Justice NV ramana: తెలుగు ప్రజల్లో ఒకడిగా ఉండటాన్ని గర్విస్తున్నా: జస్టిస్‌ ఎన్వీ రమణ

తెలుగు ప్రజల్లో తానూ ఒకడిగా ఉండటాన్ని గర్విస్తున్నట్లు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ అన్నారు.

Updated : 25 Jun 2022 12:20 IST

న్యూజెర్సీ: తెలుగు ప్రజల్లో తానూ ఒకడిగా ఉండటాన్ని గర్విస్తున్నట్లు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ అన్నారు. తెలుగు కమ్యూనిటీ ఆఫ్‌ అమెరికా ఆధ్వర్యంలో న్యూజెర్సీలో నిర్వహించిన మీట్‌ అండ్‌ గ్రీట్‌ కార్యక్రమంలో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ దంపతులు పాల్గొన్నారు. మా తెలుగుతల్లికి మల్లెపూలదండతో కార్యక్రమం ప్రారంభమైందని.. తెలుగుతల్లి ముద్దుబిడ్డగా ఉన్న వారిని కలవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. అమెరికాలో దాదాపు 7 లక్షల మంది తెలుగువారు ఉన్నారని.. ఎన్నో దశల్లో అనేక పరీక్షలు ఎదుర్కొని ముందుకు సాగుతున్నారన్నారు. మాతృభూమిని సొంత మనుషులను వదులుకొని ఇక్కడ ఉంటున్నారని పేర్కొన్నారు. ఆచార వ్యవహారాలకు పెద్దపీట వేస్తూ జీవితాన్ని గడుపుతున్నారని కొనియాడారు. మీ నిబద్ధత చూస్తుంటే తెలుగుజాతి భవిష్యత్తు సురక్షితమని విశ్వసిస్తున్నానని చెప్పారు. పుట్టిన ఊరు, మట్టి వాసన గుబాళింపును నెమరువేసుకోవాలని జస్టిస్‌ ఎన్వీ రమణ వెల్లడించారు.

మాతృభాషలోనే చదివి నేను ఈ స్థాయికి ఎదిగాను

‘‘మాతృభాషలోనే చదివి నేను ఈ స్థాయికి ఎదిగాను. లా మాత్రమే ఆంగ్ల మాధ్యమంలో చదివా. మన భాష, సంస్కృతలి మరచిపోతే జాతి అంతరించిపోయే ప్రమాదం ఉంది. తెలుగు భాష కోసం ఉద్యమం చేయాల్సిన దుస్థితి రావడం బాధగా ఉంది. మాతృభాషలో చదివితే ఉద్యోగాలు రావనేది కేవలం అపోహ మాత్రమే. నేను మాతృభాషలో చదివి ఈ స్థాయికి వచ్చాననేది మర్చిపోవద్దు. జాషువా, దాశరథి, శ్రీశ్రీ వంటి మహానుభావులు వెలకట్టలేని సంపద ఇచ్చారు. తెలుగు కళారంగాన్ని ప్రభావితం చేసిన ఎన్టీఆర్‌ శతజయంతి ప్రారంభమైంది. ఎన్టీఆర్‌, ఘంటశాల ఉచ్ఛారణ మా తరానికి అలవడింది. ఈ సందర్భంగా వారికి నివాళి ఘటిస్తున్నా. అమెరికాలో తెలుగువారు సంపద సృష్టిస్తున్నారని చెప్తుండడం గర్వకారణం. తెలుగు అనేది కేవలం భాష కాదు.. జీవన విధానం. మాతృభాష, మాతృభూమిలో ఉన్న ప్రేమను ఆస్వాదించాలి. మన భాషతో పాటు పరాయి భాషనూ గౌరవించాలి. మాతృభాష, మాతృమూర్తిని పూజించడం ఒక ప్రత్యేకత. అమ్మభాషలోని తియ్యదనాన్ని అనుభవించాల్సిందే.. మాటల్లో చెప్పలేం. ఇంట్లో పిల్లలతో పెద్దలు తెలుగులో మాట్లాడాలని కోరుతున్నా. తెలుగు సదస్సులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలి’’ అని సీజేఐ కోరారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని