంతేటి, ప్రసాద్ కొత్తపల్లి, విశ్వనాథ్ కోగంటి, రామ ముద్దాన, రవి తేజ ముత్తు, కృష్ణ నందమూరి, కోటి బాబు యాగంటి, సాంబయ్య కోటపాటి, గోపి వాగ్వాల, సతీష్ మేక, సతీష్ చుండ్రు, వెంకట్ సింగు, మూర్తి నూతనపాటి, రమణ రాకోతు, హర్రీస్ బర్గ్ తానా టీం, తెలుగు అసోసియేషన్ అఫ్ గ్రేటర్ డెలావేర్ వాలీ అధ్యక్షులు ముజీబుర్ రెహ్మాన్ తదితరులు పాల్గొన్నారు.

ఇక ఈ కార్యక్రమంలో భాగంగా పసందైన విందు స్పాన్సర్ చేసినందుకు గానూ డెక్కన్ స్పైస్ వారికి, రుచికరమైన కాఫీ స్పాన్సర్ చేసిన భూమి కాఫీ ప్రొప్రైటర్ పాపారావు ఉండవల్లి, స్వర్ణ జెవెలర్స్‌, లక్ష్మి మోపర్తి, వ్యాఖ్యాతగా వ్యవహరించిన లక్ష్మి కులకర్ణి, మాన్విత యాగంటి, వ్యోం కొత్తపల్లి, కార్యక్రమం జయప్రదం చేసిన నారీమణులకు, వాలంటీర్లకు ఫిలడెల్ఫియా తానా టీం ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. 

ఇంతమంది ఆదర్శ వనితలు ఒక చోట చేరి, అటపాటలతో, కేరింతలతో హోరేత్తించడం తమకు ఎంతో సంతృప్తినిచ్చిందంటూ వేడుకకు వచ్చినవారికి నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. రస్నా బేబీ, సింహాద్రి ఫేమ్ చిత్ర కథానాయిక అంకిత ఝవేరి రాకతో వేడుక మరింత శోభాయమానంగా మారింది. 


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని