Mata first convention: అమెరికాలో వైభవంగా ‘మాటా’ తొలి క‌న్వెన్ష‌న్

అమెరికాలో  ‘మన అమెరికన్ తెలుగు అసోసియేషన్’ (MATA) తొలి క‌న్వెన్ష‌న్ వేడుక‌లు అట్టహాసంగా ముగిశాయి .

Updated : 18 Apr 2024 13:12 IST

న్యూజెర్సీ: అమెరికాలో ‘మన అమెరికన్ తెలుగు అసోసియేషన్’ (MATA) తొలి క‌న్వెన్ష‌న్ వేడుక‌లు అట్టహాసంగా ముగిశాయి. 'మాటా' ఫౌండర్‌, ప్రెసిడెంట్‌ శ్రీనివాస్‌ గనగోని ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన ఈ కార్యక్రమానికి న్యూజెర్సీలోని రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్ వేదికైంది. సినీనటులు అలీ దంప‌తులు, నిఖిల్, బిగ్‌బాస్ ఫేమ్‌ కౌశల్ ముఖ్య అతిథులుగా పాల్గొని సంద‌డి చేశారు. వివిధ రంగాల ప్రముఖులను ఈ సందర్భంగా 'మాటా' అవార్డుల‌తో సత్కరించారు. 'మాటా' లైఫ్‌టైం అఛీవ్‌మెంట్ అవార్డు డా. మ‌లిరెడ్డి శ్రీ‌నివాసులు రెడ్డి, శ్యామ‌రెడ్డిల‌కు దక్కింది. హీరో నిఖిల్‌కు ప్రొక్లేషన్‌తో గౌర‌వ‌ గుర్తింపును సెనెటర్ అందజేశారు. అనంతరం మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ స్పెషల్ సావనీర్‌ను ఆవిష్కరించారు. 

ఈ వేడుక‌ల్లో నిర్వ‌హించిన‌ రాజకీయ సదస్సు, స్టార్టప్‌, యూత్ ఫోరమ్, మాటా సింగింగ్ స్టార్,హెల్త్ సెమినార్, విమెన్ ఫోరమ్, ఘంటశాల గానామృతం, మాటా మ్యాట్రిమొనీ కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. స్టాల్స్‌ ఆకట్టుకున్నాయి. సింగ‌ర్ కార్తీక్ మ్యూజిక్ షో అలరించింది. శ్రీ‌ద‌త్తాపీఠం నిర్వాహకులు ర‌ఘుశ‌ర్మ శంక‌ర‌మంచి క‌న‌క‌దుర్గ విశిష్ట పూజ నిర్వ‌హించారు. ఫోక్ కొరియోగ్రాఫ‌ర్ లింగ శ్రీ‌నివాస్ కోలాటాలు, డప్పు వంటి సాంస్కృతిక కార్య‌క్ర‌మాల‌తో ఉర్రూతలూగించారు. ఈ క‌న్వెన్ష‌న్‌ బ‌డ్జెట్‌లో కొంత సేవా కార్య‌క్ర‌మాల‌కు వినియోగిస్తున్న‌ట్లు 'మాటా' ప్రెసిడెంట్‌ శ్రీనివాస్‌ గనగోని ప్ర‌క‌టించారు. మాటా ప్రారంభించిన ఏడాదిలోపే త‌మ సంఘం అమెరికాలో భారీగా విస్త‌రించ‌డం గ‌ర్వంగా ఉంద‌న్నారు. అందుకు స‌హ‌క‌రించిన వారందరికీ, స్పాన్స‌ర్ల‌కు ధ‌న్య‌వాదాలు తెలిపారు.

ఈ సందర్భంగా తానా, ఆటా, నాట్స్.. తదితర సంఘాల నాయ‌కులు మాటా క‌న్వెన్ష‌న్ స‌భ్యులకు శుభాకాంక్ష‌లు తెలిపారు. తెలుగింటి  వంటకాలు ఘుమ‌ఘుమ‌లాడాయి. సుమారు 3000 మందికి పైగా తెలుగువారు పాల్గొన‌డంతో కార్యక్రమం విజ‌య‌వంత‌మైంది. దుర్గాపూజా నృత్యంతో పాటు అంబేడ్కర్‌ పాట‌ల‌కు నృత్యాలు ప్ర‌ద‌ర్శించ‌డంలో క‌న్వీన‌ర్ స్వాతి అట్లూరి ప్ర‌ధాన పాత్ర‌ పోషించారు. 30కి పైగా కమిటీలను సమన్వయం చేసి, సదస్సు విజయవంతం కావడానికి  కోఆర్డినేటర్ కిరణ్ దుద్దగి కృషి చేశారు. సెక్రటరీ ప్రవీణ్ గూడూరు కార్పొరేట్ స్పాన్సర్‌లు, సావనీర్‌తో సహా అనేక రంగాలలో సహాయం చేశారు. కోఆర్డినేట‌ర్ విజయ్ కలాల్ ఆతిథ్య ఏర్పాట్లు నిర్వ‌హించారు. 'మాటా' ఫౌండ‌ర్, అడ్వైజ‌రీ క‌మిటీ స‌భ్యులు ప్ర‌దీప్ సామ‌ల‌, అడ్వైజ‌ర్ జితేంద‌ర్ రెడ్డి, కోఆర్డినేట‌ర్  విజ‌య్ భాస్క‌ర్ క‌ల‌ల్, క‌న్వెన్ష‌న్ అడ్వైజ‌రీ, ఎగ్జిక్యూటివ్ క‌మిటీ స‌భ్యులు, గౌర‌వ స‌ల‌హ‌దారులు కార్యక్రమాన్ని విజ‌యవంతం చేయ‌డంలో కీల‌క పాత్ర వ‌హించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని